ఉబర్ మాజీ సీఈవో కలానిక్‌కు కొత్త కష్టాలు
ఉబర్ మాజీ సీఈవో కలానిక్‌కు కొత్త కష్టాలు
Published Fri, Aug 11 2017 9:01 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM
శాన్‌ఫ్రాన్సిస్కో : రైడ్-హైలింగ్ సంస్థ ఉబర్‌ను స్థాపించి, దానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపంటూ తీసుకొచ్చిన ఆ కంపెనీ మాజీ సీఈవో ట్రావిస్ కలానిక్‌ను కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న కంపెనీని, వాటి నుంచి బయట పడేసేందుకు ఇన్వెస్టర్ల ఒత్తిడితో సీఈవో పదవి నుంచి తప్పుకున్న ఈయనపై తాజాగా మోసపూరిత దావా నమోదైంది. ఉబర్ అతిపెద్ద ఇన్వెస్టర్లలో ఒకటైన బెంచ్‌మార్కు వెంచర్ కలానిక్‌పై యుద్ధానికి దిగింది. మోసం, ఇతర అతిక్రమణల పేరుతో ఆయన్ను ఉబర్ బోర్డు నుంచి కూడా తొలిగించేందుకు సిద్ధమైంది. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిల్ సంస్థ అయిన బెంచ్‌మార్కు, గురువారం డెలావేర్ ఛాన్జరీ కోర్టులో కలానిక్‌పై ఫిర్యాదు నమోదుచేసింది. ఈ ఫిర్యాదులో ఉబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ మోసానికి పాల్పడినట్టు, విశ్వసనీయతకు, కాంట్రాక్ట్‌కు తూట్లుపొడిచినట్టు ఆరోపించింది. అంతేకాక 2016లో పలు బోర్డు సీట్లను కలానిక్ ఎలా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారో వివరించింది.
ఉబర్ బోర్డులో కలానిక్‌కు స్థానం ఉండటం అక్రమమని, చెల్లనిదిగా బెంచ్‌మార్కు క్యాపిటల్ తన ఫిర్యాదులోనే పేర్కొంది. ఉబర్ సీఈవోగా కలానిక్ బాధ్యతలు వహించేటప్పుడు పలు స్కాండల్స్ బయటికి వచ్చాయి. దీంతో బలవంతంగా ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం కొత్త సీఈవోగా వెతుకుతున్నట్టు రెండు రోజుల క్రితమే ఆ కంపెనీ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పారు. అంతేకాక ఉబర్ సీఈవో పదవిలోకి ఇక ట్రావిస్ కలానిక్ రారని కూడా వెల్లడించారు. ఇదే విషయాన్ని బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ప్రకటించింది. తాజాగా బోర్డు సభ్యుడిగా కూడా ట్రావిస్ కలానిక్‌ను దించేయడానికి బెంచ్‌మార్కు క్యాపిటల్ ప్రయత్నాలు ప్రారంభించింది.
అయితే ఈ దావాలో ఉన్న ప్రతీ అంశం నిరాధారమేనని, తప్పు అని కలానిక్ అధికార ప్రతినిధి చెప్పారు. కలానిక్ సీఈవోగా లేకపోయినా షాడో లీడర్‌గా కొనసాగాలని ఇతరులు కోరుకుంటున్నట్టు తెలిసింది. ఈ దావా సిలికాన్ వ్యాలీలో ఉన్న స్టార్టప్‌ల గవర్నెన్స్ సమస్యలను ఎత్తిచూపుతోందని విశ్లేషకులంటున్నారు. ఇటీవల స్టార్టప్ వ్యవస్థాపకులే తమ కంపెనీల్లో ఎక్కువ అధికారాలు పొందుతున్నారు. ఇన్వెస్టర్ల కంటే కూడా ఎక్కువగా, అన్ని ఓటింగ్ రైట్స్‌ను తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు.
Advertisement