PSU stake sale
-
పీఎస్‌యూ వాటాల విక్రయంలో ముందుకే
న్యూఢిల్లీ, కోల్‌కతా: కేబినెట్ ఆమోదించిన ప్రభుత్వరంగ సంస్థల్లో (సెంట్రల్ పీఎస్‌యూ) వాటాల విక్రయాన్ని మరింత ముందుకు తీసుకెళతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వర్ధమాన దేశాల్లో భారత్‌కే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌డీఐ) అధికంగా ఉందని గుర్తు చేస్తూ.. బలమైన స్థూల ఆర్థిక మూలాలు, సంస్కరణలు చేపట్టగల సామర్థ్యాలు, స్థిరమైన ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అంశాలుగా పేర్కొన్నారు. ‘‘కరోనా మహమ్మారి సమయంలోనూ పెద్ద కంపెనీల్లో కొన్నింటిలో వాటాలను విక్రయించాలన్నది మా ప్రయత్నం. ఆసక్తి వ్యక్తీకరణలు అందాయి. తదుపరి దశ ఆరంభమవుతోంది. కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలియజేసిన ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి వాటాల విక్రయాలను దీపమ్ ( పెట్టుబడుల ఉపసంహరణ విభాగం) మరింత చురుగ్గా నిర్వహించగలదని భావిస్తున్నాము’’ అని మంత్రి చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్‌కామర్స్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం రూపంలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కానీ ఇప్పటి వరకు సమకూరింది కేవలం రూ.11,006 కోట్లే కావడం గమనార్హం. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ సహా 25 ప్రభుత్వరంగ సంస్థల్లో పాక్షికంగా, పూర్తిగా వాటాల విక్రయానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం కూడా తెలియజేసింది. ‘‘మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాలు కొనసాగుతాయి. పలు సావరీన్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్‌కు ఇచ్చిన పన్ను రాయితీల వల్ల అవి మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రగతిశీల సంస్కరణల వైపు ప్రభుత్వం చూస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదు. స్పష్టమైన పెట్టుబడుల ఉపసంహరణ అంజెండాను ప్రకటించాము’’ అని మంత్రి వివరించారు. ఏ చర్య తీసుకున్నా సరిపోదు ఆర్థిక రంగ పురోగతికి మద్దతుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏ చర్య అయినా సరిపోదన్నారు. కాకపోతే ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువ చర్యలు తీసుకోవడం వల్లే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థానంలో ఉందని గుర్తు చేశారు. -
పీఎస్‌యూల ప్రయివేటైజేషన్- ప్రయోజనం?
చైనాతో సరిహద్దు వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వ రంగ దిగ్గజాలను ప్రయివేటైజ్ చేయడంపై చర్చ ఊపందుకుంది. గత వారం వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. విద్యుత్ రంగ పీఎస్‌యూ బీహెచ్ఈఎల్ను ప్రయివేటైజ్ చేస్తే దేశానికి పలు ప్రయోజనాలు సమకూరుతాయని ట్వీట్ చేశారు. దీంతో మార్కెట్లో పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్‌పై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గత దశాబ్ద కాలంలో పలు ప్రధాన పీఎస్‌యూ కంపెనీల షేర్లు డీలా పడుతూ వస్తున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన 17 ప్రభుత్వ రంగకంపెనీల మార్కెట్ విలువ(కేపిటలైజేషన్) సగటున 41 శాతం పతనమైంది. ఇదే సమయంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 91 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం.. చైనాకు చెక్ విద్యుత్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన బీహెచ్ఈఎల్కు మరింత స్వేచ్చనివ్వడం(అటానమీ) లేదా ప్రయివేటైజ్ చేస్తే.. చైనా కంపెనీలకు చెక్ పెట్టవచ్చని బిలియనీర్ పారిశ్రామివేత్త అనిల్ అగర్వాల్ గత వారం ట్వీట్ చేశారు. దేశీయంగా డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ప్రాజెక్టులను అందించడంలో కంపెనీకి అత్యంత సామర్థ్యముందని పేర్కొన్నారు. తద్వారా ఆత్మనిర్బర్‌కు దన్నుగా నిలవగలదని అభిప్రాయపడ్డారు. ఇందుకు మద్దతుగా అన్నట్లు.. బీహెచ్ఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) వంటి కంపెనీలను ప్రయివేటైజ్ చేయడం ద్వారా క్యాపిటల్ గూడ్స్ విభాగంలో చైనా సంస్థలతో పోటీపడవచ్చని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత దశాబ్ద కాలంలో అత్యధిక శాతం పీఎస్‌యూ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో పతన బాటలో సాగుతూ వస్తున్నాయి. దీంతో చౌకగా కంపెనీలలో వాటాలు విక్రయించవలసి ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రభుత్వం విధించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్య సాధనకు అంతగా సహకరించకపోవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. రూ. 2.1 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 2.1 లక్షల కోట్లను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయం ద్వారా రూ. 90,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. ఈ బాటలో పబ్లిక్ ఇష్యూ చేపట్టడం ద్వారా బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీని స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేసే సన్నాహాలు ప్రారంభించింది. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మిగిలిన ప్రభుత్వ వాటాను విక్రయించాలని చూస్తోంది. ఇక విమానయాన దిగ్గజం ఎయిర్ ఇండియాను ప్రయివేటైజ్ చేసేందుకు వీలుగా బిడ్స్‌ను ఆహ్వానిస్తోంది కూడా! అయితే లిస్టెడ్ ఎయిర్‌లైన్స్ కంపెనీల షేర్లు డీలాపడటంతో తగిన విలువ లభించే అంశంపై సందేహాలు నెలకొన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. నష్టాల బాట గత దశాబ్ద కాలంలో అంటే 2010 ఏప్రిల్ నుంచి చూస్తే.. పీఎస్‌యూలలో ప్రధానంగా బీహెచ్ఈఎల్ మార్కెట్ విలువ 90 శాతం హరించుకుపోయింది. 2010 ఏప్రిల్‌లో నమోదైన రూ. 1.2 లక్షల కోట్ల నుంచి తాజాగా రూ. 11,000 కోట్లకు చేరింది. ఇదే విధంగా స్టీల్ కంపెనీ సెయిల్ విలువ 87 శాతం పడిపోగా.. అల్యూమినియం సంస్థ నాల్కో 79 శాతం, ఎన్ఎండీసీ 78 శాతం, కోల్ ఇండియా 60 శాతం, ఓఎన్జీసీ 53 శాతం, ఎన్టీపీసీ 47 శాతం, గ్యాస్ కంపెనీ గెయిల్ ఇండియా 20 శాతం చొప్పున మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. లాభాల్లోనూ.. గత 10 ఏళ్లలో చూస్తే.. 17 పీఎస్‌యూలలో 5 మాత్రమే లాభాల బాటలో సాగుతున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) మార్కెట్ విలువ రూ. 19,000 కోట్ల నుంచి నాలుగు రెట్లు ఎగసి రూ. 80,000 కోట్లకు చేరింది. ఈ బాటలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) మార్కెట్ విలువ 205 శాతం పుంజుకోగా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ 81 శాతం, కంటెయినర్ కార్పొరేషన్(కంకార్) 40 శాతం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) విలువ 11 శాతం చొప్పున బలపడ్డాయి. కాగా.. ఇంతక్రితం అంటే 2002లో హిందుస్టాన్ జింక్‌ను అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంతా గ్రూప్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేదాంతా గ్రూప్‌లో హిందుస్తాన్ జింక్ కీలక పాత్ర పోషిస్తోంది. గ్రూప్ కన్సాలిడేటెడ్ ఆదాయంలో 23 శాతం వాటాను ఆక్రమిస్తోంది. నికర లాభాల్లో మరింత అధికంగా 55 శాతం నిర్వహణ లాభాల(పీబీటీ)ను సమకూరుస్తోంది. ఇటీవల వేదాంతా గ్రూప్ బీపీసీఎల్ కొనుగోలుకి ఆసక్తిని ప్రదర్శించిన విషయం విదితమే. -
బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్ దూకుడు!
న్యూఢిల్లీ: బడ్జెట్ తర్వాత పీఎస్‌యూల్లో వాటా విక్రయాలకు సంబంధించి కసరత్తు మొత్తం పూర్తిచేయాలంటూ డిజిన్వెస్ట్‌మెంట్ విభాగాన్ని(డీఓడీ) ఆర్థిక శాఖ ఆదేశించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో బుల్ జోరు నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్కారు యోచిస్తోంది. 2014-15 మధ్యంతర బడ్జెట్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ.36,925 కోట్లుగా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో మోడీ సర్కారు ప్రవేశ పెట్టనున్న తొలి బడ్జెట్లో కూడా ఈ లక్ష్యాన్ని యథావిధిగా కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల జోరుతో చాలా పీఎస్‌యూల షేర్ల విలువలు భారీగానే ఎగబాకాయి. దీంతో వాటా విక్రయాలతో ప్రభుత్వానికి కూడా తగిన రాబడి వచ్చేందుకు వీలుంది. బడ్జెట్ తర్వాత డిజిన్వెస్ట్మెంట్కు సమాయత్తమవుతున్నాం’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి . కోల్ ఇండియా(10 శాతం వాటా విక్రయం), సెయిల్(10%), ఎన్‌హెచ్‌పీసీ(11.6%), ఆర్ఈసీ(5%), పీఎఫ్సీ(%) వంటివి ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఉన్నాయి. కాగా, చాన్నాళ్లుగా పెండింగ్‌లోఉన్న హిందుస్థాన్ జింక్, బాల్కోలలో అవశేష(స్వల్పంగా మిగిలిన) వాటాను కూడా విక్రయించేందుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిద్వారా రూ.15,000 కోట్లు ఖజానాకు జమకావచ్చని అం చనా. తాజాగా ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ప్రణాళికలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్‌యూల వాటా విక్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని డీఓడీని జైట్లీ ఆదేశించినట్లు సమాచారం. -
ఖజానా గల గల
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి(2014-15) సవరించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 16,027 కోట్లను ప్రభుత్వం అధిగమించింది. ప్రభుత్వ సంస్థల వాటాలతో ఏర్పాటు చేసిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ ద్వారా సమీకరించిన రూ. 3,000 కోట్లతో ప్రభుత్వ నిధుల సమీకరణ తాజాగా రూ. 16,119 కోట్లకు చేరింది. దీనికితోడు యాక్సిస్ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా మరో రూ. 5,550 కోట్లను సైతం ప్రభుత్వం శుక్రవారం సమీకరించింది. వెరసి ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2014 మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని అధిగమించడమేకాకుండా, ద్రవ్యలోటు కట్టడిని సాధించేందుకు వీలు చిక్కింది. మధ్యంతర బడ్జెట్లో చిదంబరం డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు తగ్గించడంతోపాటు, ద్రవ్యలోటును 4.8%(తొలి అంచనా) నుంచి 4.6%కు కట్టడి చేయాలని ప్రతిపాదించిన విషయం విదితమే. స్పందన ఓకే మ్యూచువల్ ఫండ్ మార్గంలో ప్రభుత్వం తలపెట్టిన నిధుల సమీకరణ ప్రయత్నం విజయవంతమయ్యింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా పది ప్రభుత్వ దిగ్గజాల వాటాలతో ఏర్పాటు చేసిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(సీపీఎస్ఈ ఈటీఎఫ్) ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి గరిష్ట స్థాయిలో స్పందన లభించింది. రూ. 3,000 కోట్ల సమీకరణకు ప్రభుత్వం ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేయగా... రూ. 4,000 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చివరిరోజు(21న) మొత్తం రూ. 1,600 కోట్ల విలువైన బిడ్స్ లభించగా, వీటిలో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) వాటా రూ. 1,000 కోట్లవరకూ ఉండటం గమనార్హం. ఫలితంగా సీపీఎస్ఈ ఈటీఎఫ్‌కు దరఖాస్తు చేసిన ప్రతీ రిటైల్ ఇన్వెస్టర్‌కూ కొంత పరిమాణంలో యూనిట్లు లభించే అవకాశముంది. కాగా, అధికంగా లభించిన రూ. 1,000 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇవ్వనుంది. ఆఫర్లో భాగంగా తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్లయిన ఎస్బీఐ, ఎల్ఐసీ తదితర బీమా కంపెనీలు రూ. 835 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానున్న ఈ ఫండ్‌ను గోల్డ్‌మన్ శాక్స్ నిర్వహించనుంది. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఇంజనీర్స్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్‌లో వాటాలతో రూపొందించిన ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్‌లో భాగంగా ఇన్వెస్టర్లకు రూ. 10 ముఖ విలువగల యూనిట్లను కేటాయిస్తారు. ఆదుకున్న ఎల్ఐసీ ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో ప్రభుత్వం 9% వాటాను విక్రయించడం ద్వారా రూ. 5,550 కోట్లను సమీకరించింది. యాక్సిస్‌లో ఎస్‌యూయూటీఐ ద్వారా ప్రభుత్వం 20.72% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్ఛేంజీలలో నమోదైన బల్క్ డీల్ సమాచారం ప్రకారం 4.2 కోట్ల యాక్సిస్ బ్యాంక్ షేర్లను రూ. 1,315.13 సగటు ధరలో ప్రభుత్వం విక్రయించింది. ఇది బీఎస్ఈలో గురువారం యాక్సిస్ ముగింపు ధర రూ. 1,357తో పోలిస్తే 3.1% డిస్కౌంట్. కాగా, ఎల్ఐసీ 85 లక్షల షేర్లను కొనుగోలు చేయడం విశేషం. ఇందుకు రూ. 1,116 కోట్లను వెచ్చించింది. యాక్సిస్ షేర్లను కొన్న ఇతర సంస్థలలో సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్, గోల్డ్‌మన్ శాక్స్ సింగపూర్ ఉన్నాయి. వాటా విక్రయం కారణంగా యాక్సిస్‌లో ఎస్‌యూయూటీఐ వాటా 11.72%కు పరిమితమైంది. షేరు ఊగిసలాట... ప్రభుత్వ వాటా విక్రయం నేపథ్యంలో బీఎస్ఈలో యాక్సిస్ షేరు హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం సెషన్లో 3%పైగా పతనమై రూ. 1,313ను చేరగా, ఆపై కోలుకుని గరిష్టంగా రూ. 1,411ను సైతం తాకింది. చివరకు 2.7% లాభంతో రూ. 1,393 వద్ద ముగిసింది.