అమెరికా స్టాక్‌మార్కెట్లు భారీ పతనం(ఫైల్)
వాషింగ్టన్ : అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎస్ అండ్ పీ 500, డో ఇండస్ట్రియల్స్ సూచీలు రెండూ సోమవారం ట్రేడింగ్‌లో 4.0 శాతానికి పైగా నష్టపోయాయి. డో ఏకంగా తన చరిత్రలోనే అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని నమోదుచేసింది. సుమారు 1600 పాయింట్ల మేర కిందకి జారింది. ఆఖరికి 1175 పాయింట్ల నష్టంలో 25వేల కిందకు వచ్చి చేరింది. ఏడాదంతా ఆర్జించిన లాభాలను వాల్‌స్ట్రీట్ కోల్పోయింది. 2011 ఆగస్టు నుంచి అతిపెద్ద సింగిల్-డే నష్టాన్ని ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్, డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ నమోదుచేశాయి. గత ఆరేళ్ల కాలంలో ఎస్ అండ్ పీ 500కి సోమవారమే అతిచెత్త డే. చివరికి 2648.94 వద్ద క్లోజైంది. 0.5 శాతం పైకి ఎగిసిన నాస్‌డాక్ కాంపోజిట్ కూడా 3.8 శాతం నష్టాలు గడించి 6,967.53 వద్ద స్థిరపడింది. ప్రారంభ లాభాలకు ఆపిల్, అమెజాన్ సహకరించినప్పటికీ.. చివరి వరకు స్టాక్‌మార్కెట్లను ఈ షేర్లు కాపాడలేకపోయాయి.
అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించడంతో మార్కెట్‌లో ఈ పరిస్థితి నెలకొంది. అంతేకాక యూరో జోన్ రుణ సంక్షోభంలోకి కూరుకుపోయింది. గత మూడు నుంచి నాలుగేళ్లుగా మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్న చాలా మంది ఇన్వెస్టర్లు అంతకముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని లాస్‌వేగాస్‌లోని బ్రైట్ ట్రేడింగ్ ప్రొప్రైటరీ ట్రేడర్ డెనిస్ డిక్ చెప్పారు. మార్కెట్‌లో తీవ్రంగా అమ్మకాల ఒత్తిడి నెలకొందని విశ్లేషకులు చెప్పారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పన్ను కోతలు, బలమైన కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ వాల్యుయేషన్‌కు మద్దతు ఇస్తాయని బుల్ విశ్లేషకులు చెబుతున్నారు.
బుల్ విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా... ఇటీవల ఏళ్లలో సెంట్రల్ బ్యాంకు తన సరళతరమైన విధానాలను విత్‌డ్రా చేస్తుందని, బాండు దిగుబడి పెరుగుతుందని దీంతో మార్కెట్లు మరింత పతనం కావొచ్చని బేర్ విశ్లేషకులంటున్నారు. సోమవారం మార్కెట్‌లో ఫైనాన్సియల్, హెల్త్‌కేర్, ఇండస్ట్రియల్ సెక్టార్లు ఎక్కువగా నష్టపోయాయి. దిగ్గజ 11 ఎస్ అండ్ పీ రంగాలు కనీసం 1.7 శాతం మేర కిందకి పడిపోయాయి. 30 బ్లూచిప్ డో ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ కూడా నెగిటివ్‌గా ముగిశాయి. వాల్‌స్ట్రీట్ మార్కెట్ల ప్రభావం ఇటు ఆసియన్ మార్కెట్లపైనా పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment