గణాంకాలు, ప్రపంచ పరిణామాలు కీలకం | This week's market influenced items | Sakshi
Sakshi News home page

గణాంకాలు, ప్రపంచ పరిణామాలు కీలకం

Published Mon, Nov 12 2018 1:47 AM | Last Updated on Mon, Nov 12 2018 1:47 AM

This week's market influenced items - Sakshi

కంపెనీల క్యూ2 ఫలితాలు దాదాపు ముగింపు దశకు రావడంతో  దేశీ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల ప్రభావం ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ఉండనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు వంటి  ప్రపంచ పరిణామాలు, రాష్ట్రాల ఎన్నికల సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం తదితర అంశాలు  కూడా స్టాక్‌సూచీల గమనాన్ని నిర్ధేశించనున్నాయి.

నేడు రిటైల్‌ గణాంకాలు..
గత  నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడతాయి. ఈ ఏడాది ఆగస్టులో 3.69 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం ఈ సెప్టెంబర్‌లో 3.77 శాతానికి పెరిగింది. ఇదే రోజు ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా వస్తాయి. ఈ ఏడాది జూలైలో 6.5 శాతంగా ఉన్న ఐఐపీ ఈ ఏడాది ఆగస్టులో 4.3 శాతానికి పడిపోయింది. ఈ నెల 14న (బుధవారం) గత నెలకు సంబంధించిన టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి.

ఈ ఏడాది ఆగస్టులో 4.53 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఈ సెప్టెం బర్‌లో 5.13 శాతానికి ఎగసింది. ఇక ఈ వారంలో 2,300 కంపెనీలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడిస్తాయి. కీలక కంపెనీలు–సన్‌ఫార్మా, అరబిందో ఫార్మా, టాటా స్టీల్, సీఈఎస్‌సీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోల్‌ ఇండి యా, నాల్కో, బ్రిటానియా ఇండస్ట్రీస్, అశోక్‌ లే లాండ్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్, మహానగర్‌ గ్యాస్, ఎన్‌ఎమ్‌డీసీల ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుంది.  

రిలీఫ్‌ ర్యాలీ...
స్టాక్‌ మార్కెట్లో గత రెండు నెలల్లో భారీ కరెక్షన్‌ చోటు చేసుకుందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. దీంతో సాంకేతిక కారణాల రీత్యా స్వల్ప కాలంలో రిలీఫ్‌ ర్యాలీ చోటుచేసుకునే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఇక ఈ వారంలో రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. ఇటీవల వెలువడిన క్యూ2 ఫలితాలు మార్కెట్‌కు కొంత జోష్‌నిచ్చాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు.

ఫలితాల సీజన్‌ చివరకు రావడంతో రాష్ట్రాల ఎన్నికల పరిణామాలు ప్రధానం కానున్నాయని వివరించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిగా ఛత్తీస్‌గఢ్‌లో నేటి నుంచి పోలింగ్‌ జరగనున్నది. ఇతర నాలుగు రాష్ట్రాలు–తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరమ్‌లో పోలింగ్‌ వచ్చే నెల 7న ముగుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 11న వెల్లడవుతాయి. ఇక అంతర్జాతీయంగా చూస్తే, ఈ నెల 14న జపాన్‌ క్యూ3 జీడీపీ గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ నెల 15న అమెరికా రిటైల్‌ గణాంకాలు వెల్లడవుతాయి.


విదేశీ పెట్టుబడులకు చమురు జోష్‌
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడులు ఈ నెలలో పెరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్లో నికరంగా రూ.4,800 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ మార్కెట్లో రూ.215 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.4,557 కోట్లు చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్‌ చేశారు.

ముడిచమురు ధరలు తగ్గడంతో రూపాయి మారకం విలువ పెరగడం, బాండ్ల రాబడులు కూడా తగ్గడంతో లిక్విడిటీ కష్టాలు తగ్గుముఖం పట్టడం  దీనికి ప్రధాన కారణాలని విశ్లేషకులంటున్నారు.  గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.38,900 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.95,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.  దీంట్లో ఈక్విటీల వాటా రూ.41,900 కోట్లుగా, డెట్‌ మార్కెట్‌ వాటా రూ.53,600 కోట్లుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement