ఈ నెల 24 నుంచీ అమల్లోకి వచ్చే విధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ H1-B వీసాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ ఏడాది డిసెంబర్ 31వరకూ నిషేధం కొనసాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2021 ఏడాదికి జారీ చేసిన H1-B వీసాలకు బ్రేక్ పడనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 కారణంగా అమెరికాలో గత రెండు నెలలుగా నిరుద్యోగం పెరిగిపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఫలితంగా 2021 ఏడాదిలో యూఎస్ వర్క్ పర్మిట్లు పొందగోరేవారు స్టాంపింగ్ కోసం వచ్చే ఏడాది వరకూ వేచిచూడవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. రెన్యూవల్స్ సైతం నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది.
85,000 వీసాలు
ప్రతీ ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా అమెరికా 85,000 H1-B వీసాలను జారీ చేస్తుంటుంది. దేశీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఐటీ నిపుణుల కోసం వీటిని అత్యధికంగా పొందుతుంటాయి. తద్వారా తమ నిపుణుల ద్వారా యూఎస్‌లో ఐటీ సర్వీసులను అందించేందుకు వినియోగిస్తుంటాయి.కాగా.. H1-Bతోపాటు... H2-B, L-1, కొన్ని కేటగిరీల J వీసాలపై సైతం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాత్కాలిక నిషేధాన్ని విధించారు. ఇటీవల చెలరేగిన కరోనా వైరస్ కల్లోలం కారణంగా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య తాజాగా 4 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక గ్రీన్‌కార్డుల విషయంలో అమెరికా వెలుపలి నుంచి దరఖాస్తు చేసుకున్న వారిపై మాత్రమే ఈ తాత్కాలిక నిషేధ ప్రభావం పడనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీ ఐటీ కంపెనీలపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. H1-B వీసాపై నాలుగు లక్షల మంది, L-1 వీసాలపై లక్షమంది నిపుణులు అమెరికాలో దేశీ ఐటీ కంపెనీల తరఫున విధులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment