ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియా ప్రఖ్యాత సంస్థ ట్విట్టర్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు కంపెనీ నుంచి వైదొలగారు. తాజాగా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) ఆడమ్ బెయిన్ కూడా ట్విట్టర్ కు టాటా చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ బిజినెస్ కు ఇంచార్జిగా ఉన్న ఆయన సంస్థ నుంచి బయటకు వెళ్లిపోనున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆంటోనీ నోటో ఇక నుంచి సీఓఓగా వ్యవహరిస్తారని ట్విట్టర్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఆరేళ్లుగా ట్విట్టర్ లో పనిచేయడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నేను కంపెనీని వదిలి పెట్టాలనుకున్న విషయం సీఈవో జాక్ డోర్సేకు ముందుగానే తెలుసు. నేను బయటకు వెళ్లి కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నాన’ని బెయిన్ ట్వీట్ చేశారు. తన బాధ్యతలు ఆంటోనీకి బదలాయించేందుకు కొన్ని వారాలు ఆయన ట్విట్టర్ లో కొనసాగుతారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా ట్విట్టర్ ఆదాయం పెంచడంతో బెయిన్ కీలకపాత్ర పోషించారు.
కాగా, వరుసగా సీనియర్ అధికారులు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతుండడం కలకలం రేపుతోంది. ట్విట్టర్ ఇండియా హెడ్ రిషి జైట్లీ, ట్విట్టర్ ఇండియా (ఆగ్నేయ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా) మేనేజింగ్ డైరెక్టర్ పర్మిందర్ సింగ్ ఇటీవలే రాజీనామా చేశారు.