హైదరాబాద్‌లో స్టార్ హైపర్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్ పేరుతో గ్రాసరీ రిటైల్ చైన్లను నిర్వహిస్తున్న ట్రెంట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడి గచ్చిబౌలిలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ హైపర్‌మార్కెట్‌ను ప్రారంభించింది. ఇందుకోసం రూ.8 కోట్ల వ్యయం చేసింది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, దుస్తుల వంటి 16,000 పైచిలుకు ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణే నగరాల్లో 200 ఔట్‌లెట్లను తెరవనుంది.
టాటా, టెస్కోలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ట్రెంట్‌కు ప్రస్తుతం 45 స్టోర్లున్నాయి. 20–25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ హైపర్, 8–10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టార్ మార్కెట్ పేరుతో కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు ట్రెంట్ హైపర్‌మార్కెట్ ఎండీ జమ్షెద్ దబూ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. స్టార్ మార్కెట్‌కు ఒక్కో సెంటర్‌కు రూ.4 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. రూ.25 కోట్లతో పటాన్‌చెరు వద్ద భారీ గిడ్డంగిని కంపెనీ నెలకొల్పుతోంది.
వికలాంగులకు ఉపాధి..: ఒక్కో హైపర్ స్టోర్‌లో 100 మంది, స్టార్ మార్కెట్ కేంద్రానికి 30 మంది సిబ్బందిని కంపెనీ నియమిస్తోంది. సిబ్బందిలో 10% మంది వికలాంగులు ఉన్నారు. వీరి సంఖ్యను 25 శాతానికి చేరుస్తామని జమ్షెద్ తెలిపారు. సామాజిక బాధ్యత కింద ఈ విధంగా చొరవ తీసుకుంటున్నట్టు చెప్పారు.