అమెరికాలో విప్రో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో తెలుసా?
అమెరికాలో దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ వస్తున్న ఆరోపణలకు ధీటుగా తాము కల్పిస్తున్న ఉద్యోగాలపై టెక్ దిగ్గజాలు ప్రకటనలు చేస్తున్నాయి.
బెంగళూరు : అమెరికాలో దేశీయ టెక్ కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం లేదంటూ వస్తున్న ఆరోపణలకు ధీటుగా తాము కల్పిస్తున్న ఉద్యోగాలపై టెక్ దిగ్గజాలు ప్రకటనలు చేస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 3000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు విప్రో ప్రకటించింది. దీంతో ఆ దేశంలో తమ ఉద్యోగుల సంఖ్యను 14వేలకు పైగా పెంచుకున్నట్టు తెలిపింది. కంపెనీ సమర్పించిన వార్షిక రిపోర్టులో ఈ విషయాలు వెల్లడించింది. అంతేకాక 2018 ఆర్థికసంవత్సరం తొలి క్వార్టర్ ముగిసేలోపల అమెరికాలోని ఉద్యోగుల్లో సగానికి పైగా ఉద్యోగులను స్థానికులనే ఉంచుకుంటామని బెంగళూరుకు చెందిన ఈ ఐటీ సంస్థ పేర్కొంది. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో అమెరికా కఠినతరమైన నిబంధనలు తీసుకురావడంతో కంపెనీలు స్థానిక ఉద్యోగులను విపరీతంగా నియమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో కొత్త ఉద్యోగాలను కూడా కల్పిస్తున్నాయి.
'' 2017 ఆర్థిక సంవత్సరంలో కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూ, మిచిగాన్ లోని ఫార్మింగ్టన్ హిల్స్ లలో రెండు దిగ్గజ మల్టిక్లయింట్ డెలివరీ సెంటర్లను ఏర్పాటుచేశాం. అమెరికాలోని విప్రోలో 3000 మంది స్థానిక ఉద్యోగులను చేర్చుకున్నాం. నేటితో అమెరికాలో 14వేల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్నాం. మరింత మంది స్థానికులను నియమించుకుంటాం. తమ యూఎస్ వర్క్ ఫోర్స్ లో మెజార్టీ స్థానికులనే ఉంచుకునేటట్టు చూస్తాం'' అని విప్రో సీఈవో అబిదలి నీముచ్ వాలా స్టేక్ హోల్డర్స్ కు రాసిన లేఖలో తెలిపారు. వీరిలో 49 మందికి పైగా ఉద్యోగులు కోటికి పైగా వేతనం ఆర్జిస్తున్నట్టు కూడా చెప్పారు.