
వైజాగ్ హెచ్‌పీసీఎల్‌కు పచ్చజెండా..!
సాక్షి, విశాఖపట్నం: రెండేళ్లుగా కాగితాలకే పరిమితమైన వైజాగ్ హెచ్‌పీసీఎల్ విస్తరణకు క్రమక్రమంగా అడ్డంకులు తొలగుతున్నాయి. ఇటీవల ప్లాంట్‌లో తనిఖీలకు వచ్చిన కేంద్ర పర్యావరణ అనుమతుల కమిటీ విస్తరణకు దాదాపుగా పచ్చజెండా ఊపడంతో రూ.15వేల కోట్లు పెట్టుబడులకు మోక్షం లభించనుంది. దీంతో 8.3 నుంచి 15ఎంఎంటీఏ సామర్థ్యానికి విస్తరించేందుకు నిర్మాణ పనుల్ని వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.
వచ్చే ఏడాదినుంచి పట్టాలపైకి...
కేంద్రప్రభుత్వ రంగం సంస్థ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు విశాఖలో వున్న రిఫైనరీ ప్రస్తుతం 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీఏ) సామర్థ్యంతో పనిచేస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు ద్వారా 14 రకాల చమురు అధారిత ఉత్పత్తులను తయారు చేస్తోంది. రానురాను దేశీయంగా ఇంధన,గ్యాస్ అవసరాలు పెరిగిపోతుండడంతో ప్లాంట్‌ను విస్తరించేందుకు సామర్థ్యాన్ని 15 ఎంఎంటీఏలకు పెంచాలని భావించి యాజమాన్యం రెండేళ్ల కిందట ప్రాజెక్టు నివేదిక తయారుచేసింది.
అందు కోసం రూ.15వేల కోట్లు ఖర్చవుతుందని తేల్చింది. 2012లో పనులు ప్రారంభించి 2015 నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తేవాలని అప్పట్లో తీర్మానించింది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ప్లాంట్‌లో కాలుష్య సమస్యలతోపాటు పర్యావరణ అనుమతులు దొరక్క విస్తరణ ప్రయత్నాల కు బ్రేక్ పడింది. కాని ఇటీవల ప్లాంట్‌కు కేంద్ర పర్యావరణ అనుమతుల కమిటీ నిపుణులు కమిటీ పర్యటనకు వచ్చింది.
ప్లాంట్,పరిసర ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలపై అధ్యయనం చేసి అనుమతులు ఇచ్చేందుకు దాదాపుగా సానుకూల సంకేతాలను ఇచ్చింది. ప్లాంట్‌లో కాలుష్యం తీవ్రత తగ్గడం, హెచ్‌పీసీఎల్ నుంచి ఒకప్పుడు వెలువడే హైడ్రోకార్బన్, సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్య వాయువులు తగ్గడంతో పర్యావరణ అనుమతుల కమిటీ తాజా పర్యటనలో కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేసింది. పైగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విశాఖను 2010 జనవరిలో పారిశ్రామిక అనుమతుల నిషేధ ప్రాంతంగా గుర్తించగా గతేడాది ఈ నిషేధాన్ని ఎత్తివేసింది.