ముంబై: గత వారాంతాన ఆగస్టు సిరీస్ తొలి రోజు ట్రేడింగ్ లాభాలను నమోదుచేసినప్పటికీ.. వారం మొత్తం మీద చూస్తే బేర్స్‌దే హవాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఎనర్జీ, ఇన్ ఫ్రా, మెటల్ స్టాక్స్ నష్టాల కారణంగా ప్రధాన సూచీలు 1.2 శాతం నష్టపోయి.. వరుసగా మూడో వారంలోనూ నష్టాలను మిగిల్చాయి. ప్రపంచ టాప్–15 మార్కెట్లలో మే నెల నుంచి ఇప్పటివరకు ఇతర దేశాల సూచీలు 18 శాతం వరకు లాభాలను ఇవ్వగా.. కేవలం దేశీయ స్టాక్ సూచీలు మాత్రమే 2 శాతం (డాలర్ రాబడుల లెక్కన) నష్టాలను మిగిల్చాయి. బడ్జెట్లో సూపర్ రిచ్‌పై సర్‌చార్జ్ విధించిన నేపథ్యంలో పడిపోతూ వస్తోన్న దేశీ ప్రధాన సూచీలు ఈవారంలోనైనా కోలుకుంటాయా? లేదంటే.. మరింత పతనమవుతాయా? అనే ఆందోళనకర వాతావరణానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం, ఈవారంలో వెలువడే కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, స్థూల ఆర్థిక అంశాలు దిక్సూచీలుగా మారనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి సంకేతాలు ఏవైనా కనిపిస్తేనే మళ్లీ భారత మార్కెట్లోకి విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతుంది. వీరి పెట్టుబడులను ఆకర్షిస్తే మార్కెట్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్
వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ)ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం రాత్రి ప్రకటించనున్నారు. ప్రస్తుతం అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా యూఎస్ ఎకానమీ క్రమంగా దెబ్బతింటోన్న సంగతి తెలిసిందే. కాగా, ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసమైనా ఎఫ్‌ఓఎంసీ ఈసారి పావు శాతం మేర వడ్డీ రేట్లలో కోత విధించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాయిటర్స్ పోల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించగా.. మరి కొందరి అంచనా ప్రకారం అర శాతం వరకు కోత ఉంటే మాత్రం ఇది భారత మార్కెట్‌కు కూడా సానుకూల పరిణామంగా మారనుందని జియోజిత్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ తన అంచనాను ప్రకటించారు.
ఈవారంలోనే ఎస్‌బీఐ, ఐటీసీ ఫలితాలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, ఐఓసీ, యూపీఎల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. దాదాపు 400 కంపెనీల క్యూ1 ఫలితాలు ఈవారంలో వెల్లడికానుండగా.. ఈ జాబితాలో అశోక్ లేలాండ్, డీఎల్‌ఎఫ్, బాటా ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్ వంటివి ఉన్నాయి దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీనపడినందున మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడిందని, ఈ సమయంలో కంపెనీల ఫలితాలు నిరాశపరిస్తే మాత్రం పతనం కొనసాగుతుందని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ రోమేష్ తివా రీ అన్నారు. హెచ్‌యూఎల్ వృద్ధి ఏకంగా ఏడు త్రైమాసికాల కనిష్టస్థాయికి పడిపోయిన అంశం ఆధారంగా చూస్తే.. సెంటిమెంట్ మరికొంతకాలం బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు.
స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి..
జూన్ మౌలిక సదుపాయాల ఉత్పత్తి గణాంకాలు బుధవారం విడుదల కానుండగా.. జూలై మార్కిట్ తయారీ పీఎంఐ డేటా గురువారం వెల్లడికానుంది. ఇక అమెరికా–చైనా దేశాల సంధానకర్తల సమావేశం మంగళవారం షాంఘైలో జరగనుంది.
జూలైలో 3,700 కోట్లు ఉపసంహరణ
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) జూలై 1–26 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.14,383 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. గడిచిన ఐదు నెలలుగా నికర పెట్టుబడిదారులుగా కొనసాగుతున్న వీరు.. సూపర్ రిచ్ ట్యాక్స్ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్ మార్కెట్‌లో రూ.10,624 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ రూ.3,700 కోట్లకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment