
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ భారీగా పతనం కావడం కన్నా అంతకంతకూ పెరిగిపోతున్న వాణిజ్య లోటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎగుమతులు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొన్ని రంగాలకు రూపాయి పతనం లబ్ధి చేకూర్చేదే అయినప్పటికీ, కొంతకాలం వాటిని పక్కన పెట్టాల్సి ఉంటుందన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు.
‘రూపాయి మారకం విలువ బలంగా ఉండాలని నేను అనుకోను. అది వాస్తవ పరిస్థితికి తగ్గట్లుగా ఉండాలి. కొన్ని దేశాలు కావాలనే తమ కరెన్సీ విలువను తగ్గించేసుకుంటూ ఉంటాయి. ఇది చాలా తప్పు. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయిని పటిష్టపర్చడమనేది భారత్‌కు చాలా కష్టతరమైన అంశం‘ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రపంచ వాణిజ్యంలో మన ఎగుమతుల వాటా చాలా తక్కువగా ఉంటుంది.
సేవల రంగంలో కూడా చైనా కన్నా మన వాటా తక్కువే ఉంటోంది. దీన్ని గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది‘ అని రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 16న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టమైన 70.32 స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది జూలైలో దిగుమతులు భారీగా పెరగడంతో వాణిజ్య లోటు అయిదేళ్ల గరిష్ట స్థాయి 18.02 బిలియన్ డాలర్లకు ఎగిసింది.
ప్రభుత్వ వ్యయాలతో డిమాండ్‌కు ఊతం..
ప్రైవేట్ పెట్టుబడులు కనిష్టస్థాయిలకు పడిపోయిన నేపథ్యంలో డిమాండ్‌ను మెరుగుపర్చడానికి ప్రభుత్వ వ్యయాలను పెంచడానికే దోహదపడుతోందని రాజీవ్ కుమార్ తెలిపారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా పెరగకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన చెప్పారు. అటు, భారత్ 9–10 శాతం స్థాయిలో వృద్ధి రేటును సాధించడం మొదలైన తర్వాత నుంచి వాణిజ్య ఒప్పందాలు మనకు అనుకూలంగా ఉండేలా బేరమాడేందుకు పటిష్టమైన స్థితిలో ఉండగలదని ఆయన తెలిపారు. ఉద్యోగాల కల్పన లేని వృద్ధి అంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment