ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ.3,050 కోట్ల జరిమానా
• టెలికం శాఖకు ట్రాయ్ సిఫారసు
• జియోకు ఇంటర్‌కనెక్షన్ సర్వీసులివ్వకపోవడమే కారణం
న్యూఢిల్లీ: కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇంటర్ కనెక్టివిటీ సర్వీసులు నిరాకరించిన ఫలితంగా భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లపై రూ.3,050 కోట్ల జరిమానా విధించాలని టెలికం శాఖకు రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం సిఫారసు చేసింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ విషయంలో జమ్మూ- కాశ్మీర్ మినహా 21 సర్కిళ్లకు రూ.50 కోట్ల చొప్పున, అలాగే ఐడియాపై ఇంతే మొత్తాన్ని 19 సర్కిళ్లకు విధించాలన్నది ట్రాయ్ సిఫారసుల సారాంశం.
మూడు టెలికం సంస్థల ధోరణి పోటీ తత్వానికి, వినియోగదారుల ప్రయోజనానికి విఘాతమని పేర్కొంది. సెప్టెంబర్ 5న జియో సేవలను ప్రారంభించింది. అయితే తనకు తగిన సంఖ్యలో ఇంటర్‌కనెక్షన్ పోర్ట్స్‌ను అందించడానికి పోటీ కంపెనీలు నిరాకరించినట్లు ట్రాయ్‌కి జియో ఫిర్యాదు చేసింది. దీనివల్ల తన నెట్‌వర్క్‌పై భారీగా ‘కాల్ వైఫల్యాలు’ వచ్చినట్లు వివరించింది. కాగా జరిగిన పరిణామంపై వ్యాఖ్యానించడానికి టెలికం కంపెనీలు నిరాకరించాయి.