
విజయ్ మాల్యానునిందితుడిగా ప్రకటించండి
మనీ లాండరింగ్ కోర్ట్‌కు ఈడీ వినతి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో కింగ్ ఫిషర్ విజయ్ మాల్యాను నిందితుడిగా ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్ట్‌ను కోరింది. ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.900 కోట్ల రుణ మోసానికి సంబంధించి విజయ్ మాల్యాపై మనీ లాండరింగ్ కేసు విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ) సెక్షన్ 82 కింద ఆయనను నిందితుడిగా ప్రకటించాలని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్‌ఏ) కోర్టను కోరామని ఈడీ ఉన్నతాధికారులు తెలిపారు. తమ విన్నపంపై ఈ కోర్టు జూన్ 13న ఆదేశాలు చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
కేసు దర్యాప్తు వివరాలను కోర్టుకు నివేదించామని, మాల్యాను విచారించాల్సిన అవసరాన్ని వివరించామని కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్ 82 కింద ప్రకటిత నిందితుడు నిర్దేశిత సమయంలో నిర్దేశిత ప్రదేశంలో ప్రకటన జారీ చేసిన 30 రోజుల్లో హాజరు కావలసి ఉంటుంది. సెక్షన్ 82 కింద విచారణకు మాల్యా సహకరించకపోతే సీఆర్‌పీసీ సెక్షన్ 83 కింద ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకునే ఆప్షన్ కూడా ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. పీఎంఎల్‌ఏ కింద విజయ్ మాల్యాకు చెందిన రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడానికి ఈ ఏజెన్సీ సిద్ధమవుతోంది.