‘డిజిటల్’తో లక్షల కోట్ల డాలర్ల ఆదా
• ఎన్నో సామాజిక ప్రయోజనాలు
• వెల్లడించిన డబ్ల్యూఈఎఫ్ నివేదిక
దావోస్: అన్ని రంగాలూ డిజిటల్‌కు మళ్లడం వల్ల లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని, వినియోగదారులు లబ్ధి పొందుతారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)కు చెందిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనీషియేటివ్ (డీఐటీ) తెలిపింది. డిజిటైజేషన్ ఎన్నో విలువైన ప్రయోజనాలు కల్పిస్తుందని, ఇందుకు విధానపరమైన చర్యలు అవసరమని డీఐటీ పేర్కొంది. ‘‘డిజిటైజేషన్ వల్ల సగానికంటే ఎక్కువ విలువ సామాజిక ప్రయోజనాల రూపంలో కలుగుతుంది. ఉద్యోగాల కల్పన, ఆదాయ అసమతుల్యత తగ్గుతుంది. మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. కార్బన్ ఉద్గారాలను, కాలహరణను, వినియోగదారుల వ్యయాలను తగ్గిస్తుంది’’ అని నివేదిక పేర్కొం ది. డిజిటల్ ప్రయోజనాలను ఒడిసి పట్టుకునేందుకు సమష్టి చర్యలు అవసరమని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని డీటీఐ హెడ్ బ్రూస్ వెనెల్ట్ సూచించారు.
‘‘అన్ని రంగాల్లో డిజిటలీకరణ వల్ల లక్షలాది మందిని కాపాడుకోవచ్చు. అలాగే లక్షలాది డాలర్ల వ్యయాలు కూడా ఆదా అవుతాయి’’ అని నివేదిక వెల్లడించింది. నైపుణ్యాలను పెంచుకోవడం, వేగంగా మారుతున్న మార్కెట్ల అవసరాలను తీర్చేవిధంగా విద్యాపరమైన మార్పుల అవసరాన్ని కూడా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధికి, అసమానత్వాన్ని తగ్గించేందుకు, అందరికీ ప్రయోజనాల కల్పనను ప్రోత్సహించే సామర్థ్యాలు కొత్త టెక్నాలజీలకు ఉన్నాయని తెలిపింది. అయితే, ప్రపంచీకరణ తిరోగమనం, రాజకీయ ప్రజాకర్షణ విధానాలు, సామాజిక అస్థిరత్వంతో వీటికి ముప్పేనని హెచ్చరించింది.