రియల్టీలో ట్రంప్‌ బ్రాండ్‌! | trump brand in indian reality | Sakshi
Sakshi News home page

రియల్టీలో ట్రంప్‌ బ్రాండ్‌!

Published Sat, Jan 21 2017 12:16 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

రియల్టీలో ట్రంప్‌ బ్రాండ్‌! - Sakshi

రియల్టీలో ట్రంప్‌ బ్రాండ్‌!

5 ప్రాజెక్ట్‌లతో ఒప్పందం చేసుకున్న ట్రంప్‌ ఆర్గనైజేషన్‌
నిర్మాణ దశలోనే 60 శాతం అమ్మకాలు పూర్తి
ఇతర స్థానిక ప్రాజెక్ట్‌లతో పోల్చితే 30 శాతం ధరలెక్కువ


డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాకు అధ్యక్షుడు. కానీ, మన దేశంలో మాత్రం టాప్‌ బ్రాండ్‌. ట్రంప్‌ పేరు చెబితే చాలు స్థిరాస్తి ప్రాజెక్ట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి మరి. దేశంలోని పలు నిర్మాణ సంస్థలు ట్రంప్‌ ఆర్గనైజేషన్‌తో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల ప్రీమియం ఫ్లాట్లు వేడి పకోడిల్లా అమ్ముడవుతుంటే.. నయా పైసా పెట్టుబడి లేకుండా ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది.

సాక్షి, హైదరాబాద్‌:
ముంబై, పుణె, గుర్గావ్, కోల్‌కతా నగరాల్లో లోధా గ్రూప్, పంచశీల్, ఐఆర్‌ఈఓ, ఎం3ఎం, యూనీమార్క్‌ సంస్థలు నిర్మించే 5 ప్రాజెక్ట్‌లతో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి విలువ సుమారు 1.5 బిలియన్‌ డాలర్లుగా ఉంటుంది. ఈ ఒప్పందంతో ఆయా ప్రాజెక్ట్‌ల అమ్మకాల కోసం ట్రంప్‌ పేరును బ్రాండ్‌గా వినియోగించుకునే వీలు నిర్మాణ సంస్థలకుంటుంది. లైసెన్సింగ్‌ ఫీజు రూపంలో ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కూ ఆదాయమొస్తుంది. అయితే ఈ ఒప్పందం కేవలం ఆయా ప్రాజెక్ట్‌లకే పరిమితమని.. పైగా వీటి నిర్మాణంలో నయా పైసా పెట్టుబడులు కూడా పెట్టలేదని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది.
ఇక ఆయా ప్రాజెక్ట్‌ల అమ్మకాలు, ధరల విషయానికొస్తే.. స్థానికంగా నిర్మించే ఇతర ప్రాజెక్ట్‌లతో పోలిస్తే ఈ ప్రాజెక్ట్‌ల అమ్మకాలు నిర్మాణ దశలోనే 60 శాతానికి పైగా పూరైతే..  ధరలూ 30  శాతం అధికంగా ఉన్నాయి.
ఆయా ప్రాజెక్ట్‌లు ఏంటంటే.. లోధా గ్రూప్‌ ముంబైలోని వర్లీలో 17.5 ఎకరాల్లో ట్రంప్‌ టవర్స్‌ను నిర్మిస్తోంది. 75 అంతస్తుల్లో మొత్తం 300 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.9 కోట్లు. కొనుగోలుదారులకు ట్రంప్‌ కార్డ్‌ను ఇస్తారు. దీంతో ప్రపం^è వ్యాప్తంగా ట్రంప్‌ హోటళ్లు, రిసార్ట్స్‌ల్లో ప్రత్యేక కేటాయింపులు, ఆఫర్లను అందుకోవచ్చు.
పుణెలోని కల్యానీ నగర్‌లో పంచశీల్‌ సంస్థ 2.68 లక్షల చ.అ.ల్లో ట్రంప్‌ టవర్‌ను నిర్మిస్తోంది. 2 టవర్లలో ఒక్కో టవర్‌ 23 అంతస్తుల్లో ఉంటుంది. ఒక్కో అంతస్తుకు ఒక్కో అపార్ట్‌మెంట్‌ దీని ప్రత్యేకత. ప్రతి ఫ్లాట్‌ 6,100 చ.అ. మేర విస్తరించి ఉంటుంది. ధర రూ.13 కోట్లు. ఇప్పటికే బాలీవుడ్‌ నటులు రిషీ కపూర్, రణబీర్‌ కపూర్‌ ఫ్లాట్లు కొనేశారు కూడా.
గుర్గావ్‌లోని గోల్ఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ రోడ్‌లో ఐఆర్‌ఈఓ సంస్థ అస్కాట్‌ ఏరోసిటీ పేరిట కార్యాలయ సముదాయాన్ని నిర్మిస్తోంది. ఇది 6–7 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌లో ఫైవ్‌ స్టార్‌ డ్యూలెక్స్‌ హోటల్స్, రిటైల్, షాపింగ్‌ సముదాయాలుంటాయి. ఇదే ప్రాంతంలో ఎం3ఎం సంస్థ  భారీ నివాస సముదాయాన్ని నిర్మిస్తుంది కూడా.
కోల్‌కతాలో యూనీమార్క్‌ గ్రూప్‌ తూర్పు మెట్రోపాలిటన్‌ బైపాస్‌ ప్రాంతంలో ఈటర్నియా పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది. 3.5 లక్షల చ.అ.ల్లో రానున్న ఈ ప్రీమియం ప్రాజెక్ట్‌లో 38 అంతస్తులుంటాయి. 2,398 నుంచి 3,297 చ.అ.ల్లో 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి.

ఐటీ కొనుగోళ్లు తగ్గుతాయా?
దేశంలో స్థిరాస్తి అమ్మకాలు ఐటీ చుట్టూనే తిరుగుతుంటాయి. అంటే నివాస కొనుగోళ్లు ఐటీ ఉద్యోగులు, కార్యాలయాల కొనుగోళ్లు ఐటీ కంపెనీలే సింహభాగం. అయితే ఇప్పుడా కొనుగోళ్లకు ట్రంప్‌ గండం ఎదురుకానుంది. అదెలాగంటే.. అమెరికా వలస విధానాన్ని, హెచ్‌1బీ వీసా పాలసీలను సమీక్షించాల్సిన అవసరం ఉందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇదేగనక జరిగితే.. ఇన్నాళ్లు ఔట్‌సోర్సింగ్‌ సేవలందించే మన దేశ ఐటీ కంపెనీలకు కష్టాలు తప్పవు. సమీక్షకు తగ్గట్టుగా వేతనాలను పెంచలేని, సేవలను కొనసాగించలేని పరిస్థితి సంస్థలది. దీంతో ఇన్నాళ్లు అధిక వేతనాలతో స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ఐటీ పెట్టుబడులు ఇప్పుడు దూరమవుతాయనేది సారాంశం.

దేశంలో లగ్జరీ రియల్టీ మార్కెట్లో విదేశీ కొనుగోలుదారులు, లావాదేవీలు ఎక్కువని నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌ అధ్యయనం పేర్కొంది. ఏప్రిల్‌ 2015 నుంచి మార్చి 2016 మధ్య కాలంలో 102.6 బిలియన్‌ డాలర్ల నివాస సముదాయాలను విదేశీ కొనుగోలుదారులే చేశారని పేర్కొంది. ఈ గణాంకాలే నిర్మాణ సంస్థలని కలవరపెట్టిస్తున్నాయి.. సమీప భవిష్యత్తులో ఐటీ కొనుగోళ్లు ఎలా ఉంటాయోనని!
స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.realty@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement