రూ.100 కోట్లతో హావెల్స్ వాటర్ హీటర్ ప్లాంటు | Water heater plant of havels | Sakshi
Sakshi News home page

రూ.100 కోట్లతో హావెల్స్ వాటర్ హీటర్ ప్లాంటు

Published Tue, Sep 15 2015 12:49 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

రూ.100 కోట్లతో హావెల్స్ వాటర్ హీటర్ ప్లాంటు - Sakshi

రూ.100 కోట్లతో హావెల్స్ వాటర్ హీటర్ ప్లాంటు

- తొలి దశగా 3 లక్షల యూనిట్ల సామర్థ్యం
- ఏటా రూ.200 కోట్లతో హావెల్స్ విస్తరణ కూడా
- కంపెనీ సీఎండీ అనిల్‌రాయ్ గుప్తా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
విద్యుత్ ఉపకరణాల తయారీ సంస్థ హావెల్స్ ఇండియా లిమిటెడ్ దేశంలో మరో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇప్పటికే రాజస్తాన్‌లోని నిమ్రానాలో 40 ఎకరాల్లో ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్, మోటార్ ప్లాంట్లుండగా.. ఆ రాష్ట్రంలోనే కొత్తగా మరో రూ.100 కోట్ల పెట్టుబడులతో 1.16 లక్షల చ.అ.ల్లో హావెల్స్ వాటర్ హీటర్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుం ధర రాజే ఈనెల 12న ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ వాటర్ హీటర్ ప్లాంట్ సామర్థ్యం ఏటా 5 లక్షలు కాగా.. తొలి దశగా 3 లక్షల యూనిట్లను తయారు చేస్తామని.. డిమాండ్‌ను బట్టి వీటి సంఖ్యను పెంచుతామని హావెల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ అనిల్ రాయ్ గుప్తా విలేక రులకు చెప్పారు. ‘ఈ ప్లాంట్ పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. ఫెరోగ్లాస్ డ్రై పౌడర్ టెక్నాలజీతో హీటర్లు తయారు చేస్తాం.

ఇవి 850 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బేకింగ్ అవుతాయి. దీంతో కఠిన జలం లభ్యమయ్యే పరిస్థితిలోనూ ట్యాంక్ తుప్పు పట్టదు. హీటర్లు ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఎల్‌సీబీ (ఎర్త్ లీకేజీ సర్క్యూట్ బ్రేకర్)తో తయారు చేసిన ఈ హీటరుల కరెంట్ లీకేజీ అయినా కూడా షాక్ కొట్టదని’ హీటర్ల తయారీ గురించి గుప్తా వివరించారు. ఇలాంటి వాటర్ హీటర్ల తయారీ కోసం చైనా, జపాన్, స్విట్జర్లాండ్, ఇటలీ దేశాల నుంచి యంత్రాలు దిగుమతి చేసుకున్నామన్నారు. 10-120 లీటర్ల కెపాసిటీ గల వీటి ధర రూ.3,200 నుంచి రూ.25 వేలకు పైగానే ఉందని చెప్పారు. ‘దేశంలో వాటర్ హీటర్ల సంఘటిత రంగం పరిశ్రమ రూ.1,500 కోట్లుండగా.. ఏటా 10-12 శాతం వృద్ధి రేటును కనబరుస్తుంది. ఈ రంగంలో రానున్న 2-3 ఏళ్లలో రూ.400 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని’ గుప్తా వివరించారు. ఇక్కడ తయారైన వాటర్ హీటర్లు మన దేశంతో పాటుగా ఆఫ్రికా, మధ్యప్రాచ్య, లాటిన్ అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. 40 శాతం ఎగుమతుల వాటాను ఆశిస్తున్నామని చెప్పారు.
 
ఏటా హావెల్స్ విస్తరణ, కొత్త ఉత్పత్తుల తయారీ నిమిత్తం రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. దేశంలో హావెల్స్‌కు మొత్తం 12 ప్లాంట్లుండగా.. రాజస్థాన్‌లోనే ఐదున్నాయన్నారు. రూ.20-25 కోట్ల చిన్నపాటి పెట్టుబడులతో ప్రారంభించిన ప్లాంట్‌లో సబ్‌మెర్సిబుల్ పంపులను తయారు చేస్తున్నామని.. వచ్చే వేసవిలోగా వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో సోలార్ స్ట్రీట్ లైట్లు, ఏసీలను కూడా తయారు చేస్తామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement