ఖజానా గల గల
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 16,027 కోట్లను ప్రభుత్వం అధిగమించింది. ప్రభుత్వ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ ద్వారా సమీకరించిన రూ. 3,000 కోట్లతో ప్రభుత్వ నిధుల సమీకరణ తాజాగా రూ. 16,119 కోట్లకు చేరింది. దీనికితోడు యాక్సిస్ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా మరో రూ. 5,550 కోట్లను సైతం ప్రభుత్వం శుక్రవారం సమీకరించింది.
వెరసి ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2014 మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అధిగమించడమేకాకుండా, ద్రవ్యలోటు కట్టడిని సాధించేందుకు వీలు చిక్కింది. మధ్యంతర బడ్జెట్‌లో చిదంబరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు తగ్గించడంతోపాటు, ద్రవ్యలోటును 4.8%(తొలి అంచనా) నుంచి 4.6%కు కట్టడి చేయాలని ప్రతిపాదించిన విషయం విదితమే.
స్పందన ఓకే
మ్యూచువల్ ఫండ్ మార్గంలో ప్రభుత్వం తలపెట్టిన నిధుల సమీకరణ ప్రయత్నం విజయవంతమయ్యింది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా పది ప్రభుత్వ దిగ్గజాల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్‌ఈ ఈటీఎఫ్) ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి గరిష్ట స్థాయిలో స్పందన లభించింది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేయగా... రూ. 4,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చివరిరోజు(21న) మొత్తం రూ. 1,600 కోట్ల విలువైన బిడ్స్ లభించగా, వీటిలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) వాటా రూ. 1,000 కోట్లవరకూ ఉండటం గమనార్హం. ఫలితంగా సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌కు దరఖాస్తు చేసిన ప్రతీ రిటైల్ ఇన్వెస్టర్‌కూ కొంత పరిమాణంలో యూనిట్లు లభించే అవకాశముంది.
కాగా, అధికంగా లభించిన రూ. 1,000 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది. ఆఫర్‌లో భాగంగా తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్లయిన ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ తదితర బీమా కంపెనీలు రూ. 835 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్న ఈ ఫండ్‌ను గోల్డ్‌మన్ శాక్స్ నిర్వహించనుంది. ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఇంజనీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్‌లో వాటాలతో రూపొందించిన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్‌లో భాగంగా ఇన్వెస్టర్లకు రూ. 10 ముఖ విలువగల యూనిట్లను కేటాయిస్తారు.
ఆదుకున్న ఎల్‌ఐసీ
ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో ప్రభుత్వం 9% వాటాను విక్రయించడం ద్వారా రూ. 5,550 కోట్లను సమీకరించింది. యాక్సిస్‌లో ఎస్‌యూయూటీఐ ద్వారా ప్రభుత్వం 20.72% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన బల్క్ డీల్ సమాచారం ప్రకారం 4.2 కోట్ల యాక్సిస్ బ్యాంక్ షేర్లను రూ. 1,315.13 సగటు ధరలో ప్రభుత్వం విక్రయించింది. ఇది బీఎస్‌ఈలో గురువారం యాక్సిస్ ముగింపు ధర రూ. 1,357తో పోలిస్తే 3.1% డిస్కౌంట్. కాగా, ఎల్‌ఐసీ 85 లక్షల షేర్లను కొనుగోలు చేయడం విశేషం. ఇందుకు రూ. 1,116 కోట్లను వెచ్చించింది. యాక్సిస్ షేర్లను కొన్న ఇతర సంస్థలలో సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్‌మన్ శాక్స్ సింగపూర్ ఉన్నాయి. వాటా విక్రయం కారణంగా యాక్సిస్‌లో ఎస్‌యూయూటీఐ వాటా 11.72%కు పరిమితమైంది.
షేరు ఊగిసలాట...
ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్‌ఈలో యాక్సిస్ షేరు హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం సెషన్‌లో 3%పైగా పతనమై రూ. 1,313ను చేరగా, ఆపై కోలుకుని గరిష్టంగా రూ. 1,411ను సైతం తాకింది. చివరకు 2.7% లాభంతో రూ. 1,393 వద్ద ముగిసింది.