540 Acres Land In Names Of Chandrababu Benamis And TDP Leaders - Sakshi
Sakshi News home page

టీడీపీ పెద్దల అక్రమాలు బట్టబయలు.. నా‘రాబంధువులే’!

Published Thu, Jan 12 2023 3:37 AM | Last Updated on Thu, Jan 12 2023 11:17 AM

540 acres Land in names of Chandrababu Benamis and TDP leaders - Sakshi

సాక్షి, అమరావతి: అసైన్డ్‌ భూముల్లో వాలి­పోయిన భూ రాబందుల అక్రమాలు బహిర్గతమ­య్యాయి. బడుగు, బలహీన వర్గాల రైతులను బెదిరించి 932.72 ఎకరాల అసైన్డ్‌ భూములను పచ్చ గద్దలు కాజేసినట్లు వెల్లడైంది. గ్రామాల­వారీగా ఎల్లో గ్యాంగ్‌ అసైన్డ్‌ భూముల అక్రమాల చిట్టా రట్టైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014– 18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు సీఐడీ దర్యాప్తులో ఆధార సహితంగా, రియల్‌ ఎస్టేట్‌ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయి. ఇప్పటివరకు బట్టబయలైన అసైన్డ్‌ భూములు 932.72 ఎకరాలు. చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్‌ విలువ ఏకంగా రూ.3,730.88 కోట్లకు పైమాటే! కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తులో మరిన్ని అసైన్డ్‌ బాగోతాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. 

కార్యాలయాల వారీగా రికార్డుల పరిశీలన..
రాజధాని అమరావతి ప్రాంతంలో 2014 నాటికి ఎస్సీ, బీసీ రైతుల పేరిట ఉన్న అసైన్డ్‌ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో సీఆర్‌డీఏ రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. సీఐడీ దర్యాప్తులో గుర్తించిన అసైన్డ్‌ భూముల రికార్డులను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించారు. అమరావతి పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్‌ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు నిర్ధారించారు. భూ సమీకరణ కోసం ఏర్పాటైన సీఆర్‌డీఏ కార్యాలయాల వారీగా రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు.

మొత్తం 23 సీఆర్‌డీఏ కార్యాలయాల పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్‌ భూములను కాజేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణం తరువాత అమరావతిలో ఎకరా మార్కెట్‌ విలువ కనీసం రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఆ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932.72 ఎకరాల అసైన్డ్‌ భూముల మార్కెట్‌ విలువ రూ.3,730.88 కోట్లకు పైమాటేనని పరిశీలకులు చెబుతున్నారు. 

మొత్తం అసైన్డ్‌ అక్రమాలు రూ.5,600 కోట్లు!
సీఐడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అసైన్డ్‌ భూముల అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలో మొత్తం 1,400 ఎకరాల అసైన్డ్‌ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గతంలోనే సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్‌ భూముల విలువ రూ.5,600 కోట్లని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. 

‘నారా’యణ బంధువులు, బినామీలే..
అసైన్డ్‌ భూముల అక్రమాల తీగ లాగితే నారా చంద్రబాబు, పొంగూరు నారాయణ బంధువులు, బినామీల ఇళ్లల్లో డొంక కదులుతోంది. బినామీలు, బంధువుల పేరిట అసైన్డ్‌ భూములను జీపీఏ, సేల్‌ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు, ఆయన సమీప బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ చిరుద్యోగుల పేరిట అసైన్డ్‌ భూములను కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన 932.72 ఎకరాల అసైన్డ్‌ భూముల సేల్‌డీడ్లు, జీపీఏలను సీఐడీ అధికారులు విశ్లేషించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. 

‘ఎన్‌స్పైర’లో కీలక ఆధారాలు స్వాధీనం
మాజీ మంత్రి పి.నారాయణ కుటుంబానికి చెందిన హైదరాబాద్‌లోని ‘ఎన్‌ స్పైర’ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు బుధవారం ముగిశాయి. కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు ఖాతా లావాదేవీల పత్రాలు, ఇతర కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. మునుముందు మరిన్ని కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement