న్యూఢిల్లీ : సోమవారం విడుదల చేసిన మార్చి నెల టోకుధరల ద్రవ్యోల్బణం సూచీ శుభసంకేతాలు అందించింది. వరుసగా 17 నెలలుగా నేలచూపులు చూస్తున్న ద్రవ్యోల్బణం ఈ నెలలో కూడా పతనమైంది. క్రమేపీ దిగి వస్తూ మార్చి నెలలో 0.85 శాతంగా నమోదైంది. దీంతో గత కొంతకాలంగా భగ్గుమంటున్న టోకు ధరలు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు ఈనెలలో విడుదల అవుతున్న ఫలితాలన్నీ మార్కెట్ కు సానుకూల సంకేతాలను అందిండంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఓ వైపు టోకుధరల ద్రవ్యోల్బణం క్షీణత, మరోవైపు ఇన్ఫోసిస్ షేర్ల లాభాలు, మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో 162 పాయింట్లకు పైగా లాభపడి జోరుగా ట్రేడ్ అవుతోంది.
ఫిబ్రవరి నెలలో ఈ టోకుధరల ద్రవ్యోల్బణం 0.91శాతంగా ఉంది. ఆయిల్ ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో టోకుధరలు తగ్గినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిందటేడాది మార్చి కంటే క్రూడ్ ధరలు 8.30శాతం పడిపోయాయి. తయారీ ఉత్పత్తులు 0.13 శాతం కిందకు జారాయి. ఈ టోకుధరల ద్రవ్యోల్బణం లెక్కించడంలో వాణిజ్య ఆహారోత్పత్తులతో పాటు క్రూడ్, విద్యుత్, తయారీ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫిబ్రవరిలో 3.35 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరలు మార్చిలో 3.7శాతం కు పెరిగాయి. వాణిజ్య ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉండటంతో, అధిక వేగంతో ధరల తగ్గుదలను (డిఫ్లేషన్) నిరోధిస్తుందని ఐసీఆర్ఏ ఎకనామిస్ట్ అదితీ నాయర్ చెప్పారు. దీనివల్ల రూపాయి విలువ కూడా పెరుగుతుందన్నారు. వినియోగదారుల సూచీలో రిటైల్ ఆహారోత్పత్తులకు ముఖ్య పాత్ర ఉండగా, టోకు ధరల సూచీలో వాణిజ్య ఉత్పత్తులను, కమోడిటీలను ప్రధాన ఉత్ప్తత్తులుగా తీసుకుంటారు.