
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో 31 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17)క్యూ4లో రూ.127 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.166 కోట్లకు పెరిగిందని టీవీఎస్ కంపెనీ పేర్కొంది. ఆదాయం రూ.3,076 కోట్ల నుంచి రూ.3,993 కోట్లకు ఎగసిందని కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు.
అమ్మకాలు 32 శాతం అప్...
మొత్తం అమ్మకాలు 6.74 లక్షల నుంచి 32% వృద్ధితో 8.89 లక్షలకు చేరాయని రాధాకృష్ణన్ చెప్పారు. బైక్‌ల అమ్మకాలు 2.15 లక్షల నుంచి 61% వృద్ధితో 3.46 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2.23 లక్షల నుంచి 26 శాతం వృద్ధితో 2.80 లక్షలకు పెరిగాయని తెలిపారు. మొత్తం ఎగుమతులు 1.11 లక్షల నుంచి 45% పెరిగి 1.61 లక్షలకు ఎగిశాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు మధ్యంతర డివిడెండ్‌లు(మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.3.30) ఇచ్చామని, తాజాగా ఎలాంటి డివిడెండ్‌ను ఇవ్వడం లేదని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.558 కోట్లుగా ఉన్న స్టాండెలోన్ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 19% వృద్ధితో రూ.663 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఆదాయం రూ.13,190 కోట్ల నుంచి రూ.15,473 కోట్లకు పెరిగిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడులతో పోల్చితే ఇది 55 శాతం అధికమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తులు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, కొత్త టెక్నాలజీ, భారత్ స్టేజ్ ఫోర్ అప్‌గ్రెడేషన్ నిమిత్తం ఈ పెట్టుబడులు వినియోగిస్తామని వివరించారు. కాగా ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయని, వాహనాల ధరలను పెంచే అవకాశాలున్నాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె. గోపాల దేశికన్ చెప్పారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 1.6 శాతం నష్టంతో రూ. 611 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment