న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన వాల్ మార్ట్ దేశీయ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు కోసం రూ.7,439 కోట్ల పన్నును చెల్లించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు 10 మంది నుంచి వాటాల కొనుగోలు కోసం ఈ మేరకు చెల్లించింది. ఇంకా 34 మంది నుంచి పన్నులను మినహాయించలేదు. ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆ సంస్థకు, వాల్‌మార్ట్‌కు మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్‌లో మొత్తం 44 మంది వాటాదారులు ఉన్నారు.
ఇందులో సాఫ్ట్‌బ్యాంకు, నాస్పర్స్, వెంచర్ ఫండ్ అయిన అస్సెల్‌పార్ట్‌నర్స్, ఈబే తదితరులు తమ వాటాలను వాల్‌మార్ట్‌కు విక్రయించారు. పన్నును జమ చేసేందుకు చివరితేదీ సెప్టెంబర్ 7కాగా, ఆఖరు రోజున రూ.7,439 కోట్ల విత్‌హోల్డింగ్స్ పన్నును వాల్‌మార్ట్ ఆదాయపన్ను శాఖకు జమ చేసింది. ‘‘ఫ్లిప్‌కార్ట్‌లో వాటాలు కలిగిన 44 మంది వాల్‌మార్ట్‌కు విక్రయించగా, కేవలం పది మందికి సంబంధించే వాల్‌మార్ట్ పన్నులు జమ చేసింది. వాటాదారుల నుంచి పన్నును మినహాయించే విషయంలో పాటించిన విధానాన్ని మేం ప్రశ్నించాం. ప్రతీ కేసుకు సంబంధించి వివరణ కోరాం’’అని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment