భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే...
భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే...
Published Thu, Jun 8 2017 11:37 AM | Last Updated on Thu, Oct 4 2018 4:43 PM
న్యూయార్క్ : భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి, మరోసారి ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకునే 100 మంది అథ్లెట్స్ లో భారత్ నుంచి విరాట్ కోహ్లి ఒక్కడే ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో సాకర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచారు. 'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్ ' 2017 జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. మొత్తం చెల్లింపులు 22 మిలియన్ డాలర్ల(రూ.141కోట్లకు పైగా)తో విరాట్ ఈ జాబితాలో 89వ స్థానాన్ని పొందారు. విరాట్ ఆర్జించే పారితోషికాల్లో 3 మిలియన్ డాలర్ల వేతనం, విన్నింగ్స్, మరో 19 మిలియన్ డాలర్ల ఎండోర్స్ మెంట్స్ ఉన్నాయి. విరాట్ ను ఇండియన్ క్రికెట్ ఫెనోమ్ గా ఫోర్బ్స్ అభివర్ణించింది. కోహ్లి బ్యాటింగ్ లో రికార్డులు సృష్టిస్తున్నాడని కొనియాడింది. 2015లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ గా విరాట్ ను ఎంచుకున్నప్పడు, ఈ జాబ్ ను నిర్వర్తించే అత్యంత పిన్న వయసు ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపుపొందినట్టు పేర్కొంది.
గతేడాది తన నేషనల్ టీమ్ ప్లే కింద కోహ్లి 1 మిలియన్ డాలర్లు(రూ.6కోట్లకు పైగా) వేతనం, శాలరీలు పొందారని, అలాగే ఐపీఎల్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 2.3 మిలియన్ డాలర్ల(రూ.14కోట్లకు పైగా) వేతనం పొందినట్టు తెలిపింది. కోహ్లి ఆదాయాలు ఎక్కువగా ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన స్పానర్ షిప్ పోర్టు ఫోలియోలతో వస్తున్నాయని చెప్పింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రోనాల్డ్ 93 మిలియన్ డాలర్ల పారితోషికం పొందుతున్నారు. రెండో స్థానంలో బాస్కెట్ బాల్ స్టార్ లీబ్రోన్ జామ్స్ నిలిచారు. ఈయన పారితోషికం 86.2 మిలియన్ డాలర్లు. ఈ పారితోషికాల్లో ఆటగాళ్లు 2016 జూన్ నుంచి 2017 జూన్ వరకు పొందిన వేతనాలు, నగదు బహుమతులు, బోనస్ లు ఉన్నాయి. 21 దేశాల ఆటగాళ్లు ఈ టాప్ 100 లో ఉన్నారు. అయితే 63 మంది ఆటగాళ్లతో అమెరికా ఈ జాబితాలో ఆధిపత్యంలో నిలిచింది.
Advertisement