ట్విటర్లో ఉద్యోగాల కోత!
న్యూయార్క్: ట్విటర్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. వృద్ధి మందగమనం.. నష్టాలు.. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీ.. సంస్థను కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడం.. ఇలా ఎన్నో సమస్యల నడుమ ఎలాగైనా వృద్ధి బాట లో పయనించడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే ట్విటర్ తన ఉద్యోగ సిబ్బందిని 9 శాతం (350 మందిని తొలగిం చాలని) తగ్గించుకోవాలని భావి స్తోంది. కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 3,860 మంది ఉద్యోగు లు ఉన్నారు. ‘భవిష్యత్తు వృద్ధి చోదకాలను గుర్తించాం.
మాకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. ప్రధాన సర్వీసుల మెరుగుదలపై దృష్టి కేంద్రీకరించాం’ అని ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే తెలిపారు. ఆయన కంపె నీ మూడవ త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘కంపెనీ నికర నష్టాలు 103 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే నష్టాలు (132 మిలియన్ డాలర్లు) కొంత తగ్గాయి. ఆదాయం 8% వృద్ధితో 616 మిలియన్ డాలర్లకు చేరింది. వచ్చే ఏడాది లాభాల్లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని వివరించారు.