నం.1 స్థానానికి చేరుకుంటాం.. | we will definitely reach the number one position | Sakshi
Sakshi News home page

నం.1 స్థానానికి చేరుకుంటాం..

Published Wed, Dec 17 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

నం.1 స్థానానికి చేరుకుంటాం..

నం.1 స్థానానికి చేరుకుంటాం..

ఆస్‌బెస్టాస్ సిమెంట్ రంగంపై విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద్
పాలసీల్లో స్పష్టత వస్తే సోలార్‌పై ఫోకస్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్‌బెస్టాస్ సిమెంట్ రేకుల విపణిలో అగ్ర స్థానానికి చేరుకోవాలని విశాక ఇండస్ట్రీస్ కృతనిశ్చయంతో ఉంది. రూ.58,500 కోట్ల విలువైన పరిశ్రమలో కంపెనీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ప్లాంట్ల సామర్థ్యం పెంపు, మార్కెట్లో మరింత విస్తరణ ద్వారా నం.1 స్థానానికి ఎగబాకుతామని విశాక ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ జి.సరోజ వివేకానంద్ తెలిపారు. ఆస్‌బెస్టాస్ సిమెంట్ పరిశ్రమ తీరుతెన్నులు, కంపెనీ నూతన బ్రాండ్ ‘వి-నెక్స్ట్’తోపాటు భవిష్యత్ ప్రణాళికలను సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..

అగ్ర స్థానం దిశగా..
భారత్‌లో ఆస్‌బెస్టాస్ సిమెంట్ రేకుల పరిశ్రమ పరిమాణం 4.5 కోట్ల టన్నులు. విలువ రూ.58,500 కోట్లుంది. సుమారు 15 కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయి. పరిశ్రమ పరిమాణంలో టాప్-4 కంపెనీల వాటా 60 శాతముంది. గ్రామీణ మార్కెట్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మార్కెట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. పరిశ్రమకు మంచి భవిష్యత్ ఉంది. ఆస్‌బెస్టాస్ సిమెంట్ రేకుల విపణిలో విశాక ఇండస్ట్రీస్ రెండో స్థానంలో కైవసం చేసుకుంది. నాణ్యత విషయంలో విశాక బ్రాండ్‌కు మంచి పేరుంది. ప్లాంట్ల సామర్థ్యం పెంపు, అన్ని ప్రాంతాలకూ విస్తరించడం ద్వారా తొలి స్థానానికి చేరుకుంటాం.
 
ప్లాంట్ల విస్తరణ..
కంపెనీకి దేశవ్యాప్తంగా ఆస్‌బెస్టాస్ సిమెంటు ప్లాంట్లు 8 ఉన్నాయి. ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 8 లక్షల టన్నులు. నాన్ ఆస్‌బెస్టాస్ ఫైబర్ సిమెంట్ బోర్డుల తయారీకి రెండు ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం 1.20 లక్షల టన్నులు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వద్ద 2,500 టన్నుల సామర్థ్యం గల నూలు తయారీ ప్లాంటు ఉంది. ఈ ప్లాంటు సామర్థ్యాన్ని 13 శాతం పెంచుతున్నాం. అలాగే రాయ్‌బరేలి ఆస్‌బెస్టాస్ ప్లాంటులో ఉత్పత్తి 15 శాతం అధికం కానుంది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్ల దాకా వ్యయం చేస్తున్నాం. విస్తరణ, మార్కెటింగ్‌కు ఏటా కనీసం రూ.20-30 కోట్లు ఖర్చు పెడుతున్నాం.

నాన్ ఆస్‌బెస్టాస్‌లో..
వి-నెక్స్ట్ పేరుతో ఆస్‌బెస్టాస్ లేని ఫైబర్ సిమెంట్ బోర్డులు, ప్యానెళ్లను తయారు చేస్తున్నాం. పర్యావరణానికి ఇవి అనుకూలమైనవి. మంటలను తట్టుకుంటాయి. అందంగానూ ఉంటాయి. బిగించడం చాలా తేలిక. నిర్మాణ సమయం ఆదా అవుతుంది. ఇసుక, కార్మికుల కొరత కారణంగా భవిష్యత్తు నిర్మాణాల్లో ఫైబర్ సిమెంట్‌కు డిమాండ్ గణనీయంగా ఉండనుంది. రెండు ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంలో వినియోగం ప్రస్తుతం 60 శాతముంది. డిమాండ్ నేపథ్యంలో 2015లో ఇది 95 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం.
 
సోలార్ రంగంలో..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఉన్న యూనిట్లో ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ అంచనాలను మించి విద్యుదుత్పత్తి చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లోని సౌర విద్యుత్ విధానాల్లో స్పష్టత లేదు. సమయం వస్తే ఈ రంగంలో విస్తరించాలన్నది ప్రణాళిక. గత ఆర్థిక సంవత్సరంలో రూ.892 కోట్ల టర్నోవర్‌పై రూ.12 కోట్ల నికర లాభం ఆర్జించాం. 2014-15లో ఆదాయంలో 10-12 శాతం వృద్ధితోపాటు మరింత లాభం ఆశిస్తున్నాం. ఆస్‌బెస్టాస్ ఫైబర్‌ను ఇక్కడి కంపెనీలు రష్యా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ముడిసరుకు లభ్యత బాగానే ఉంది. రెండేళ్లుగా ధర తగ్గింది కూడా. సిమెంటు, ఫ్లైయాష్ అందుబాటు ధరలో కొరత లేకుండా లభిస్తోంది. దీంతో లాభాలపై ఒత్తిడి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement