చైనాతో సరిహద్దు వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజాలను ప్రయివేటైజ్ చేయడంపై చర్చ ఊపందుకుంది. గత వారం వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. విద్యుత్ రంగ పీఎస్‌యూ బీహెచ్‌ఈఎల్‌ను ప్రయివేటైజ్ చేస్తే దేశానికి పలు ప్రయోజనాలు సమకూరుతాయని ట్వీట్ చేశారు. దీంతో మార్కెట్లో పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్‌పై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గత దశాబ్ద కాలంలో పలు ప్రధాన పీఎస్‌యూ కంపెనీల షేర్లు డీలా పడుతూ వస్తున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన 17 ప్రభుత్వ రంగకంపెనీల మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) సగటున 41 శాతం పతనమైంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 91 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..
చైనాకు చెక్
విద్యుత్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన బీహెచ్‌ఈఎల్‌కు మరింత స్వేచ్చనివ్వడం(అటానమీ) లేదా ప్రయివేటైజ్ చేస్తే.. చైనా కంపెనీలకు చెక్ పెట్టవచ్చని బిలియనీర్ పారిశ్రామివేత్త అనిల్ అగర్వాల్ గత వారం ట్వీట్ చేశారు. దేశీయంగా డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ప్రాజెక్టులను అందించడంలో కంపెనీకి అత్యంత సామర్థ్యముందని పేర్కొన్నారు. తద్వారా ఆత్మనిర్బర్‌కు దన్నుగా నిలవగలదని అభిప్రాయపడ్డారు. ఇందుకు మద్దతుగా అన్నట్లు.. బీహెచ్‌ఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) వంటి కంపెనీలను ప్రయివేటైజ్ చేయడం ద్వారా క్యాపిటల్ గూడ్స్ విభాగంలో చైనా సంస్థలతో పోటీపడవచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత దశాబ్ద కాలంలో అత్యధిక శాతం పీఎస్‌యూ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో పతన బాటలో సాగుతూ వస్తున్నాయి. దీంతో చౌకగా కంపెనీలలో వాటాలు విక్రయించవలసి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వం విధించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్య సాధనకు అంతగా సహకరించకపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.
రూ. 2.1 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 2.1 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఈ బాటలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మిగిలిన ప్రభుత్వ వాటాను విక్రయించాలని చూస్తోంది. ఇక విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాను ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది కూడా! అయితే లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ కంపెనీల షేర్లు డీలాపడటంతో తగిన విలువ లభించే అంశంపై సందేహాలు నెలకొన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
నష్టాల బాట
గత దశాబ్ద కాలంలో అంటే 2010 ఏప్రిల్ నుంచి చూస్తే.. పీఎస్‌యూలలో ప్రధానంగా బీహెచ్‌ఈఎల్ మార్కెట్ విలువ 90 శాతం హరించుకుపోయింది. 2010 ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.2 లక్షల కోట్ల నుంచి తాజాగా రూ. 11,000 కోట్లకు చేరింది. ఇదే విధంగా స్టీల్ కంపెనీ సెయిల్ విలువ 87 శాతం పడిపోగా.. అల్యూమినియం సంస్థ నాల్కో 79 శాతం, ఎన్‌ఎండీసీ 78 శాతం, కోల్ ఇండియా 60 శాతం, ఓఎన్‌జీసీ 53 శాతం, ఎన్‌టీపీసీ 47 శాతం, గ్యాస్ కంపెనీ గెయిల్ ఇండియా 20 శాతం చొప్పున మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి.
లాభాల్లోనూ..
గత 10 ఏళ్లలో చూస్తే.. 17 పీఎస్‌యూలలో 5 మాత్రమే లాభాల బాటలో సాగుతున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) మార్కెట్ విలువ రూ. 19,000 కోట్ల నుంచి నాలుగు రెట్లు ఎగసి రూ. 80,000 కోట్లకు చేరింది. ఈ బాటలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) మార్కెట్ విలువ 205 శాతం పుంజుకోగా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ 81 శాతం, కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) 40 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) విలువ 11 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా.. ఇంతక్రితం అంటే 2002లో హిందుస్టాన్ జింక్‌ను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేదాంతా గ్రూప్‌లో హిందుస్తాన్ జింక్ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రూప్ కన్సాలిడేటెడ్ ఆదాయంలో 23 శాతం వాటాను ఆక్రమిస్తోంది. నికర లాభాల్లో మరింత అధికంగా 55 శాతం నిర్వహణ లాభాల(పీబీటీ)ను సమకూరుస్తోంది. ఇటీవల వేదాంతా గ్రూప్ బీపీసీఎల్ కొనుగోలుకి ఆసక్తిని ప్రదర్శించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment