
న్యూఢిల్లీ: టెల్కోలు మరింత మెరుగైన సర్వీసులు అందించేలా టెలికం రంగ నియంత్రణ ట్రాయ్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా కాల్ కనెక్షన్ టైమ్, కాల్ మ్యూట్ అంశాలను కూడా నాణ్యతా ప్రమాణాల జాబితాలోకి చేర్చింది. అక్టోబర్ 1 నుంచి వీటికి సంబంధించిన డేటాను సేకరిస్తున్నట్లు, తగు పరిష్కార మార్గాలను కనుగొనడంపై దృష్టి పెట్టనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు.
నంబర్ డయల్ చేసిన తర్వాత కాల్ కనెక్ట్ అవడానికి పట్టే వ్యవధిని కాల్ కనెక్షన్ టైమ్‌గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాల్లో డయల్ చేసిన 30 సెకన్ల దాకా కూడా కాల్ కనెక్ట్ కాకపోతుండటాన్ని గుర్తించిన ట్రాయ్ .. తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు శర్మ తెలిపారు.