ఇక బినామీల వేట !
► ఆస్తులు జప్తు చేసుకునేందుకు కేంద్రం అడుగులు
► బినామీ అని రుజువైతే ఏడేళ్ల వరకు జైలు..
► ఆస్తి విలువలో 25% జరిమానా
► తప్పుడు సమాచారమిచ్చినా 10 శాతం ఫైన్
► ఆదాయానికి మించినా.. లెక్క చెప్పలేని ఆస్తులున్నా ఇదే చట్టం
► పాత చట్టాన్ని ఆగస్టులోనే సవరించిన కేంద్రం
► జప్తులో జాప్యం నివారణకు మరోసారి సవరణ యోచన
► ఈ నెల 30తో ‘నోట్ల రద్దు’కు ముగియనున్న గడువు
► ఆ తర్వాత బినామీలపై చర్యలకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : నల్లధనానికి చెక్ పెట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక బినామీ ఆస్తులపై దృష్టి సారిస్తోంది. ఆ ఆస్తులను జప్తు చేసుకునేందుకు అడుగు ముందుకేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు... లెక్క చెప్పలేని ఆస్తులుంటే జప్తు చేసే చట్టానికి పదును పెడుతోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును వేగవంతం చేసింది. 1988 నుంచే బినామీ లావాదేవీల నిషేధిత చట్టం అమల్లో ఉంది. ఆ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేస్తూ కొన్ని లొసుగులను సవరిస్తూ ఈ ఏడాది ఆగస్టులోనే కేంద్రం... బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం–2016 అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి సలహాలు, సూచనలను స్వీకరించిన తర్వాతే ఈ చట్టానికి మెరుగులు దిద్దింది. నోట్ల రద్దు కంటే ముందే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదిపింది. ఈలోగా ఆకస్మికంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 30తో నోట్ల రద్దుకు నిర్దేశించిన గడువు ముగియనుంది. దీంతో రెండో దశలో బినామీ ఆస్తుల జప్తుకు రంగంలోకి దిగాలని యోచిస్తోంది.
బినామీ ఆస్తులని రుజువైతే..?
అవినీతి పరులు, అక్రమార్జనకు పాల్పడ్డ నల్ల కుబేరులు నగదు నిల్వలు చేయకుండా, విచ్చలవిడిగా ఆస్తులు కొంటున్నారనే అభియోగాలున్నాయి. తమ పేరిట లావాదేవీలు నిర్వహించకుండా, పన్నులు ఎగ్గొట్టేందుకు బినామీల పేరుతో వీటిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకుంటున్నారు. నోట్ల రద్దుతో దేశంలో చెలామణిలో ఉన్న నగదు మొత్తం ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశముందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలేసుకుంటోంది. నగదుకు చిక్కకుండా ఆస్తుల రూపంలో మళ్లించిన నల్ల«ధనాన్ని కట్టడి చేసేందుకు ఈ బినామీ చట్టంపై ఆశలు పెట్టుకుంది. బినామీ ఆస్తులుగా రుజువైతే వాటిని ప్రభుత్వమే జప్తు చేసుకుంటుంది. అలాగే ఏడాది నుంచి ఏడేళ్ల పాటు జైలు శిక్షతోపాటు మార్కెట్ విలువ ప్రకారం బినామీ ఆస్తి విలువలో 25 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బినామీ లావాదేవీలపై తప్పుడు సమాచారమిస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి విలువలో 10 శాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సేకరించిన సమాచారాన్ని, బ్యాంకు ఖాతాల లావాదేవీలు, రుణాల ఆధారంగా బినామీ ఆస్తుల చిట్టాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది. బడా కంపెనీలు, బహుళ అంతస్తుల భవనాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై తొలి దశలో దృష్టి సారించే అవకాశాలుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరోసారి చట్టానికి సవరణ?
చట్టంలో ఉన్న న్యాయపరమైన వెసులుబాటుతో బినామీ ఆస్తులను జప్తు చేసుకునేందుకు ప్రభుత్వానికి ఏళ్లకు ఏళ్లు పట్టే అవకాశముంది. అందుకే న్యాయపరమైన అడ్డంకులు తొలగిస్తూ మరోమారు చట్టాన్ని సవరించాలని కేంద్రం యోచిస్తోంది. బినామీ ఆస్తులకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం లేదా అనుమానం మేరకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు ముందుగా నోటీసులిస్తారు. సదరు ఆస్తి కొనేందుకు వచ్చిన ఆదాయం ఎక్కణ్నుంచి వచ్చిందో ఆధారాలను సమర్పిస్తే సరిపోతుంది. లేకుంటే బినామీ ఆస్తిగా గుర్తించి జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారుల చర్యను తప్పుపడితే... సదరు ఆస్తి తమకే చెందుతుందని వాటి యజమానులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వీలుంటుంది. ఏడాదిలోపు ట్రిబ్యునల్ విచారణ పూర్తి చేసి తీర్పునివ్వాలి. తర్వాత హైకోర్టుకు వెళ్లే అవకాశం పిటిషనర్‌కు ఉంటుంది. దీంతో బినామీ ఆస్తుల స్వాధీనానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని గుర్తించిన కేంద్రం ప్రత్యామ్నాయాలు యోచిస్తోంది.
ఏది బినామీ?
ఎవరైనా తమ ఆదాయ పరిధికి మించి.. లెక్క చెప్పలేని ఆస్తులు కలిగి ఉంటే చట్టం ప్రకారం బినామీ ఆస్తులుగా పరిగణిస్తారు. ఇతరుల పేరుతో ఆస్తులు కొనుగోలు చేయడం, తమ అధీనంలో ఉన్న ఆస్తులకు ఇతరులెవరో డబ్బులు చెల్లించటం, గుర్తు తెలియని వ్యక్తులు తమ పేరిట ఆస్తులు బదలాయించటం.. ఇవన్నీ బినామీ లావాదేవీలే. ఆస్తి ఉన్న వ్యక్తులు అది తమదని నిరూపించుకోలేకపోయినా, దానికి సంబంధించి తనకేమీ తెలియదని చెప్పినా, అది తనది కాదని తను డబ్బులు చెల్లించి కొనలేదని చెప్పినా దాన్ని బినామీ ఆస్తిగా పరిగణిస్తారు. స్థిర చరాస్తులు, బంగారు బాండ్లు, ఫైనాన్షియల్ సెక్యూరిటీలు, షేర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. అయితే ఉమ్మడి కుటుంబ యజమాని, జీవిత భాగస్వామి చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తులు బినామీ కిందికి రావు. అలాగే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఉమ్మడి ఆస్తి కొనుగోలు చేసినా, తాను యజమానిగా ఉన్న సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసినా ఈ చట్టం పరిధిలోకి రావు.