న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9,491 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ) హై రిస్క్ ఉన్నవిగా పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా విడుదల చేసింది. ఇవన్నీ యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను పాటించడం లేదని ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం (ఎఫ్‌ఐయూ) గుర్తించింది. తదనంతరం వీటితో ఓ జాబితాను రూపొందించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఎన్‌బీఎఫ్‌సీలు (కోపరేటివ్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు) తమ ఆర్థిక కార్యకలాపాల వివరాలను, లావాదేవీల వివరాలను తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన ఎఫ్‌ఐయూ ప్రధానంగా ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించాలన్న నిబంధనను పాటించడం లేదని గుర్తించింది.
సంబంధిత అధికారి రూ.10 లక్షలకు పైబడిన లావాదేవీలను పరిశీలించి అనుమానాస్పదమైతే వాటి గురించి ఎఫ్‌ఐయూకి నివేదించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కంపెనీల లావాదేవీలపై ఎఫ్‌ఐయూ నిఘా వేసి, పలు మార్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నిబంధనలు పాటించడం లేదని, హైరిస్క్ ఉన్నవిగా నిర్ధారించి జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థలతో లావాదేవీలు నిర్వహించడం ద్వారా నష్టపోవద్దని ప్రజలను అప్రమత్తం చేయడమే ఎఫ్‌ఐయూ ఉద్దేశం. ఈ సంస్థల పూర్తి జాబితాను www.sakshibusiness.com లో చూడొచ్చు
Comments
Please login to add a commentAdd a comment