
వారాంతాన యూఎస్ మార్కెట్లు హైజంప్ చేశాయి. కోవిడ్-19 విసురుతున్న సవాళ్లను అధిగమించి మే నెలలో ఏకంగా 2.5 మిలియన్ ఉద్యోగాల కల్పన జరిగినట్లు వెల్లడికావడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి శుక్రవారం డోజోన్స్ 829 పాయింట్లు(3.2 శాతం) దూసుకెళ్లి 27,111 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 82 పాయింట్లు(2.6 శాతం) జంప్‌చేసి 3,194 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్ 198 పాయింట్లు(2 శాతం) క్షీణించి 9,814 వద్ద ముగిసింది. కోవిడ్-19 సమస్యలకు ఎదురొడ్డి ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోగలదన్న ఆశలతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో నాస్‌డాక్ 9,846కు ఎగసింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. ఫిబ్రవరి 19న క్లోజింగ్ రికార్డ్ 9,817కు సమీపంలో ముగిసింది. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్ రికార్డ్ గరిష్టానికి 6 శాతం చేరువలో నిలిచింది. మే నెలలో వ్యవసాయేతర రంగంలో 2.5 మిలియన్ మందికి ఉద్యోగాలు లభించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. నిజానికి 8 మిలియన్లమంది ఉపాధి కోల్పోతారని అంచనా వేశారు. దీంతో నిరుద్యోగిత 13.3 శాతానికి పరిమితమైంది. తొలుత 19.5 శాతంగా అంచనాలు వెలువడ్డాయి.
గత వారం జోరు
శుక్రవారంతో ముగిసిన గత వారం నాస్‌డాక్ 3.4 శాతం జంప్‌చేయగా.. ఎస్‌అండ్‌పీ 4.7 శాతం, డోజోన్స్ 6.8 శాతం చొప్పున దూసుకెళ్లాయి. కాగా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ షేరు 77 శాతం, బోయింగ్ ఇంక్ 41 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. వారాంతాన ఒక్క రోజే బోయింగ్ ఇంక్ 11 శాతం జంప్‌చేసింది. ఇక ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ షేరు 3 శాతం ఎగసి 332 డాలర్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా..మార్చి నుంచీ ఈ షేరు 50 శాతం పురోగమించడం విశేషం! ఈ బాటలో కోక కోలా, చెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, వాల్ట్ డిస్నీ, కేటర్‌పిల్లర్ సైతం మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు.
ఫాంగ్ అండ
నాస్‌డాక్ ర్యాలీకి ప్రధానంగా ఫాంగ్(FAANG) స్టాక్స్.. యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, అల్ఫాబెట్, ఫేస్‌బుక్ సహకరించాయి. ప్రస్తుతం వీటి మొత్తం మార్కెట్ కేపిటలైజేషన్ 5.7 లక్షల కోట్ల డాలర్లను అధిగమించడం విశేషం! ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ క్యాప్ 185 బిలియన్ డాలర్లను తాకింది. ఈ షేరు 2020లో ఇప్పటివరకూ 30 శాతం ర్యాలీ చేసింది.
టాటా మోటార్స్ దూకుడు
వారాంతాన అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్ (ఏడీఆర్)జోరు చూపాయి. టాటా మోటార్స్(టీటీఎం) 11.5 శాతం దూసుకెళ్లి 7.45 డాలర్లను తాకగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(హెచ్‌డీబీ) 5 శాతం జంప్‌చేసి 47.61 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్(ఐబీఎన్) 5 శాతం ఎగసి 9.77 డాలర్ల వద్ద నిలవగా.. వేదాంతా(వీఈడీఎల్) 1.8 శాతం బలపడి 5.65 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో ఇన్ఫోసిస్ 1.2 శాతం పుంజుకుని 9.38 డాలర్ల వద్ద, విప్రో 0.6 శాతం లాభంతో 3.33 డాలర్ల వద్ద, డాక్టర్ రెడ్డీస్(ఆర్‌డీవై) 0.15 శాతం బలపడి 53.04 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment