benamis
-
డ్రైవర్‌నూ వదలని శివబాలకృష్ణ!
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో రోజుకో విస్తుపోయే విషయం వెలుగు చూస్తోంది. తన పేరిటే కాకుండా.. ఇంట్లోవాళ్లు, దగ్గరి.. దూరపు బంధువుల పేరిట కూడా ఆయన భారీగా ఆస్తుల్ని జమ చేశాడు. ఆఖరికి తన దగ్గర పని చేసేవాళ్లనూ వదల్లేదాయన. తాజాగా.. ఆయన దగ్గర అటెండర్, డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తుల్ని అవినీతి నిరోధక శాఖ(ACB) అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరి పేరిటా భారీగానే బినామీ ఆస్తుల్ని శివ బాలకృష్ణ కూడబెట్టి ఉంటాడన్న అనుమానాల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. శివబాలకృష్ణ దగ్గర అటెండర్‌గా పని చేసిన హబీబ్, డ్రైవర్ గోపీలను ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది. శివ బాలకృష్ణకు లంచాలు చేరవేయడంలో ఈ ఇద్దరూ కీలకంగా వ్యహహరించారని .. ప్రతిఫలంగా ఇద్దరి పేర్లపైనా బాలకృష్ణ ఆస్తులు కూడబెట్టాడని సమాచారం. ఈ క్రమంలోనే.. డ్రైవర్ గోపీకి కాస్ట్లీ హోండా సిటీకారును శివ బాలకృష్ణ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరి పేరిట ఉన్న బినామీ ఆస్తుల వివరాలను గుర్తించే పనిలో ఉంది ఏసీబీ. ఇదిలా ఉంటే.. ఇప్పటికే శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ చేశారు. భరత్, భరణి, ప్రమోద్ కుమార్‌లతో పాటు సోదరుడు శివ నవీన్‌కుమార్, స్నేహితుడు సత్యనారాయణలను ఇవాళ ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. శివ బాలకృష్ణ దగ్గర పీఏగా పని చేసిన భరణి.. కంప్యూటర్ ఆపరేటర్గానూ పని చేశాడు. అదే సమయంలో ఎన్విస్ డిజైన్ స్టూడియో పేరుతో.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, లే అవుట్ బిల్డింగ్‌లకు అనుమతులు మంజూరు చేశాడు. మరో బినామీ అయిన ప్రమోద్‌కు మీనాక్షి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఆర్థిక వ్యవహారాలు చూసుకునే సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు స్నేహితుడు సత్యనారాయణను సైతం ఏసీబీ విచారిస్తోంది. -
ఏసీబీ దూకుడు.. శివబాలకృష్ణ బినామీలకు నోటీసులు
హైదరాబాద్, సాక్షి: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో వేగం మరింత పెంచింది అవినీతి నిరోధక శాఖ(ACB). ఈ క్రమంలో విచారణకు రావాల్సిందేనంటూ బినామీలందరికి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్‌కు ఏసీబీ లేఖ రాసింది. శివబాలకృష్ణకు బినామీలుగా వ్యవహరించిన భరత్, సత్యానారాయణ, భరణిలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్యాప్తులో దొరికిన పత్రాల ఆధారంగా.. ప్రభుత్వ అనుమతి తీసుకుని ఆ ఐఏఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఏసీబీ భావిస్తోంది. ఇదిలా ఉంటే.. 2021-23 సంవత్సరాల మధ్య శివబాలకృష్ణ కోట్ల ఆస్తుల్ని కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఆ ఆస్తులన్నింటినీ ఆయన తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించారు.ఈ క్రమంలో యాదాద్రిలో 57 ఎకరాల భూమిపై ప్రత్యేక విచారణ చేయాలని ఏసీబీ భావిస్తోంది. -
బ్యాంకు ఖాతాలను ఈడీ స్తంభింపజేయొచ్చు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి బినావీులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసేలా ఉత్తర్వులు జారీ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 17 ప్రకారం సంబంధిత అధీకృత అధికారి చర్యలు చేపట్టవచ్చునని స్పష్టం చేసింది. ప్రభాకర్‌రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చవ్వా గోపాల్‌రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవి పేరు మీద ఉన్న యాక్సిస్, యూనియన్ బ్యాంకుల ఖాతాల నుంచి 15 రోజుల పాటు ఎలాంటి నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఈడీ అధీకృత అధికారి సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేసే ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మీదేవి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా స్తంభింపచేయాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పంపిన ఈ–మెయిళ్లను రద్దు చేసింది. సెక్షన్ 17 (1)(ఏ) కింద జారీ చేయని కారణంతోనే ఈ–మెయిళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ మంగళవారం తీర్పునిచ్చారు. అశోక్ లేలాండ్ సంస్థ నుంచి బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొని, బీఎస్–4 వాహనాలుగా మార్చిన వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినావీులపై పోలీసులు 46 కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. కొల్లగొట్టిన సొమ్మును ప్రభాకర్‌రెడ్డి బినామీ గోపాల్‌రెడ్డి తన కుమారుడు, భార్య బ్యాంకు ఖాతాల్లో దాచినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దీంతో ఆ ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా చూడాలంటూ యాక్సిస్, యూనియన్ బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లు పంపారు. బ్యాంకు అధికారులు లావాదేవీలు నిలిపివేశారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ–మెయిళ్లను సవాలు చేస్తూ గోపాల్‌రెడ్డి అండ్ కో, దాని మేనేజింగ్ పార్ట్నర్ గోపాల్‌రెడ్డి, ఆయన కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి, భార్య లక్ష్మీదేవీలు హైకోర్టులో 2022లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి రవినాథ్ తిల్హరీ గత నెలలో పూర్తిస్థాయిలో వాదనలు విన్నారు. ఈడీ తరఫున జోస్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున న్యాయవాది ఐ.కోటిరెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హరీ మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. -
టీడీపీ పెద్దల అక్రమాలు బట్టబయలు.. నా‘రాబంధువులే’!
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల్లో వాలిపోయిన భూ రాబందుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బడుగు, బలహీన వర్గాల రైతులను బెదిరించి 932.72 ఎకరాల అసైన్డ్ భూములను పచ్చ గద్దలు కాజేసినట్లు వెల్లడైంది. గ్రామాలవారీగా ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూముల అక్రమాల చిట్టా రట్టైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014– 18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు సీఐడీ దర్యాప్తులో ఆధార సహితంగా, రియల్ ఎస్టేట్ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయి. ఇప్పటివరకు బట్టబయలైన అసైన్డ్ భూములు 932.72 ఎకరాలు. చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్ విలువ ఏకంగా రూ.3,730.88 కోట్లకు పైమాటే! కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తులో మరిన్ని అసైన్డ్ బాగోతాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. కార్యాలయాల వారీగా రికార్డుల పరిశీలన.. రాజధాని అమరావతి ప్రాంతంలో 2014 నాటికి ఎస్సీ, బీసీ రైతుల పేరిట ఉన్న అసైన్డ్ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. సీఐడీ దర్యాప్తులో గుర్తించిన అసైన్డ్ భూముల రికార్డులను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించారు. అమరావతి పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు నిర్ధారించారు. భూ సమీకరణ కోసం ఏర్పాటైన సీఆర్డీఏ కార్యాలయాల వారీగా రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. మొత్తం 23 సీఆర్డీఏ కార్యాలయాల పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణం తరువాత అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ కనీసం రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఆ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932.72 ఎకరాల అసైన్డ్ భూముల మార్కెట్ విలువ రూ.3,730.88 కోట్లకు పైమాటేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం అసైన్డ్ అక్రమాలు రూ.5,600 కోట్లు! సీఐడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అసైన్డ్ భూముల అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలో మొత్తం 1,400 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గతంలోనే సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూముల విలువ రూ.5,600 కోట్లని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘నారా’యణ బంధువులు, బినామీలే.. అసైన్డ్ భూముల అక్రమాల తీగ లాగితే నారా చంద్రబాబు, పొంగూరు నారాయణ బంధువులు, బినామీల ఇళ్లల్లో డొంక కదులుతోంది. బినామీలు, బంధువుల పేరిట అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు, ఆయన సమీప బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ చిరుద్యోగుల పేరిట అసైన్డ్ భూములను కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన 932.72 ఎకరాల అసైన్డ్ భూముల సేల్డీడ్లు, జీపీఏలను సీఐడీ అధికారులు విశ్లేషించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ‘ఎన్‌స్పైర’లో కీలక ఆధారాలు స్వాధీనం మాజీ మంత్రి పి.నారాయణ కుటుంబానికి చెందిన హైదరాబాద్‌లోని ‘ఎన్ స్పైర’ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు బుధవారం ముగిశాయి. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు ఖాతా లావాదేవీల పత్రాలు, ఇతర కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. మునుముందు మరిన్ని కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. -
అధికార పార్టీ నేతల బినామీలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు
-
‘అన్‌లిస్టెడ్’ షేర్లూ.. డీమ్యాట్‌లోనే...
న్యూఢిల్లీ: అన్‌లిస్టెడ్ కంపెనీల్లో బినామీలను గుర్తించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్‌లిస్టెడ్ కార్పొరేట్ల షేర్లను డీమెటీరియలైజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మరికొన్ని వారాల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో సిసలైన వాటాదారులను గుర్తించేందుకు ఇది తో డ్పడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా 80,000–90,000 దాకా పబ్లిక్ కంపెనీలతో ఈ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి దేశీయంగా మొత్తం 11.7 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం షేర్ల డీమెటీరియలైజేషన్ ప్రక్రియ కేవలం 8,000 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న అన్‌లిస్టెడ్ సంస్థల షేర్లన్నీ ఎకాయెకిన డీమ్యాట్ చేయడం సాధ్యపడదు కాబట్టి ముందుగా పబ్లిక్ కంపెనీలతో మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సదరు సంస్థల్లో 5.5–6 కోట్ల మంది పైచిలుకు వాటాదారులపై ఇది ప్రభావం చూపొచ్చని అంచనా. సిసలైన లబ్ధిదారుల గుర్తింపు .. డొల్ల కంపెనీల్లో చాలా మటుకు యాజమాన్య వాటాలు బినామీల పేర్లమీదే ఉంటున్నాయని పసిగట్టిన ప్రభుత్వం.. అసలు యజమానులను కూడా గుర్తించేందుకు తగు నిబంధనల రూపకల్పనపైనా కసరత్తు చేస్తోంది. పది శాతం పైగా వాటాలున్న వారిని గణనీయంగా లబ్ధి పొందే యాజమాన్య అధికారాలున్న వారిగా వర్గీకరించాలని ప్రతిపాదించనుంది. అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్‌పై పోరులో భాగంగా.. కంపెనీల చట్టంలో ఇప్పటికే కొత్తగా ఒక సెక్షన్ చేర్చడం జరిగింది. దీని ప్రకారం సిసలైన లబ్ధిదారులైన యజమానుల పేర్లతో ఆయా అన్‌లిస్టెడ్ సంస్థలు ప్రత్యేక రిజిస్టరు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కనీసం పాతిక శాతం లేదా ఆ పై స్థాయిలో వాటాలు ఉన్న వారిని ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చంటూ కంపెనీల చట్టం చెబుతోంది. అయితే, బినామీలను గుర్తించే క్రమంలో.. మరింత మంది షేర్హోల్డర్లను కూడా ఈ కేటగిరీలోకి చేర్చేలా నిర్దేశిత వాటాల పరిమితిని పది శాతానికి కుదించాలని ఎంసీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం.. మొత్తం మీద ఈ కొత్త మార్పులన్నీ విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇంకా అనుమతి లేని రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారిపై అధిక ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా షేర్లను డీమ్యాట్ చేయాలంటూ నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే .. అన్‌లిస్టెడ్ సంస్థల నుంచి ఒక్కసారిగా ఫైలింగ్స్ Ðð ల్లువెత్తనున్నాయి. కంపెనీల చట్టం కింద.. సిసలైన లబ్ధిదారుల వివరాలు వెల్లడించకపోయిన పక్షంలో రూ. 50,000 దాకా జరిమానాతో పాటు రోజువారీ రూ. 1,000 దాకా పెనాల్టీ కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా, ఆయా కేసులపై విచారణ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉంటుంది. -
ఇక బినామీల వేట !
► ఆస్తులు జప్తు చేసుకునేందుకు కేంద్రం అడుగులు ► బినామీ అని రుజువైతే ఏడేళ్ల వరకు జైలు.. ► ఆస్తి విలువలో 25% జరిమానా ► తప్పుడు సమాచారమిచ్చినా 10 శాతం ఫైన్ ► ఆదాయానికి మించినా.. లెక్క చెప్పలేని ఆస్తులున్నా ఇదే చట్టం ► పాత చట్టాన్ని ఆగస్టులోనే సవరించిన కేంద్రం ► జప్తులో జాప్యం నివారణకు మరోసారి సవరణ యోచన ► ఈ నెల 30తో ‘నోట్ల రద్దు’కు ముగియనున్న గడువు ► ఆ తర్వాత బినామీలపై చర్యలకు కసరత్తు సాక్షి, హైదరాబాద్ : నల్లధనానికి చెక్ పెట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక బినామీ ఆస్తులపై దృష్టి సారిస్తోంది. ఆ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అడుగు ముందుకేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు... లెక్క చెప్పలేని ఆస్తులుంటే జప్తు చేసే చట్టానికి పదును పెడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును వేగవంతం చేసింది. 1988 నుంచే బినామీ లావాదేవీల నిషేధిత చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కొన్ని లొసుగులను సవరిస్తూ ఈ ఏడాది ఆగస్టులోనే కేంద్రం... బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం–2016 అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే ఈ చట్టానికి మెరుగులు దిద్దింది. నోట్ల రద్దు కంటే ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదిపింది. ఈలోగా ఆకస్మికంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 30తో నోట్ల రద్దుకు నిర్దేశించిన గడువు ముగియనుంది. దీంతో రెండో దశలో బినామీ ఆస్తుల జప్తుకు రంగంలోకి దిగాలని యోచిస్తోంది. బినామీ ఆస్తులని రుజువైతే..? అవినీతి పరులు, అక్రమార్జనకు పాల్పడ్డ నల్ల కుబేరులు నగదు నిల్వలు చేయకుండా, విచ్చలవిడిగా ఆస్తులు కొంటున్నారనే అభియోగాలున్నాయి. తమ పేరిట లావాదేవీలు నిర్వహించకుండా, పన్నులు ఎగ్గొట్టేందుకు బినామీల పేరుతో వీటిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. నోట్ల రద్దుతో దేశంలో చెలామణిలో ఉన్న నగదు మొత్తం ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశముందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. నగదుకు చిక్కకుండా ఆస్తుల రూపంలో మళ్లించిన నల్ల«ధనాన్ని కట్టడి చేసేందుకు ఈ బినామీ చట్టంపై ఆశలు పెట్టుకుంది. బినామీ ఆస్తులుగా రుజువైతే వాటిని ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. అలాగే ఏడాది నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్షతోపాటు మార్కెట్ విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సేకరించిన సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, రుణాల ఆధారంగా బినామీ ఆస్తుల చిట్టాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. బడా కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై తొలి దశలో దృష్టి సారించే అవకాశాలుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి చట్టానికి సవరణ? చట్టంలో ఉన్న న్యాయపరమైన వెసులుబాటుతో బినామీ ఆస్తులను జప్తు చేసుకునేందుకు ప్రభుత్వానికి ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశముంది. అందుకే న్యాయపరమైన అడ్డంకులు తొలగిస్తూ మరోమారు చట్టాన్ని సవరించాలని కేంద్రం యోచిస్తోంది. బినామీ ఆస్తులకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం లేదా అనుమానం మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముందుగా నోటీసులిస్తారు. సదరు ఆస్తి కొనేందుకు వచ్చిన ఆదాయం ఎక్కణ్నుంచి వచ్చిందో ఆధారాలను సమర్పిస్తే సరిపోతుంది. లేకుంటే బినామీ ఆస్తిగా గుర్తించి జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారుల చర్యను తప్పుపడితే... సదరు ఆస్తి తమకే చెందుతుందని వాటి యజమానులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వీలుంటుంది. ఏడాదిలోపు ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. తర్వాత హైకోర్టుకు వెళ్లే అవకాశం పిటిషనర్‌కు ఉంటుంది. దీంతో బినామీ ఆస్తుల స్వాధీనానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని గుర్తించిన కేంద్రం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది. ఏది బినామీ? ఎవరైనా తమ ఆదాయ పరిధికి మించి.. లెక్క చెప్పలేని ఆస్తులు కలిగి ఉంటే చట్టం ప్రకారం బినామీ ఆస్తులుగా పరిగణిస్తారు. ఇతరుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేయడం, తమ అధీనంలో ఉన్న ఆస్తులకు ఇతరులెవరో డబ్బులు చెల్లించటం, గుర్తు తెలియని వ్యక్తులు తమ పేరిట ఆస్తులు బదలాయించటం.. ఇవన్నీ బినామీ లావాదేవీలే. ఆస్తి ఉన్న వ్యక్తులు అది తమదని నిరూపించుకోలేకపోయినా, దానికి సంబంధించి తనకేమీ తెలియదని చెప్పినా, అది తనది కాదని తను డబ్బులు చెల్లించి కొనలేదని చెప్పినా దాన్ని బినామీ ఆస్తిగా పరిగణిస్తారు. స్థిర చరాస్తులు, బంగారు బాండ్లు, ఫైనాన్షియల్ సెక్యూరిటీలు, షేర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే ఉమ్మడి కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తులు బినామీ కిందికి రావు. అలాగే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉమ్మడి ఆస్తి కొనుగోలు చేసినా, తాను యజమానిగా ఉన్న సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసినా ఈ చట్టం పరిధిలోకి రావు.