న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్‌ఈ ఈటీఎఫ్)లో సంస్థాగత(యాంకర్) ఇన్వెస్టర్లు రూ. 850 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశారు. ప్రభుత్వ రంగానికి చెందిన పది బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈటీఎఫ్‌ను మంగళవారం ప్రవేశపెట్టగా, తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మాత్రమే అవకాశాన్ని కల్పించారు. ఈటీఎఫ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు, యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల యూనిట్లను రిజర్వ్ చేసింది. కాగా, బుధవారం నుంచీ ఈటీఎఫ్ యూనిట్ల కొనుగోలుకి రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
యాంకర్ ఇన్వెస్టర్ల విభాగంలో కనీసం రూ. 10 కోట్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉండగా, ఆరు సంస్థలు బిడ్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. ఓఎన్‌జీసీ, ఐవోసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ తదితర 10 సంస్థల వాటాలతో ఈ ఫండ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. అన్ని రకాల ఇన్వెస్టర్లకూ ప్రభుత్వం 5% తొలి(అప్‌ఫ్రంట్) డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా అర్హతగల రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రతీ 15 యూనిట్లకు ఒక లాయల్టీ యూనిట్(6.66% డిస్కౌంట్) లభించనుంది.
కోల్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్?
వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో కోల్ ఇండియాలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ అధికారి ఒకరు చెప్పారు. నిజానికి ఈ ఏడాది మార్చిలోగా కోల్ ఇండియాలో 10% వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావించినప్పటికీ, ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో ప్రతిపాదనను వాయిదా వేసింది. అంతేకాకుండా 5% వాటాను మాత్రమే డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కంపెనీలో 90% వాటా కలిగిన ప్రభుత్వం డివిడెండ్ రూపంలో రూ. 19,000 కోట్లను అందుకోవడం గమనార్హం.
ప్రభుత్వ ఈటీఎఫ్‌లో యాంకర్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
Published Wed, Mar 19 2014 1:12 AM | Last Updated on Sat, Jun 2 2018 7:34 PM
Advertisement
Advertisement