హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు! | visaka plant in haryana | Sakshi
Sakshi News home page

హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు!

Published Fri, Jun 23 2017 12:59 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు!

హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు!

మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభం
భారత్‌లో టాప్‌–1గా నిలిచిన వి–నెక్ట్స్‌
నిర్మాణాలకు వన్‌స్టాప్‌ సొల్యూషన్స్‌
విశాక ఇండస్ట్రీస్‌ జేఎండీ వంశీ కృష్ణ


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డైవర్సిఫైడ్‌ కంపెనీ విశాక ఇండస్ట్రీస్‌... పూర్తిస్థాయి నిర్మాణ రంగ  కంపెనీగా రూపాంతరం చెందుతోంది. ఫైబర్‌ సిమెంట్‌ ఆకృతులు, వి–బోర్డ్స్‌తో నిర్మాణ రంగానికి ఒన్‌స్టాప్‌ సొల్యూషన్స్‌ అందించే సంస్థగా మారుతున్న విశాక.. తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని... నెలకు 6వేల టన్నుల ఫైబర్‌ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం జజ్జర్‌ జిల్లాలో 30 ఎకరాలను కొనుగోలు చేసింది.

రూ.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో 2018 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ జాయింట్‌ ఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే సామర్థ్యం పరంగా దేశంలో ఫైబర్‌ సిమెంటు బోర్డుల ఉత్పత్తిలో నెంబర్‌ వన్‌గా నిలుస్తామన్నారు. ప్లాంటుకు కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నామని చెప్పారాయన. కంపెనీకి ఇప్పటికే తెలంగాణలోని మిర్యాలగూడతో పాటు మహారాష్ట్రలోని పుణేలో ఫైబర్‌ సిమెంటు బోర్డుల తయారీ ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 10,000 టన్నులు.

గణనీయ స్థాయికి వి–నెక్ట్స్‌ వాటా...
దేశంలో ఫైబర్‌ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల మార్కెట్‌ ప్రస్తుతం రూ.600 కోట్లుంది. ఇది ఏటా 15–20 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో విశాకకు చెందిన వి–నెక్ట్స్‌ బ్రాండ్‌ అగ్రస్థాయిలో ఉండి 25 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకుంది. ‘‘2016–17లో రూ.1,007 కోట్ల మొత్తం టర్నోవర్‌లో వి–నెక్ట్స్‌ ద్వారా రూ.150 కోట్లు సమకూరింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికం’’ అని వంశీకృష్ణ తెలియజేశారు.

2019–20 నాటికి రూ.1,400–1,500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకున్నామని, దాన్లో వి–నెక్ట్స్‌ వాటా 20 శాతం దాటుతుందని ఆయన అంచనా వేశారు. బెంగళూరులోని నియో మాల్, కేరళ మెట్రో కార్యాలయం, ముంబై ఎయిర్‌పోర్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో వి–నెక్ట్స్‌ ఉత్పత్తులు వాడారు. ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, మంత్రి డెవలపర్స్, మై హోమ్, టీసీఎస్, రిలయన్స్‌ తదితర సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూం ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో వి–బోర్డ్‌లతో మోడల్‌ హౌజ్‌ను నిర్మించింది కూడా.

భవనాలను నిర్మించి ఇస్తాం..
పర్యావరణానికి అనుకూలం కావటంతో పాటు మన్నిక కూడా ఎక్కువ కావటంతో అత్యాధునిక, అందమైన భవనాల నిర్మాణంలో ఫైబర్‌ సిమెంటు బోర్డుల వాడకం పెరుగుతోంది. ‘‘ఫైబర్‌ సిమెంట్‌ బోర్డులతో ఇంటిని నచ్చినట్లు డిజైన్‌ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. ఇటుకలు, కలపకు బదులు పూర్తిగా ఫైబర్‌ సిమెంటు బోర్డులు వాడతాం. ఇవి మంటలకు అంటుకోవు. అలాగే తడవవు కూడా. విభిన్న రంగుల్లో చిత్రాలతో తయారు చేయొచ్చు.

తక్కువ సమయంలో నిర్మాణం పూర్తవుతుంది. పిల్లర్లు, స్లాబ్‌ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఫైబర్‌ సిమెంటు బోర్డులతో గోడలు, కిచెన్‌ క్యాబినెట్లు, షెల్ఫ్‌లు, వార్డ్‌రోబ్‌లు, వాల్‌ ప్యానె ల్స్, ఫాల్స్‌ సీలింగ్, పార్టీషన్స్, మెజ్జనైన్‌ ఫ్లోరింగ్, క్లాడింగ్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. బయటి వాతావరణంతో పోలిస్తే లోపల 6 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నిర్వహణ వ్యయం అసలే లేదు. కార్పెట్‌ ఏరియా ఎక్కువగా వస్తుంది’’ అని వంశీకృష్ణ వివరించారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.18 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.

పెరుగుతున్న షేరు ధర
విశాక ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ ప్రస్తుతం రూ.806 కోట్లు. ఏడాది కనిష్ఠ ధర రూ.138తో పోలిస్తే ఈ 12 నెలల్లో షేరు ఏకంగా 400% పైగా పెరిగింది. బుధవారంనాడు రూ.560కి చేరిన ఈ షేరు ధర... గడిచిన కొన్ని నెలల తరవాత గురువారం తొలిసారి కరెక్షన్‌కు గురై రూ.510 వద్దకు చేరింది. గడిచిన నెలరోజుల్లోనే కంపెనీ షేరు ధర ఏకంగా 60 శాతం వరకూ పెరగటం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement