
చెక్కు బౌన్స్‌లలో.. ప్రెజెంట్ చేసినచోటే కేసు
రెండోసారి ఎన్‌ఐ చట్ట సవరణ ఆర్డినెన్స్...
ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
న్యూఢిల్లీ : చెక్కు బౌన్స్ కేసుల్లో లక్షలాది మందికి ప్రయోజనం కలిగించే చర్యలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెక్కు బౌన్స్‌లకు సంబంధించి.. చెల్లింపు జరగాల్సిన బ్యాంక్ బ్రాంచ్(చెక్కు ప్రెజెంట్ చేసిన చోటు) పరిధిలోని కోర్టుల్లో మాత్రమే కేసులను దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనికి వీలుకల్పించే విధంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్(ఎన్‌ఐ-సవరణ) ఆర్డినెన్స్-2015ను రెండోసారి తీసుకొచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర పడినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. చెక్కు బౌన్స్ కేసుల్లో చట్టపరమైన పరిధికి సంబంధించిన అంశాల్లో స్పష్టత తీసుకురావడం ద్వారా ఫైనాన్షియల్ సాధనంగా చెక్కుల విశ్వసనీయతను పెంచేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆ ప్రకటన తెలిపింది.
సుప్రీం తీర్పు నేపథ్యంలో...
చెక్కు బౌన్స్‌ల విషయంలో జారీ చేసిన బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడుంటే అక్కడే కేసులను దాఖలు చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు 2014లో తీర్పునిచ్చింది. దీనివల్ల చెక్కులు తీసుకున్న వాళ్లకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం చట్టంలో సవరణ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్‌ఐ(సవరణ) చట్టం-2015 బిల్లును ఈ ఏడాది మే నెలలో లోక్‌సభలో ఆమోదింపజేసింది కూడా. అయితే, ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించకపోవడంతో తాజా ఎన్‌ఐ(సవరణ)ఆర్డినెన్స్‌ను రూపొందించారు. దీనికి ఇప్పుడు కేబినెట్ ఓకే చెప్పడంతో అధికారికంగా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సరైన ఫండ్స్ లేకుండా చెక్కులు జారీ చేయడం ఇతరత్రా కారణాల వల్ల బౌన్స్ అయ్యే కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎన్‌ఐ చట్టంలోని సెక్షన్ 138 వీలు కల్పిస్తోంది.
విదేశీ ప్రాజెక్టులకు ఎగ్జిమ్ బ్యాంక్ రాయితీ రుణాలు
దేశీ కంపెనీలు విదేశాల్లో తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడానికి వీలుగా ఇకపై ఎగ్జిమ్ బ్యాంక్ రాయితీపై రుణాలను అందించనుంది. ప్రతిపాదిత స్కీమ్‌కు మోదీ నేతృత్వంలోని కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. విదేశాల్లో వ్యూహాత్మకంగా కీలకమైన ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు బిడ్డింగ్‌లో పోటీపడేందుకు భారతీయ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నదే ఈ చర్యల ముఖ్యోద్దేశమని టెలికం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
అయితే, ఎటువంటి ప్రాజెక్టులకు ఈ రాయితీ రుణాలందించాలన్నది పరిశీలించేందుకు ఆర్థిక వ్యవహారాల విభాగం(డీఈఏ) కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ(ఐఐఎఫ్‌సీఎల్)కు 2007-08, 2012-13 సంవత్సరాల్లో ప్రభుత్వం కేటాయించిన రూ.2,600 కోట్ల మూలధన నిధులకు(ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో) కేబినెట్ ఆమోదం తెలిపింది. లాభదాయకమైన మౌలిక రంగ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలందించే లక్ష్యంతో 2006లో కేంద్రం ఈ కంపెనీని నెలకొల్పింది.