
వాషింగ్టన్: చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్‌ను టేకోవర్ చేసేందుకు సింగపూర్ సంస్థ బ్రాడ్‌కామ్ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. జాతీయ భద్రతా కారణాల రీత్యా ఈ డీల్‌కు అనుమతివ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ క్వాల్‌కామ్‌ను గానీ బ్రాడ్‌కామ్ టేకోవర్ చేసిన పక్షంలో ఆ సంస్థ అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే విధమైన చర్యలు తీసుకోవచ్చంటూ విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయంటూ ట్రంప్ వివరించారు.
వాటి ఆధారంగానే టేకోవర్ డీల్‌కు అనుమతులు నిరాకరిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘ప్రతిపాదిత టేకోవర్ ఒప్పందాన్ని తక్షణమే శాశ్వతంగా పక్కన పెట్టాలి‘ అని బ్రాడ్‌కామ్, క్వాల్‌కామ్‌లను ట్రంప్ ఆదేశించారు. క్వాల్‌కామ్‌ను బ్రాడ్‌కామ్ టేకోవర్ చేయడం నిషిద్ధమని, అలాగే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడాన్ని కూడా నిషేధిస్తున్నట్లు సంబంధిత ఉత్తర్వుల్లో ట్రంప్ స్పష్టం చేశారు.
దాదాపు 117 బిలియన్ డాలర్ల ఈ డీల్ గానీ సాకారమైన పక్షంలో ఇంటెల్, శాంసంగ్ తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మైక్రో చిప్ తయారీ సంస్థ ఆవిర్భవించేది. అంతే కాకుండా టెక్నాలజీ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్‌గా కూడా నిల్చేది. అయితే, అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం క్వాల్‌కామ్ గానీ ఆసియా సంస్థ బ్రాడ్‌కామ్ చేతుల్లోకి వెళ్లిపోయిన పక్షంలో .. మొబైల్ టెక్నాలజీలో అమెరికా ఆధిపత్యానికి గండిపడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను పరిశీలిస్తున్నట్లు బ్రాడ్‌కామ్ పేర్కొంది. క్వాల్‌కామ్‌ను కొనుగోలు చేయడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందన్న ఆందోళనలను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment