ఫ్లిప్కార్ట్తో వాల్మార్ట్ జట్టు !
న్యూఢిల్లీ: ప్రపంచ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ కామర్స్ లీడర్ ఫ్లిప్‌కార్ట్ చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యంపై వీటి మధ్య చర్చలు నడుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడం ద్వారా బూమ్ మీదున్న దేశీయ ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించడంతోపాటు, అమెరికాలో వలే ఇక్కడ కూడా అమెజాన్‌కు వాల్‌మార్ట్ గట్టిపోటీనివ్వవచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఫ్లిప్‌కార్ట్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా స్వల్ప వాటా తీసుకునేందుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉందని, భాగస్వామ్యంపై ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. దీనిపై పీటీఐ వార్తా సంస్థ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లను సంప్రదించగా... వదంతులు, ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని తిరస్కరించాయి.