
‘ఇంధన’ పరిజ్ఞానంపై పరిశోధనలు
♦ సాంకేతికతను సభ్య దేశాలు పంచుకోవాలి
♦ ‘బ్రిక్స్’ సదస్సులో తీర్మానాలు
సాక్షి, విశాఖపట్నం: ఇంధన పొదుపు, సమర్థతలపై మరింత పరిశోధనలు సాగించాలని, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకోవాలని ‘బ్రిక్స్’ సదస్సు తీర్మానించింది. విద్యుత్ ఆదా, ఇంధన సమర్థతపై విశాఖలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల ప్రతినిధులు సోమ, మంగళవారాల్లో ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. వాటి వివరాలను కేంద్ర విద్యుత్‌శాఖ అదనపు కార్యదర్శి బీపీ పాండే మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇంధన సామర్థ్యం పెంపుతో అభివృద్ధి సాధ్యమవుతుందని సదస్సు అభిప్రాయపడిందని చెప్పారు. రోజురోజుకు వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూనే పరిశోధనలపైనా దృష్టి సారించాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం సదస్సులు, చర్చలు, సెమినార్ల ద్వారా అభిప్రాయాలను పంచుకుంటే ఫలితం ఉంటుందన్నారు. ఇందుకోసం ఒక డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్టు తెలిపారు. అవసరమైన నిధులను బ్రిక్స్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి సమకూర్చుకుంటాయన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిలైట్లతో విద్యుత్ ఆదా అయిన నేపథ్యంలో సభ్య దేశాల్లోనూ వీటిని అమర్చాలన్న అభిప్రాయానికొచ్చారన్నారు. సదస్సులో తీర్మానించిన అంశాలను సభ్య దేశాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తారన్నారు. 2020 నాటికి బ్రిక్స్ దేశాలు ఇంధన పొదుపులో ఉత్తమ ఫలితాలు సాధించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
అతి తక్కువ ధరకే సోలార్ ఫ్యాన్లు
అతి తక్కువ ధరలకే వినియోగదార్లకు సోలార్ సీలింగ్ ఫ్యాన్లు అందజేయనున్నట్టు ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) ఎండీ శౌరభ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. ఒక్కో ఫ్యాను ఖరీదు రూ.1150 ఉంటుందని, వీటిని సాధ్యమైనంత అతి తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. తొలిదశలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు వినియోగదార్లకు అందజేశామన్నారు. ఎల్‌ఈడీ వీధిలైట్లు రీప్లేస్‌మెంట్ ప్రక్రియ మొదలెట్టామని, మొత్తం 5.5 లక్షల బల్బులు మార్చాలన్నది లక్ష్యం కాగా 4.5 లక్షలు పూర్తిచేశామని, మిగిలినవి సెప్టెంబర్ ఆఖరుకు పూర్తి చేస్తామని వివరించారు. రెండు లక్షల మంది రైతులకు 3 నుంచి 20 హార్స్‌పవర్ సామర్థ్యం గల సోలార్ పంప్‌సెట్లు అందజేస్తామని, ఏటా సర్వీసింగ్‌తోపాటు ఐదేళ్లు వారెంటీ ఉంటుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో పౌలా రస్సీ (బ్రెజిల్), ఓల్గా ఉడినా (రష్యా), షాన్‌చెంగ్ వాంగ్ (చైనా), జోలీ మబుసేలా (దక్షిణాఫ్రికా) తదితర ప్రతినిధులు పాల్గొన్నారు.