యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి | Uncertainty Over Investment In Yes Bank | Sakshi
Sakshi News home page

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి

Dec 11 2019 1:04 AM | Updated on Dec 11 2019 1:04 AM

Uncertainty Over Investment In Yes Bank - Sakshi

ముంబై: యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని భావించగా, కేవలం 50 కోట్ల డాలర్లకే బ్యాంక్‌ సుముఖత వ్యక్తం చేసింది. సైటాక్స్‌ హోల్డింగ్స్, సైటాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ ప్రతిపాదించిన ఈ ఆఫర్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం యస్‌ బ్యాంక్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని తదుపరి బోర్డ్‌ సమావేశంలో తీసుకుంటామని వెల్లడించింది.

ఎర్విన్‌ సింగ్‌ బ్రెయిచ్‌/ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రతిపాదించిన 120 కోట్ల బిలియన్‌ డాలర్ల పెట్టుబడుల ఆఫర్‌పై డైరెక్టర్ల  బోర్డు ఇంకా పరిశీలన జరుపుతోందని పేర్కొంది. 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడులు సమీకరించే దిశగా ఇతరత్రా ఇన్వెస్టర్ల ప్రతిపాదనలపై కసరత్తును కొనసాగిస్తున్నట్లు యస్‌ బ్యాంక్‌ తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు 2018 ఆగస్టులో ప్రమోటరు, సీఈవో రాణా కపూర్‌ నిష్క్రమించినప్పట్నుంచి యస్‌ బ్యాంక్‌ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్న సంగతి తెలిసిందే. మొండిబాకీల భారం, మూలధనంపరమైన సమస్యల కారణంగా రుణ వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఈ నేపథ్యంలో కొందరు ఇన్వెస్టర్ల నుంచి 200 కోట్ల డాలర్ల దాకా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు యస్‌ బ్యాంక్‌ గత నెలలో వెల్లడించింది. వీటినే ప్రస్తుతం మదింపు చేస్తోంది.  తాజా వార్తల నేపథ్యంలో యస్‌బ్యాంక్‌ షేర్‌ 10 శాతం నష్టంతో రూ.50.55 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement