
స్నాప్‌చాట్ జోరు
లిస్టింగ్‌లో 44 శాతం లాభాలు
న్యూయార్క్: స్నాప్‌చాట్ మెనేజింగ్ యాప్ మాతృ కంపెనీ, స్నాప్ ఇన్‌కార్పొ అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో లిస్టయింది. ట్రేడింగ్ తొలిరోజు 44 శాతం లాభపడింది. స్నాప్ ఇన్‌కార్పొ విలువ 2,830 కోట్ల డాలర్లు (సుమారుగా రూ.1,90,000 కోట్లు)గా నమోదైంది.
న్యూయార్క్ స్టాక్ ఎక్సే్చంజ్‌లో కంపెనీ వ్యవస్థాపకులు ఇవాన్ సీగెల్, బాబీ మర్ఫీలు ఓపెనింగ్ బెల్‌ను మోగించగానే ఈ షేర్ కూడా లాభాల మోత మోగించింది. గైడ్ ధర ఒక్కో షేర్‌కు 17 డాలర్లుగా ఉండగా, 40 శాతం ప్రీమియమ్‌తో 24 డాలర్ల ధరతో ప్రారంభమైంది. 24.48 డాలర్ల ధర వద్ద ముగిసింది. ఒక దశలో ఈ ధర 26.05 డాలర్లకు ఎగసింది.
రోజూ 250 కోట్ల స్నాప్‌లు
2012లో ప్రారంభమైన ఈ కంపెనీ గత ఏడాది 51 కోట్ల డాలర్ల నష్టాలను ప్రకటించింది. ప్రతి రోజూ 15.8 కోట్ల మంది ప్రజలు ఈ సర్వీస్‌ను వినియోగిస్తున్నారని, 250 కోట్ల స్నాప్‌లు వారి మధ్య క్రియేట్ అవుతున్నాయని స్నాప్‌చాట్ తెలిపింది. ఫేస్‌బుక్ సోషల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న వంద కోట్ల మంది యూజర్లతో పోల్చితే స్నాప్‌చాట్ యూజర్ల సంఖ్య తక్కువైనా, స్నాప్‌చాట్ యూజర్లలో అధికులు యువజనులేనని, సగటున రోజుకు అరగంట ఈ సర్వీస్ కోసం వెచ్చిస్తున్నారని అంచనా. స్నాప్ చాట్‌ను మొబైల్ ఫోన్ల కోసం డిజైన్ చేశారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయడానికి ఉపయోగిస్తారు.