మూడో రోజూ నష్టాలే..
28వేల దిగువకు సెన్సెక్స్, 8,500 దిగువకు నిఫ్టీ
- 236 పాయింట్లు క్షీణించి 27,866కు సెన్సెక్స్
- 63 పాయింట్ల నష్టంతో 8,462కు నిఫ్టీ
ఆర్థిక సంస్కరణల అనిశ్చితికి నిరాశపరచిన ఎస్‌బీఐ ఆర్థిక ఫలితాలు తోడవడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు క్షీణపథంలోనే సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పతనమాయ్యాయి. సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 27,866 పాయింట్ల వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 8,462 పాయింట్ల వద్ద ముగిశాయి. చైనా తన కరెన్సీ యువాన్ విలువను తగ్గించడం, దీంతో ఇంట్రాడేలో రూపాయి 40 పైసలు క్షీణించడం, కొనసాగుతున్న కమోడిటీ ధరల పతనం, కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేకపోవడం... ప్రభావం చూపాయి. రియల్టీ, బ్యాంక్, వాహన, క్యాపిటల్ గూ డ్స్, రిఫైనరీ షేర్లు పతనమయ్యాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 432 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 63 పాయింట్లు క్షీణించి 8,462 పాయింట్ల వద్ద ముగిసింది.
చైనా కరెన్సీ విలువ తగ్గింపు ఎఫెక్ట్...
మందగమనంలో ఉన్న తన ఆర్థిక వ్యవస్థలో జోష్ నింపడానికి చైనా ప్రభుత్వం యువాన్ కరెన్సీ విలువను 2 శాతం వరకూ తగ్గించింది. చైనా కరెన్సీ విలువను తగ్గించడంతో ఆ దేశం నుంచి టైర్ల ఉత్పత్తులు చౌక ధరలతో వెల్లువెత్తుతాయనే ఆందోళనతో టైర్ల కంపెనీల షేర్లు పతనమయ్యాయి. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, ఎంఆర్‌ఎఫ్, సియట్, గుడ్‌ఇయర్ ఇండియా, అపోలో టైర్స్ కంపెనీల షేర్లు 12 శాతం వరకూ నష్టపోయాయి. యువాన్ కరెన్సీ డీవాల్యూయేషన్ కారణంగా ఆ దేశానికి ఎగుమతులు ఖరీదవుతాయనే ఆందోళనతో టాటా స్టీల్, హిందాల్కో, వేదాంత షేర్లు 3-5.5 శాతం రేంజ్‌లో పడిపోయాయి. రూపాయి క్షీణత కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ షేర్లు 2 శాతం వరకూ పెరిగాయి.
చైనా కరెన్సీ 2% డీవాల్యూ
బీజింగ్: చైనా కేంద్ర బ్యాంక్(పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా-పీబీఓసీ) యువాన్ కరెన్సీ విలువను డీవాల్యూ చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండడం, ఇటీవల స్టాక్ మార్కెట్ భారీ పతనం నేపథ్యంలో యువాన్ విలువను 2 శాతం తగ్గించింది. ఈ మార్పు కారణంగా డాలరుతో పోలిస్తే యువాన్ కరెన్సీ సెంట్రల్ పారిటీ రేట్ 1,136 బేసిస్ పాయింట్లు తగ్గి 6.2298కు పడిపోయింది. యువాన్ విలువను తగ్గించడం వల్ల చైనా ఎగుమతులు మరింత చౌకఅవుతాయి, చైనాకు ఎగుమతుల ఆదాయం పెరుగుతుంది.
పవర్‌మెక్ ఇష్యూకు అనూహ్య స్పందన
ఇన్వెస్టర్ల నుంచి పవర్‌మెక్ పబ్లిక్ ఇష్యూకు అనూహ్య స్పందన వచ్చింది. మంగళవారంతో ముగిసిన ఈ ఇష్యూ 38.06 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది.