visaka Industries
-
హరియాణాలో విశాక మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విశాక ఇండస్ట్రీస్ హరియాణాలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. జజ్జర్ వద్ద రానున్న ఈ ప్లాంటులో డ్రై వాల్ ప్యానెళ్లను తయారు చేస్తారు. రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో 6–8 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని విశాక ఇండస్ట్రీస్ జేఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు. రోజుకు 1,000 ప్యానెళ్లను తయారు చేసే సామర్థ్యంతో యూనిట్‌ను నిర్మిస్తామని, దీనికి అన్ని అనుమతులూ వచ్చాయని తెలియజేశారు. ఆగస్టులో ఆటమ్ తయారీ.. ఆటమ్ పేరుతో సోలార్ రూఫ్‌టాప్స్ తయారీకి మిర్యాలగూడ వద్ద కంపెనీ ప్లాంటును ఏర్పాటు చేసింది. ఈ నెల్లోనే ఉత్పత్తి ప్రారంభమవుతోంది. ఈ ప్లాంటు సామర్థ్యం 60 మెగావాట్లు. రూఫ్‌టాప్ రంగంలో దేశంలో అనుకున్న స్థాయిలో విస్తరణ జరగలేదని వంశీకృష్ణ అభిప్రాయపడ్డారు. వినూత్న డిజైన్‌తో చేసిన ఆటమ్... మార్కెట్లో మంచి డిమాండ్‌ను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోలార్ ప్యానెళ్లే రూఫ్‌టాప్‌గా వినియోగించే వీలుండటం ఆటమ్ ప్రత్యేకత. జజ్జర్ వద్ద వి–బోర్డ్స్ తయారీౖకై విశాక ఇండస్ట్రీస్ ఇప్పటికే రూ.100 కోట్లతో కొత్త ప్లాంటును స్థాపించింది. సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. వార్షిక సామర్థ్యం 72,000 టన్నులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఈ ప్లాంటు నుంచి రూ.20 కోట్ల ఆదాయం ఆశిస్తోంది. ప్లాంటు పూర్తి సామర్థ్యానికి చేరితే ఈ యూనిట్ నుంచి ఆదాయం రూ.80 కోట్లు సమకూరనుంది. 50 శాతం సామర్థ్యం 2019–20లో అందుబాటులోకి రావొచ్చని కంపెనీ ధీమాగా ఉంది. -
రెండింతలకుపైగా పెరిగిన విశాక లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికంలో విశాక ఇండస్ట్రీస్ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.6 కోట్ల నుంచి రూ.14 కోట్లకు ఎగిసింది. టర్నోవరు రూ.220 కోట్ల నుంచి రూ.243 కోట్లకు చేరింది. 2017–18 ఏప్రిల్–డిసెంబర్లో రూ.787 కోట్ల టర్నోవరుపై రూ.51 కోట్ల నికరలాభం పొందింది. సాంఖ్యా ఇన్ఫోటెక్ లాభం రూ.1.3 కోట్లు.. గడిచిన త్రైమాసికంలో సాంఖ్యా ఇన్ఫోటెక్ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.1.4 కోట్ల నుంచి రూ.1.3 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.38 కోట్ల నుంచి రూ.45 కోట్లకు ఎగిసింది. కోరమాండల్ అగ్రోకు నష్టం.. డిసెంబర్ క్వార్టరులో కోరమాండల్ అగ్రో ప్రొడక్ట్స్ అండ్ ఆయిల్స్‌కు రూ.2 కోట్ల నష్టం వాటిల్లింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.30 లక్షల నికరలాభం పొందింది. టర్నోవరు రూ.20 కోట్ల నుంచి రూ.23 కోట్లకు చేరింది. మూడింతలైన బార్ట్రానిక్స్ నష్టం డిసెంబర్ త్రైమాసికంలో బార్ట్రానిక్స్ నష్టాలు క్రితంతో పోలిస్తే మూడింతలై రూ.18 కోట్లకు చేరుకున్నాయి. టర్నోవరు రూ.20 కోట్ల నుంచి రూ.17 కోట్లకు వచ్చి చేరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు రూ.70 లక్షల లాభం.. డిసెంబర్లో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.70 లక్షల నికరలాభం పొందింది. క్రితం ఏడాది రూ.1.9 కోట్ల నష్టం వచ్చింది. టర్నోవరు రూ.445 కోట్ల నుంచి రూ.489 కోట్లకు ఎగిసింది. సూర్యలక్ష్మి కాటన్‌కు రూ.20 లక్షల లాభం.. గడిచిన క్వార్టరులో సూర్యలక్ష్మి కాటన్ మిల్స్ రూ.20 లక్షల లాభం నమోదు చేసింది. క్రితం ఏడాది కంపెనీకి రూ.61 లక్షల నష్టం వాటిల్లింది. టర్నోవరు రూ.146 కోట్ల నుంచి రూ.169 కోట్లకు ఎగిసింది. 60 శాతం తగ్గిన పెబ్స్ లాభం.. డిసెంబర్ క్వార్టరులో పెబ్స్ పెన్నార్ నికరలాభం క్రితంతో పోలిస్తే 60 శాతం తగ్గి రూ.2 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.152 కోట్ల నుంచి రూ.117 కోట్లకు వచ్చి చేరింది. -
సోలార్ ప్యానెలే ఇక రూఫ్
విశాక ఇండస్ట్రీస్ నుంచి ‘ఆటమ్’ మిర్యాలగూడలో 60 మెగావాట్ల ప్లాంటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్ తాజాగా సోలార్ విపణిలోకి ప్రవేశించింది. ఆటమ్ పేరుతో సోలార్ రూఫింగ్ సిస్టమ్స్‌ను గురువారమిక్కడ ఆవిష్కరించింది. సంప్రదాయ రూఫింగ్ సిస్టమ్స్‌కు భిన్నంగా భారత్‌లో తొలిసారిగా వినూత్న డిజైన్‌తో వీటిని రూపొందించింది. ఫైబర్ సిమెంటు బోర్డుకు సోలార్ సిస్టమ్‌ను జోడించడంతో సోలార్ ప్యానెలే రూఫ్‌గా మారిపోయింది. దీని మందం కేవలం 12 మిల్లీమీటర్లు. చదరపు అడుగుకు ధర రూ.700గా నిర్ణయించామని విశాక జేఎండీ జి.వంశీకృష్ణ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆటమ్ జీవిత కాలం 25 ఏళ్లని చెప్పారు. ఏడాదిన్నరపాటు పరిశోధన చేసిన అనంతరం వీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదార్లను తొలుత లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. నూతనంగా నిర్మించే గృహాలకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయన్నారు. మూడు నెలల్లో ప్లాంటు.. సోలార్ ప్యానెళ్ల తయారీకి నల్గొండ సమీపంలోని మిర్యాలగూడ వద్ద ప్లాంటును నిర్మిస్తున్నట్టు వంశీకృష్ణ తెలిపారు. ‘60 మెగావాట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ప్లాంటుకై తొలి దశలో రూ.10 కోట్లు వెచ్చిస్తున్నాం. ఉత్పాదనకు పేటెంటు దాఖలు చేశాం. పర్యావరణానికి ఇది అనుకూలమైంది. మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయం. ఆటమ్‌ను విదేశాలకూ ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. పశ్చిమ బెంగాల్లో వి–బోర్డుల తయారీ ప్లాంటు 2019లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని విశాక ఇండస్ట్రీస్ వైస్ చైర్మన్ జి.వివేకానంద్ తెలిపారు. హర్యానాలోని జజ్జర్ వద్ద రూ.100 కోట్లతో నిర్మిస్తున్న మూడో ప్లాంటు వచ్చే ఏడాది మార్చికల్లా సిద్ధం అవుతుందని చెప్పారు. కాగా, ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సీఈవో జి.వి.ప్రసాద్, విశాక ఎండీ సరోజ వివేకానంద్ పాల్గొన్నారు. -
హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు!
♦ మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభం ♦ భారత్‌లో టాప్–1గా నిలిచిన వి–నెక్ట్స్ ♦ నిర్మాణాలకు వన్‌స్టాప్ సొల్యూషన్స్ ♦ విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీ కృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డైవర్సిఫైడ్ కంపెనీ విశాక ఇండస్ట్రీస్... పూర్తిస్థాయి నిర్మాణ రంగ కంపెనీగా రూపాంతరం చెందుతోంది. ఫైబర్ సిమెంట్ ఆకృతులు, వి–బోర్డ్స్‌తో నిర్మాణ రంగానికి ఒన్‌స్టాప్ సొల్యూషన్స్ అందించే సంస్థగా మారుతున్న విశాక.. తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని... నెలకు 6వేల టన్నుల ఫైబర్ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం జజ్జర్ జిల్లాలో 30 ఎకరాలను కొనుగోలు చేసింది. రూ.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో 2018 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ జాయింట్ ఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే సామర్థ్యం పరంగా దేశంలో ఫైబర్ సిమెంటు బోర్డుల ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా నిలుస్తామన్నారు. ప్లాంటుకు కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నామని చెప్పారాయన. కంపెనీకి ఇప్పటికే తెలంగాణలోని మిర్యాలగూడతో పాటు మహారాష్ట్రలోని పుణేలో ఫైబర్ సిమెంటు బోర్డుల తయారీ ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 10,000 టన్నులు. గణనీయ స్థాయికి వి–నెక్ట్స్ వాటా... దేశంలో ఫైబర్ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల మార్కెట్ ప్రస్తుతం రూ.600 కోట్లుంది. ఇది ఏటా 15–20 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో విశాకకు చెందిన వి–నెక్ట్స్ బ్రాండ్ అగ్రస్థాయిలో ఉండి 25 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ‘‘2016–17లో రూ.1,007 కోట్ల మొత్తం టర్నోవర్‌లో వి–నెక్ట్స్ ద్వారా రూ.150 కోట్లు సమకూరింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికం’’ అని వంశీకృష్ణ తెలియజేశారు. 2019–20 నాటికి రూ.1,400–1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నామని, దాన్లో వి–నెక్ట్స్ వాటా 20 శాతం దాటుతుందని ఆయన అంచనా వేశారు. బెంగళూరులోని నియో మాల్, కేరళ మెట్రో కార్యాలయం, ముంబై ఎయిర్‌పోర్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో వి–నెక్ట్స్ ఉత్పత్తులు వాడారు. ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మంత్రి డెవలపర్స్, మై హోమ్, టీసీఎస్, రిలయన్స్ తదితర సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో వి–బోర్డ్‌లతో మోడల్ హౌజ్‌ను నిర్మించింది కూడా. భవనాలను నిర్మించి ఇస్తాం.. పర్యావరణానికి అనుకూలం కావటంతో పాటు మన్నిక కూడా ఎక్కువ కావటంతో అత్యాధునిక, అందమైన భవనాల నిర్మాణంలో ఫైబర్ సిమెంటు బోర్డుల వాడకం పెరుగుతోంది. ‘‘ఫైబర్ సిమెంట్ బోర్డులతో ఇంటిని నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. ఇటుకలు, కలపకు బదులు పూర్తిగా ఫైబర్ సిమెంటు బోర్డులు వాడతాం. ఇవి మంటలకు అంటుకోవు. అలాగే తడవవు కూడా. విభిన్న రంగుల్లో చిత్రాలతో తయారు చేయొచ్చు. తక్కువ సమయంలో నిర్మాణం పూర్తవుతుంది. పిల్లర్లు, స్లాబ్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఫైబర్ సిమెంటు బోర్డులతో గోడలు, కిచెన్ క్యాబినెట్లు, షెల్ఫ్‌లు, వార్డ్రోబ్లు, వాల్ ప్యానె ల్స్, ఫాల్స్ సీలింగ్, పార్టీషన్స్, మెజ్జనైన్ ఫ్లోరింగ్, క్లాడింగ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. బయటి వాతావరణంతో పోలిస్తే లోపల 6 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నిర్వహణ వ్యయం అసలే లేదు. కార్పెట్ ఏరియా ఎక్కువగా వస్తుంది’’ అని వంశీకృష్ణ వివరించారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.18 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. పెరుగుతున్న షేరు ధర విశాక ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ ప్రస్తుతం రూ.806 కోట్లు. ఏడాది కనిష్ఠ ధర రూ.138తో పోలిస్తే ఈ 12 నెలల్లో షేరు ఏకంగా 400% పైగా పెరిగింది. బుధవారంనాడు రూ.560కి చేరిన ఈ షేరు ధర... గడిచిన కొన్ని నెలల తరవాత గురువారం తొలిసారి కరెక్షన్కు గురై రూ.510 వద్దకు చేరింది. గడిచిన నెలరోజుల్లోనే కంపెనీ షేరు ధర ఏకంగా 60 శాతం వరకూ పెరగటం గమనార్హం. -
వైద్య సేవల్లోకి విశాక ఇండస్ట్రీస్!
⇒ సికింద్రాబాద్‌లో రూ.200 కోట్లతో ఆసుపత్రి ⇒ ఉత్తరాదిన వి–బోర్డ్స్ ప్లాంటు ⇒ ‘సాక్షి’తో కంపెనీ ఎండీ సరోజ వివేకానంద్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న విశాక ఇండస్ట్రీస్ వైద్య సేవల్లోకి ప్రవేశిస్తోంది. సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. సంస్థకు ఇక్కడ దాదాపు రెండెకరాల స్థలం ఉందని, దీన్లో రూ.200 కోట్ల దాకా వెచ్చించి ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని విశాక ఎండీ జి.సరోజ వివేకానంద్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. 2019 నాటికి ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వస్తుందన్నారు. ‘‘మేడ్చల్‌లో ఐదెకరాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ) ఏర్పాటు చేస్తున్నాం. విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీన్ని ఏర్పాటు చేస్తాం. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెడుతున్నాం’’ అని ఆమె వివరించారు. ఏడాదిలో కొత్త ప్లాంటు.. ప్రస్తుతం విశాక ఇండస్ట్రీస్ వి–బోర్డ్స్ పేరుతో ఫైబర్ సిమెంట్ బోర్డులను భారత్‌తోపాటు పలు దేశాల్లో విక్రయిస్తోంది. మిర్యాలగూడ, పుణే వద్ద కంపెనీకి వీటి తయారీ ప్లాంట్లున్నాయి. మిర్యాలగూడ ప్లాంటు సామర్థ్యం నెలకు 4,000 టన్నులు కాగా పుణే ప్లాంటు 7,200 టన్నులు. మరో ప్లాంటును ఉత్తరాదిన ఏర్పాటు చేస్తామని, ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్‌లలో ఒకచోట ఇది ఏర్పాటవుతుందని చెప్పారామె. నెలకు 4–6 వేల టన్నుల సామర్థ్యంతో రానున్న ఈ ప్లాంటుకు రూ.70 కోట్ల దాకా వెచ్చించనున్నట్లు కంపెనీ డైరెక్టర్ జి.వంశీ కృష్ణ చెప్పారు. 2018 మార్చిలోగా కొత్త ప్లాంటు రెడీ అవుతుందన్నారు. ఆధునిక భవనాలకు తగ్గట్టుగా విభిన్న డిజైన్లలో వి–బోర్డులను కంపెనీ తయారు చేస్తోంది. అగ్ర స్థానానికి వి–బోర్డ్స్.. నిర్మాణ రంగంలో భారత్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వంశీ కృష్ణ చెప్పారు. ప్లేవుడ్ స్థానంలో ఇప్పుడు ఫైబర్ సిమెంటు బోర్డులు ఆదరణ పొందుతున్నాయన్నారు. ‘ఫైబర్ సిమెంటు బోర్డుల పరిశ్రమ విలువ దేశంలో రూ.500 కోట్లుంది. ప్లేవుడ్‌తో పోలిస్తే వీటి ధర సగానికంటే తక్కువ. నాణ్యత, మన్నిక ఎక్కువ. ఇటుకలకు బదులుగా వీటిని వాడొచ్చు. ఇవి పర్యావరణానికి అనుకూలం కూడా. నిర్మాణ సమయమూ ఆదా అవుతుంది. 2016 డిసెంబరుతో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ ఈ విభాగంలో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. సంస్థ టర్నోవరులో 30 శాతం వి–బోర్డుల నుంచి సమకూరుతోంది. రానున్న రోజుల్లో ఈ విభాగమే విశాక ఇండస్ట్రీస్‌కు అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టనుంది’ అని వివరించారు. -
విశాక లాభం రూ.16 కోట్లు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విశాక ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.13.6 కోట్ల నుంచి రూ.16.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.321 కోట్ల నుంచి రూ.309 కోట్లకు పడింది. -
నం.1 స్థానానికి చేరుకుంటాం..
ఆస్బెస్టాస్ సిమెంట్ రంగంపై విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద్ పాలసీల్లో స్పష్టత వస్తే సోలార్‌పై ఫోకస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల విపణిలో అగ్ర స్థానానికి చేరుకోవాలని విశాక ఇండస్ట్రీస్ కృతనిశ్చయంతో ఉంది. రూ.58,500 కోట్ల విలువైన పరిశ్రమలో కంపెనీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్లాంట్ల సామర్థ్యం పెంపు, మార్కెట్లో మరింత విస్తరణ ద్వారా నం.1 స్థానానికి ఎగబాకుతామని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.సరోజ వివేకానంద్ తెలిపారు. ఆస్బెస్టాస్ సిమెంట్ పరిశ్రమ తీరుతెన్నులు, కంపెనీ నూతన బ్రాండ్ ‘వి-నెక్స్ట్’తోపాటు భవిష్యత్ ప్రణాళికలను సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. అగ్ర స్థానం దిశగా.. భారత్‌లో ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల పరిశ్రమ పరిమాణం 4.5 కోట్ల టన్నులు. విలువ రూ.58,500 కోట్లుంది. సుమారు 15 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. పరిశ్రమ పరిమాణంలో టాప్-4 కంపెనీల వాటా 60 శాతముంది. గ్రామీణ మార్కెట్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మార్కెట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంది. ఆస్బెస్టాస్ సిమెంట్ రేకుల విపణిలో విశాక ఇండస్ట్రీస్ రెండో స్థానంలో కైవసం చేసుకుంది. నాణ్యత విషయంలో విశాక బ్రాండ్‌కు మంచి పేరుంది. ప్లాంట్ల సామర్థ్యం పెంపు, అన్ని ప్రాంతాలకూ విస్తరించడం ద్వారా తొలి స్థానానికి చేరుకుంటాం. ప్లాంట్ల విస్తరణ.. కంపెనీకి దేశవ్యాప్తంగా ఆస్బెస్టాస్ సిమెంటు ప్లాంట్లు 8 ఉన్నాయి. ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 8 లక్షల టన్నులు. నాన్ ఆస్బెస్టాస్ ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీకి రెండు ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం 1.20 లక్షల టన్నులు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద 2,500 టన్నుల సామర్థ్యం గల నూలు తయారీ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 13 శాతం పెంచుతున్నాం. అలాగే రాయ్‌బరేలి ఆస్బెస్టాస్ ప్లాంటులో ఉత్పత్తి 15 శాతం అధికం కానుంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్ల దాకా వ్యయం చేస్తున్నాం. విస్తరణ, మార్కెటింగ్‌కు ఏటా కనీసం రూ.20-30 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నాన్ ఆస్బెస్టాస్లో.. వి-నెక్స్ట్ పేరుతో ఆస్బెస్టాస్ లేని ఫైబర్ సిమెంట్ బోర్డులు, ప్యానెళ్లను తయారు చేస్తున్నాం. పర్యావరణానికి ఇవి అనుకూలమైనవి. మంటలను తట్టుకుంటాయి. అందంగానూ ఉంటాయి. బిగించడం చాలా తేలిక. నిర్మాణ సమయం ఆదా అవుతుంది. ఇసుక, కార్మికుల కొరత కారణంగా భవిష్యత్తు నిర్మాణాల్లో ఫైబర్ సిమెంట్‌కు డిమాండ్ గణనీయంగా ఉండనుంది. రెండు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంలో వినియోగం ప్రస్తుతం 60 శాతముంది. డిమాండ్ నేపథ్యంలో 2015లో ఇది 95 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం. సోలార్ రంగంలో.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఉన్న యూనిట్లో ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ అంచనాలను మించి విద్యుదుత్పత్తి చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని సౌర విద్యుత్ విధానాల్లో స్పష్టత లేదు. సమయం వస్తే ఈ రంగంలో విస్తరించాలన్నది ప్రణాళిక. గత ఆర్థిక సంవత్సరంలో రూ.892 కోట్ల టర్నోవర్‌పై రూ.12 కోట్ల నికర లాభం ఆర్జించాం. 2014-15లో ఆదాయంలో 10-12 శాతం వృద్ధితోపాటు మరింత లాభం ఆశిస్తున్నాం. ఆస్బెస్టాస్ ఫైబర్‌ను ఇక్కడి కంపెనీలు రష్యా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ముడిసరుకు లభ్యత బాగానే ఉంది. రెండేళ్లుగా ధర తగ్గింది కూడా. సిమెంటు, ఫ్లైయాష్ అందుబాటు ధరలో కొరత లేకుండా లభిస్తోంది. దీంతో లాభాలపై ఒత్తిడి లేదు.