‘అన్‌లిస్టెడ్‌’ షేర్లూ.. డీమ్యాట్‌లోనే... | 'Unlistated' shares in demat | Sakshi
Sakshi News home page

‘అన్‌లిస్టెడ్‌’ షేర్లూ.. డీమ్యాట్‌లోనే...

Published Wed, Jun 6 2018 12:39 AM | Last Updated on Wed, Jun 6 2018 8:49 AM

'Unlistated' shares in demat - Sakshi

న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లో బినామీలను గుర్తించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్‌లిస్టెడ్‌ కార్పొరేట్ల షేర్లను డీమెటీరియలైజ్‌ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మరికొన్ని వారాల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో సిసలైన వాటాదారులను గుర్తించేందుకు ఇది తో డ్పడగలదని ప్రభుత్వం భావిస్తోంది.

ముందుగా 80,000–90,000 దాకా పబ్లిక్‌ కంపెనీలతో ఈ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి దేశీయంగా మొత్తం 11.7 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం షేర్ల డీమెటీరియలైజేషన్‌ ప్రక్రియ కేవలం 8,000 లిస్టెడ్‌ కంపెనీలకు మాత్రమే వర్తిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న అన్‌లిస్టెడ్‌ సంస్థల షేర్లన్నీ ఎకాయెకిన డీమ్యాట్‌ చేయడం సాధ్యపడదు కాబట్టి ముందుగా పబ్లిక్‌ కంపెనీలతో మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సదరు సంస్థల్లో 5.5–6 కోట్ల మంది పైచిలుకు వాటాదారులపై ఇది ప్రభావం చూపొచ్చని అంచనా.

సిసలైన లబ్ధిదారుల గుర్తింపు ..
డొల్ల కంపెనీల్లో చాలా మటుకు యాజమాన్య వాటాలు బినామీల పేర్లమీదే ఉంటున్నాయని పసిగట్టిన ప్రభుత్వం.. అసలు యజమానులను కూడా గుర్తించేందుకు తగు నిబంధనల రూపకల్పనపైనా కసరత్తు చేస్తోంది. పది శాతం పైగా వాటాలున్న వారిని గణనీయంగా లబ్ధి పొందే యాజమాన్య అధికారాలున్న వారిగా వర్గీకరించాలని ప్రతిపాదించనుంది. అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్‌పై పోరులో భాగంగా.. కంపెనీల చట్టంలో ఇప్పటికే కొత్తగా ఒక సెక్షన్‌ చేర్చడం జరిగింది.

దీని ప్రకారం సిసలైన లబ్ధిదారులైన యజమానుల పేర్లతో ఆయా అన్‌లిస్టెడ్‌ సంస్థలు ప్రత్యేక రిజిస్టరు మెయింటెయిన్‌ చేయాల్సి ఉంటుంది. కనీసం పాతిక శాతం లేదా ఆ పై స్థాయిలో వాటాలు ఉన్న వారిని ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చంటూ కంపెనీల చట్టం చెబుతోంది. అయితే, బినామీలను గుర్తించే క్రమంలో.. మరింత మంది షేర్‌హోల్డర్లను కూడా ఈ కేటగిరీలోకి చేర్చేలా నిర్దేశిత వాటాల పరిమితిని పది శాతానికి కుదించాలని ఎంసీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  

విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం..  
మొత్తం మీద ఈ కొత్త మార్పులన్నీ విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇంకా అనుమతి లేని రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారిపై  అధిక ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు.

నిర్దేశిత గడువులోగా షేర్లను డీమ్యాట్‌ చేయాలంటూ నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే .. అన్‌లిస్టెడ్‌ సంస్థల నుంచి ఒక్కసారిగా ఫైలింగ్స్‌ Ðð ల్లువెత్తనున్నాయి. కంపెనీల చట్టం కింద.. సిసలైన లబ్ధిదారుల వివరాలు వెల్లడించకపోయిన పక్షంలో రూ. 50,000 దాకా జరిమానాతో పాటు రోజువారీ రూ. 1,000 దాకా పెనాల్టీ కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా, ఆయా కేసులపై విచారణ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement