విప్రో చేతికి అమెరికన్ కంపెనీ
♦ హెల్త్‌ప్లాన్ సర్వీసెస్ కొనుగోలు
♦ డీల్ విలువ రూ. 3,150 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో తాజాగా అమెరికాకు చెందిన హెల్త్‌ప్లాన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 460 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,150 కోట్లు)గా ఉంటుందని వివరించింది. అమెరికా హెల్త్ ఇన్సూరెన్స్ మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకోవడానికి ఈ కొనుగోలు ఉపయోగపడగలదని విప్రో తెలిపింది. వాటర్ స్ట్రీట్ హెల్త్‌కేర్ పార్ట్‌నర్స్ సంస్థ నుంచి హెల్త్‌ప్లాన్‌లో 100 శాతం వాటాలను విప్రో కొనుగోలు చేస్తోంది. ఫ్లోరిడా కేంద్రంగా పనిచేసే హెల్త్‌ప్లాన్.. అమెరికాలో వైద్య బీమా సంస్థలకు టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ సేవలు అందిస్తోంది.
ఇందులో 2,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. తమ క్లెయిమ్స్ ప్రాసెసింగ్, బ్యాక్ ఆఫీస్ సేవలను విస్తరించడానికి కూడా ఈ డీల్ దోహదపడగలదని విప్రో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్రీ హినాన్ జలీల్ తెలిపారు. 60-90 రోజుల్లోగా ఈ ఒప్పందం పూర్తి కాగలదని వివరించారు. విప్రో గతేడాది డిసెంబర్‌లో రెండు కంపెనీలను కొనుగోలు చేసింది. 77 మిలియన్ డాలర్లతో జర్మనీకి చెందిన సెలెంట్‌ను, 130 మిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన విటియోస్ గ్రూప్‌ను దక్కించుకుంది.