సొంతింటికి పశ్చిమ దిక్కు! | West Zone Real Boom | Sakshi
Sakshi News home page

సొంతింటికి పశ్చిమ దిక్కు!

Published Sat, Apr 29 2017 4:35 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

సొంతింటికి పశ్చిమ దిక్కు! - Sakshi

సొంతింటికి పశ్చిమ దిక్కు!

నివాస, వాణిజ్య సముదాయాలతో వెస్ట్‌ జోన్‌లో రియల్‌ జోరు
ఐటీ, ఆర్థిక సంస్థలతో పాటూ విద్యా, వైద్య, వినోద కేంద్రాలిక్కడే
అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, ఓఆర్‌ఆర్‌లు అదనపు ఆకర్షణలు
 నిర్మాణంలో 300–400 ప్రాజెక్ట్‌లు; ప్రతికూలంలోనూ అమ్మకాలు


భాగ్యనగరి అభివృద్ధిలో, ఆదాయంలోనూ భాగస్వామి..
ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, ఆర్ధిక సంస్థలకు నిలయం..
ప్రతికూల వాతావరణంలోనూ స్థిరాస్తి అమ్మకాలకు చిరునామా..
అంతర్జాతీయ విద్యా, వైద్య, వినోద సంస్థలతో నిత్యం కిటకిటలాడే ప్రాంతం..
 

.. ఈ ఉపోద్ఘాతమంతా పశ్చిమ హైదరాబాద్‌ అభివృద్ధి గురించి! స్థిరాస్తి రంగంలోనే కాదు నగరాభివృద్ధిలోనూ వెస్ట్‌ జోన్‌ కీలకమైంది. నిజం చెప్పాలంటే వెస్ట్‌ జోన్‌లో ప్రాజెక్ట్‌ చేయడం డెవలపర్లకు, సొంతిల్లు కొనడం కొనుగోలుదారులకూ స్టేటస్‌ సింబల్‌!

సాక్షి, హైదరాబాద్‌:కూకట్‌పల్లితో ప్రారంభమయ్యే పశ్చిమ జోన్‌ .. శేరిలింగంపల్లి, పటాన్‌చెరు వరకు విస్తరించి ఉంటుంది. ఇందులో గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, ఖాజాగూడ, గోపనపల్లి, నల్లగండ్ల, తెల్లాపూర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్‌ ప్రాంతాలు కీలకమైనవి. ఎందుకంటే ఐటీæ, ఐటీఈఎస్, ఫార్మా కంపెనీలు, అంతర్జాతీయ విద్య, వైద్య సంస్థలతో పాటూ లగ్జరీ షాపింగ్‌ మాళ్లకు నిలయం మరి! వీటికి తోడు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో రైలు ట్రయల్‌ రన్‌ పరుగులు అదనపు ఆకర్షణలు.


400 గజాల నుంచి నిర్మాణాలు..
వెస్ట్‌ జోన్‌లో కేవలం లగ్జరీ విల్లాలు, పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆకాశహర్మ్యాలు మాత్రమే కాదు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే చిన్న చిన్న అపార్ట్‌మెంట్లు కూడా ఉంటాయి. పశ్చిమ జోన్‌లో చ.అ. ధరలు రూ.3,500–8,000 వరకుంటాయి. కానీ, 90 శాతం మార్కెట్‌ రూ.4,500 లోపే ఉంటుందని వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం సుబ్బయ్య చెప్పారు. ప్రస్తుతం ఈ జోన్‌లో 300–400 ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉంటాయని.. ఇందులో 400 గజాల నుంచి 5 ఎకరాల వరకు ప్రాజెక్ట్‌లుంటాయని పేర్కొన్నారు. ఏ తరహా ప్రాజెక్ట్‌లైనా సరే 70–80 శాతం కొనుగోళ్ల వాటా ఐటీ ఉద్యోగులది. ఆ తర్వాత ఫార్మా, ప్రభుత్వ ఉద్యోగులుంటారు.

ప్రతికూలంలోనూ అమ్మకాలు..
జీహెచ్‌ఎంసీ ఆదాయంలో 50–60 శాతం ఆదాయం ఒక్క వెస్ట్‌ జోన్‌ నుంచే వస్తుంది. కార్యాలయాలకు, వినోద కేంద్రాలకు చేరువలో ఇళ్లు ఉండటంతో ప్రతికూల సమయంలోనూ పశ్చిమ జోన్‌లో అమ్మకాలు బాగుంటాయని వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎం ప్రేమ్‌ కుమార్‌ చెప్పారు. ఏటా స్థలాల ధరలు, నిర్మాణ వ్యయం పెరుగుతుండటంతో చ.అ. ధరలు కూడా రూ.100–300 వరకు పెంచక తప్పని పరిస్థితి. మంచి నీళ్లు, విద్యుత్‌ సరఫరా, మెరుగైన రహదారులు వంటి వాటికైతే పశ్చిమ జోన్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. స్థానిక రాజకీయాంశం, ఆర్థిక మాంద్యం, పెద్ద నోట్ల రద్దు వంటి పలు కారణాలతో గత కొంతకాలంగా మార్కెట్లో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఇళ్ల ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. అయితే ఏమాత్రం సానుకూల వాతావరణం కనిపించినా ఒక్కసారిగా ధరలు పెరిగే అవకాశముంది. అందుకే సొంతింటి సాకారానికి ఇదే సరైన సమయమని చెప్పారు.

వెస్ట్‌ జోన్‌ స్టేటస్‌ సింబల్‌..
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేసే పనిలో ప్రభుత్వం సన్నద్ధమైంది. స్థానికులే కాదు వివిధ ప్రాంతాల వారూ నగరంతో పాటూ తామూ అభివృద్ధి చెందుతామనే నిర్ణయానికొచ్చారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ పెరిగిందని వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ఎం రాఘవ రావు చెప్పారు.


కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాజెక్ట్‌ వ్యయంలోని 40 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం. ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములయ్యే నిర్మాణ రంగాన్ని రకరకాల ఇబ్బందులతో అష్టదిగ్బంధనం చేయకూడదని సూచించారు. స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహిస్తే మరింత నాణ్యమైన ఇళ్లను అందించడంతో పాటూ సొంతింటి కలను తీరుస్తున్నామని పేర్కొన్నారు.

మెట్రో, ఓఆర్‌ఆర్‌లు అదనపు ఆకర్షణ
వెస్ట్‌ జోన్‌కు మెట్రో రైలు, ఔటర్‌ రింగ్‌ రోడ్డులు అదనపు ఆకర్షణలు. మెట్రో కారిడార్‌ 1లో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మార్గం ఉంది. ఇందులో మియాపూర్‌ నుంచి భరత్‌ నగర్‌ వరకు వెస్ట్‌ జోన్‌ కిందికే వస్తుంది. ఇప్పటికే ఈ మార్గంలో నిర్మాణం పూర్తయి.. మెట్రో ట్రయల్‌ రన్‌ పరుగులు పెడుతోంది కూడా. కారిడార్‌ 3లో నాగోల్‌– రాయదుర్గం మార్గంలో.. మాదాపూర్‌ నుంచి రాయదుర్గం వరకు ఈ జోన్‌లోనే ఉంది. ఇక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

భాగ్యనగరాన్ని ఇతర జిల్లాలలో కలుపుతూ నిర్మించిన 158 కి.మీ. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో.. 22 కి.మీ. గచ్చిబౌలి– శంషాబాద్‌ రోడ్డు, 23.7 కి.మీ. నార్సింగి–పటాన్‌చెరు రోడ్డు పశ్చిమ హైదరాబాద్‌ మీదుగానే వెళుతుంది. దీంతో గచ్చిబౌలిలో ఓఆర్‌ఆర్‌ నుంచి నగరం చుట్టూ సులువుగా రాకపోకలు సాగించవచ్చు.

ఇవి అమలైతే..
ప్రస్తుతమున్న ఔటర్‌రింగ్‌ రోడ్డుతో పాటూ అదనంగా మరో రింగ్‌ రోడ్డును అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇది అమల్లోకి వస్తే.. పశ్చిమ హైదరాబాద్‌ విస్తీర్ణం మరికొంత పెరిగే అవకాశముంది.

ప్రస్తుతమున్న మెట్రో రైలును శిల్పారామం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకూ, మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కూడా అమల్లోకి వస్తే.. పశ్చిమ హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోతాయటంలో ఎలాంటి సందేహమక్కర్లేదు.

వివేకానంద నగర్‌లో ప్రేమ్‌ సరోవర్‌
సాక్షి, హైదరాబాద్‌: అందుబాటు ధరల్లో ఆధునిక వసతులతో అదీ పశ్చిమ హైదరాబాద్‌లో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేస్తోంది ప్రేమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌. 2 దశాబ్దాలుగా 30కి పైగా ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిందీ సంస్థ. ఇప్పుడిదే ఉత్సాహంతో కూకట్‌పల్లిలోని వివేకానంద కాలనీ పక్కన గొట్టిముక్కలాస్‌ ప్రేమ్‌ సరోవర్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని సంస్థ చైర్మన్‌ ఎం ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.
హా 4,500 గజాల్లో మొత్తం 65 ఫ్లాట్లుంటాయి. సెల్లార్‌+స్టిల్ట్‌+ 5 అంతస్తులు. 2 బీహెచ్‌కే 1,170 చ.అ., 3 బీహెచ్‌కే 1,512 నుంచి 1,755 చ.అ. విస్తీర్ణాల్లో ఉంటాయి. ధర చ.అ.కు రూ.3,500. జూన్‌ నాటికి చందానగర్‌లో 2 ఎకరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం.

హా తెలంగాణ ప్రభుత్వ 2 బీహెచ్‌కే పథకంలో మేమూ భాగస్వాములమయ్యాం. నల్లగండ్లలో గుల్‌మొహర్‌ పార్క్‌ పక్కన 216 రెండు పడక గదులను నిర్మిస్తున్నాం.

ఇప్పటికే వెస్ట్‌ జోన్‌లో సాయి కిషన్‌ నిలయం, సిరి విస్టా, సాయి బృందావనం, రామ రెసిడెన్సీ వంటి పలు ప్రాజెక్ట్‌లు 700 ఫ్లాట్లను నిర్మించాం.

కృష్ణారెడ్డిపేటలో వీఆర్సీ విల్లాస్‌
సాక్షి, హైదరాబాద్‌: నిర్మాణంలో నాణ్యత, ఆధునిక వసతులే లక్ష్యంగా గృహాలను నిర్మిస్తోంది వీఆర్సీ ఇన్‌ఫ్రా. ఇప్పుడిదే లక్ష్యంతో వీఆర్సీ విల్లాస్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించామని సంస్థ సీఎండీ మిర్యాల రాఘవరావు చెప్పారు.

పటాన్‌చెరులోని కృష్ణారెడ్డిపేటలో 5 ఎకరాల్లో వీఆర్సీ విల్లాస్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 75 లగ్జరీ విల్లాలుంటాయి. ఒక్కోటి 150, 167 గజాల్లో ఉంటుంది. ధర చ.అ.కు రూ.3,000.

 లే అవుట్‌ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 2 వారాల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీప దూరంలో, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఉందీ వీఆర్సీ విల్లాస్‌.

 15 రోజుల్లో నల్లగండ్లలో వీఆర్సీ హౌజింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. మొత్తం 1,500 గజాల్లో 40 ఫ్లాట్లొస్తాయి. 1,200–1,500 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ధర చ.అ.కు రూ.3,500.

 బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగుల కోసం కృష్ణారెడ్డిపేటలో మెట్రో ఎన్‌క్లేవ్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 50 ఎకరాల్లో 650 ఇండిపెండెంట్‌ గృహాలుంటా యి. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 6 నెలల్లో కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం.

వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఏమంటోందంటే
స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి బిల్లు (రెరా)లో నిర్మాణదారున్ని మాత్రమే బాధ్యుణ్ని చేయడం దారుణం. ఎందుకంటే ఇళ్లు నిర్మించాలంటే ఒక్క డెవలపర్‌ ఉంటే సరిపోదు. నిర్మాణ అనుమతులిచ్చే అధికారులు, స్ట్రక్చర్, డిజైన్ల చేసే ఆర్కిటెక్చర్లు, నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు ఇలా ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అయితేనే ఇల్లు పూర్తవుతుంది. అలాంటప్పుడు నిర్మాణ లోపాలుంటే కేవలం డెవలపర్‌ను మాత్రమే బాధ్యుల్ని ఎలా చేస్తారు? ఈ విషయంపై తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ తరఫున ప్రభుత్వాన్ని సంప్రదించనున్నాం.

599 గజాల్లోపు స్టిల్ట్‌4 అంతస్తుల నిర్మాణాలకు ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయంలో అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే 1,000 గజాల వరకూ నిర్మాణ అనుమతులను జోనల్‌ కార్యాలయంలోనే ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే చిన్న బిల్డర్లు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది. నిర్మాణ పనులను ఆపేసి తీరా వెళ్లే సరికి సమయానికి అధికారులు లేకపోవటంతో సమయం వృథా అవుతోంది.

జీహెచ్‌ఎంసీ మ్యుటేషన్‌ ఫీజు రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లిస్తున్నాం. కొనుగోలుదారులకు మ్యుటేషన్‌ ఇబ్బంది లేకుండా చేయాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీలో డెవలపర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు.

నిర్మాణంలో 10 శాతం డీవియేషన్‌ చేస్తే డెవలపర్ల నుంచి పెనాల్టీని వసూలు చేసి జీహెచ్‌ఎంసీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ)ని జారీ చేస్తుంది. అయితే డీవియేషన్‌ చేశారన్న కారణంతో కొనుగోలుదారుల నుంచి కూడా మున్సిపల్‌ హౌజింగ్‌ ట్యాక్స్‌ కింద 25 శాతాన్ని వసూలు చేస్తున్నారు. ఈ ద్వంద్వ పన్ను వసూళ్లను వెంటనే ఆపేయాలి.

సమస్యలను పరిష్కరించడంలో స్థానిక నిర్మాణ సంఘాలను భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే సమస్యను లోతుగా అధ్యయనం చేసి.. శాశ్వత పరిష్కారానికి వీలుంటుంది. నిర్మాణ రంగానికి సంబంధించిన జీవోలు, నిబంధనల సవరణలో సంఘాల సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement