హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏఐ, బ్లాక్ చెయిన్ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్ కంపెనీ ‘బిజ్ ఏక్టివ్’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్ ఏక్టివ్‌లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుంచి కూడా విద్యార్థులున్నారు. మరిన్ని వివరాలు బిజ్ ఏక్టివ్ ఫౌండర్ మహ్మద్ యాకుబ్ పాషా మాటల్లోనే..
‘‘మాది వరంగల్ జిల్లా మల్లంపల్లి. ఆర్ధిక పరిస్థితుల కారణంగా బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి వరంగల్‌లో ఢిల్లీకి చెందిన ఓ ఎడ్యుకేషన్ కంపెనీలో ఉద్యోగంలో చేరా. గ్రామీణ ప్రాంతం నుంచి రావటంతో టెక్నాలజీ కోర్సులను అంత త్వరగా అందుకోలేకపోయా. ఇది నా ఉద్యోగంపై ప్రభావం చూపించింది. నాలా ఇతర గ్రామీణ యువత ఇబ్బంది పడకూడదన్న అభిప్రాయంతో అందుబాటు సమయంలో తక్కువ ఖర్చుతో సాంకేతిక కోర్సులను అందించాలనే లక్ష్యంతో బిజ్‌ఏక్టివ్ సర్వీసెస్‌ను ఆరంభించా. 2016 మార్చిలో లక్ష రూపాయల పెట్టుబడితో వరంగల్ కేంద్రంగా ‘బిజ్‌ఏక్టివ్’ సర్వీసెస్‌ను ప్రారంభించా. తెలుగు, హిందీ భాషల్లో గ్రామీణులకు అర్థమయ్యేలా సులువైన పద్ధతుల్లో కోర్సులను అందించడమే మా ప్రత్యేకత.
బిజ్‌ఏక్టివ్‌లో 2 ప్యాకేజీలు..
ప్రస్తుతం బిజ్‌ఏక్టివ్‌లో 2 రకాల ప్యాకేజీలున్నాయి. 1. ఎడ్యు అడ్వాన్స్‌డ్. ధర రూ.2,999. ఇందులో 152 అంశాలకు సంబంధించిన 87 రకాల కంప్యూటర్ కోర్సులుంటాయి. హిందీ భాషలో 10 రకాల కోర్సులుంటాయి. ఇవన్నీ ఆడియో, వీడియో ట్యుటోరియల్స్ రూపంలో ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుతో పాటూ 200 రకాల ఈ–పుస్తకాలను కూడా అందిస్తాం. ఇంటర్నెట్ అందుబాటులో లేనివాళ్ల కోసం ఆయా ప్యాకేజీ కోర్సుల పుస్తకాలను పెన్‌డ్రైవ్‌లో అందిస్తాం. రెండోది, ఎడ్యు అల్టిమేట్. ధర రూ.6,600. ఇందులో మొదటి ప్యాకేజీతో పాటూ షాపింగ్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ కార్డ్‌ను ఇస్తాం. బిజ్‌కార్ట్.కామ్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. 4 లక్షలకు పైగా ఉత్పత్తులున్నాయి. రీచార్జ్, కరెంట్ బిల్లుల వంటి యుటిలిటీ సేవలతో పాటూ బస్, రైలు, విమాన టికెట్లను కూడా బుకింగ్ చేసుకోవచ్చు.
నేపాల్, దుబాయ్‌లకు విస్తరణ...
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటూ చెన్నై, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు నగరాల్లో సేవలందిస్తున్నాం. 18 వేల మంది కస్టమర్లున్నారు. మా ఉత్పత్తులకు నేపాల్, దుబాయ్‌ల నుంచి డిమాండ్ ఉంది. త్వరలోనే ఆయా ప్రాంతా ల్లో కేంద్రాలను ఆరంభించనున్నాం. అనుమతికి దరఖాస్తు చేశాం. ఏడాదిలో లక్ష కస్టమర్లను చేరుకోవాలన్నది లక్ష్యం. అందుకే ఆఫ్‌లైన్‌లో శిక్షణ ప్రారంభించాం. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ వేణుగోపాల్ లక్ష్మీపురంను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాం.
రూ.2 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మాకు 200 మంది డిస్ట్రిబ్యూటర్లున్నారు. ఏడాదిలో 500 మందికి చేర్చుతాం. మా ప్యాకేజీ అమ్మకం మీద దాదాపు 10 శాతం కమీషన్ ఉంటుంది. గత రెండేళ్లలో రూ.3 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. వచ్చే ఏడాది కాలంలో రూ.10 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలన్నది టార్గెట్. ప్రస్తుతం మా సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. పలు ఎన్‌జీవో, ఏంజిల్ ఇన్వెస్టర్లతో చర్చలు చేస్తున్నాం. ఏడాదిలో రూ.2 కోట్ల నిధులను సమీకరించనున్నాం’’ అని పాషా వివరించారు.
టెక్ బడి.. ‘బిజ్ ఏక్టివ్’
Published Sat, Sep 8 2018 1:19 AM | Last Updated on Sat, Sep 8 2018 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment