గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ ప్లాంట్: తోషిబా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తోషిబా ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) హైదరాబాద్ ప్లాంటును అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనుంది. ఇందులో భాగంగా 2017 నాటికి మరో రూ.200 కోట్లను వెచ్చించనున్నట్టు కంపెనీ సీఎండీ కట్సుటోషి టోడ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. తద్వారా మరో 1,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా డిమాండ్ నేపథ్యంలో ఇటీవలే కంపెనీ రూ.200 కోట్లతో విస్తరణ పూర్తి చేసింది. ఈ పెట్టుబడితో ప్లాంటు సామర్థ్యం 50 శాతం పెరిగింది.
అలాగే నూతన తరం స్విచ్‌గేర్స్ తయారీకి ప్రత్యేక లైన్‌ను ఏర్పాటు చేశామన్నారు. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ వినియోగిస్తున్నట్టు వివరించారు. కంపెనీకి హైదరాబాద్ సమీపంలో రుద్రారం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ ప్లాంటు ఉంది. 20 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. అమ్మకాల్లో ఎగుమతుల వాటా మూడింట ఒక వంతు ఉంది. దీనిని 2018 నాటికి 50 శాతానికి చేర్చడమేగాక భారత్‌లో అన్ని విభాగాల్లో 20 శాతం మార్కెట్ వాటా కంపెనీ లక్ష్యం. విజయ్ ఎలక్ట్రికల్స్ నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు, స్విచ్‌గేర్ల వ్యాపారాన్ని తోషిబా కార్పొరేషన్ 2013లో కొనుగోలు చేసింది. ప్లాంటులో 6,000 మంది పనిచేస్తున్నారు.