
మార్కెట్ రాణులు మహిళలే !
► మగవారికన్నా మెరుగ్గా రాణిస్తున్నది వారే
► ఓపిక, వేగంగా నిర్ణయాలు తీసుకోవటమే కారణం
► భాగస్వామ్యం మరింత పెరగాలి: నిపుణులు
స్టాక్ మార్కెట్ మదుపరులుగా మగవారి కన్నా మహిళలే మెరుగ్గా రాణిస్తున్నారట!!. వ్యక్తిగతంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చక్కని రాబడులు సాధిస్తున్న వారిలో మహిళలే ముందుంటున్నారట!! ఇవి పరిశోధనల సాక్షిగా... విశ్లేషకులు చెబుతున్న వాస్తవాలు. ఎందుకంటే స్టాక్‌మార్కెట్లో లాభాలు సంపాదించాలంటే పెట్టుబడులు పెట్టడంతో పాటు వాటిని నిర్ణీతకాలం పాటు కొనసాగించే ఓపిక కూడా ఉండాలి. దానికంటే ముందు సరైన పరిశోధన చేయాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చుకుంటూ వెళ్లాలి. ఇవన్నీ మహిళలకే సాధ్యమవుతున్నాయనేది వారి మాట. మహిళలు రాణించటానికి వారు చెబుతున్న కారణాలేమంటే...
రిస్కుకు మరీ ఎక్కువ భయపడొద్దు
శ్రీనిధి వయసు 32 ఏళ్లు. మూడేళ్ల పాప కూడా ఉంది. భర్త ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శ్రీనిధి గృహిణి. ఆర్థిక విషయాల గురించి పెద్దగా తెలియదు. ఓ రోజు ప్రమాదంలో శ్రీనిధి భర్త ప్రాణాలు కోల్పోయాడు. దాంతో శ్రీనిధికి ఉన్నట్టుండి సమస్యలు వచ్చి పడ్డాయి. ఆమె భర్త ఎన్నో సాధనాల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ ఒకటి రెండు తప్పిస్తే వేటికీ నామినేషన్ ఇవ్వలేదు. అప్పుడు ఓ బంధువు సూచన మేరకు శ్రీనిధి ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుంది. భర్త పేరిట ఉన్న ఇన్వెస్ట్‌మెంట్లను తన పేరు మీదకు బదిలీ చేసుకుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెట్టింది. మూడేళ్లలోనే ఆమె పెట్టుబడి రెండింతలు అయింది. నెలనెలా కుటుంబ అవసరాలకు ఆమె కొద్ది మొత్తంలో రిడెంప్షన్ తీసుకోవడం ప్రారంభించింది. కుటుంబ అవసరాలు, తన కుమార్తె విద్య, వివాహం, వాటి కోసం అనుసరించాల్సిన విధానం, ఏ ఏ సాధనాల్లో పెట్టుబడి పెట్టాలి తదితర వివరాలతో ఆమె సమగ్రంగా ఓ ప్రణాళిక కూడా రూపొందించుకుంది.
ఈ విషయంలో ఆర్థిక నిపుణుల సూచనలూ పాటించింది. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు ఆలస్యంగానే శ్రీనిధి చేతికొచ్చాయి. అయినా ఓపిగ్గా... సంయమనంతో పరిస్థితిని చక్కదిద్దుకుంది. ఒకవేళ శ్రీనిధి ముందుగానే ఈ బాధ్యతలు తీసుకుని ఉంటే..? నామినీగా తన పేరును ముందే నమోదు చేసేలా భర్తకు సూచించి ఉండేది. భర్త హఠాన్మరణం తర్వాత అతని పేరిట ఉన్న ఆస్తులను బదిలీ చేసుకునేందుకు అంతగా శ్రమించే పనీ తప్పేది. అలాగే, పాప పుట్టాక ఆమె భవిష్యత్తు అవసరాలకు ఇంకాస్త ముందుగానే ఇన్వెస్ట్‌మెంట్ కూడా ప్రారంభించేలా భర్తతో కలసి ప్లాన్ చేసుకుని ఉండేది. అందుకే ఆర్థిక విషయాల పట్ల అవగాహనే కాక... కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో క్రియాశీలంగా ఉండటం ప్రతి మహిళకూ తప్పనిసరి.
స్టాక్ మార్కెట్లో ప్రతి కొనుగోలుపైనా లాభాన్నే ఆర్జించాలంటే సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో నష్టాన్ని పరిమితం చేసుకునేందుకు వాటిని వదిలించుకోక తప్పదు. కానీ, నష్టాలను బుక్ చేసుకోవడం ఓటమిని అంగీకరించడమేనని మగవారు భావిస్తుంటారు. అలాంటి ఆలోచనతో అవే పెట్టుబడులను కొనసాగిస్తూ పరిమిత నష్టాలు కాస్తా పెద్దవి కావడానికి కారణమవుతారు. మహిళలైతే ఈ విషయంలో కాస్త తెలివిగా ఉంటారు. అవసరమైతే ఆ నష్టాలకు అంతటితో చెక్ పెట్టేసి మెరుగైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటారు.
మహిళలు ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే దాన్ని నిర్ణీత కాలం పాటు కొనసాగిస్తారు. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెడితే మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాగానీ వాటి నుంచి దాదాపుగా పక్కకు తప్పుకోరు.
మహిళల్లో దూరదృష్టి ఎక్కువ. అసంతృప్తితోనో, మరే చిన్న చిన్న కారణాలతోనో తరచు తమ పెట్టుబడులను మార్చరు. పెట్టుబడి పెట్టాక దీర్ఘకాలం పాటు వేచి చూసే ధోరణి వారిలో ఉంటుంది. దీనివల్ల అనవసర వ్యయాలను ఆదా చేసినట్టే.
పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలను నియంత్రించుకోవడం కీలకం. ఈ విషయంలో మహిళలు పురుషుల కంటే ముందున్నారు.
మహిళల్లో ఉన్న మరో బలం... మార్కెట్‌లో వినిపించే వదంతుల్ని పట్టించుకోకపోవడం. ఒకసారి ప్రణాళికకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే వారు దానికే కట్టుబడి ఉంటారు. అందుకోసం నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెలా పక్కన పెడుతుంటారు.
మహిళల్లో తొందరపాటు ఉండదు. పెట్టుబడికి ముందే వారు తగినంత పరిశోధన కూడా చేస్తారు. కానీ, అదే పురుషులు కొనుగోళ్లు ఎక్కువ.. పరిశోధన తక్కువ అన్నట్టు వ్యవహరిస్తారు.
ఇష్టం పెంచుకోవాలి...
గడచిన పదేళ్లలో స్టాక్ మార్కెట్లలో మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు కోటక్ మహింద్రా బ్యాంక్ కన్సూమర్ బ్యాకింగ్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం చెప్పారు. అయినప్పటికీ పురుషులతో పోలిస్తే మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువ స్థాయిలోనే ఉందన్నారు. ఆర్థిక విషయాల పట్ల ఉన్న అయిష్టాన్ని మహిళలు విడిచిపెట్టాలని, ఇష్టం పెంచుకోవాలని యెస్ బ్యాంక్ క్లైమేట్ స్ట్రాటజీ గ్లోబల్ ప్రెసిడెంట్ నమితా వికాస్ సూచించారు.
‘‘చాలా మంది మహిళలు తప్పనిసరో లేక అవకాశం లేకో కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇది దురదృష్టకరం. సహజంగా మహిళలు కుటుంబ స్థితిగతుల పట్ల తగిన అవగాహనతో ఉంటారు. దాంతో మరింత తెలివిగా ఇన్వెస్ట్ చేయగలరు’’ అని నమిత పేర్కొన్నారు. మహిళలు కుటుంబ ఆర్థిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను తెలుసుకోవాలని వీరు సూచించారు.
మహిళల భాగస్వామ్యం పెరగటానికి నిపుణులు చేస్తున్న సూచనలివీ...
♦ ఆర్థిక విషయాలు పురుషులకే బాగా తెలుసన్న భావన నుంచి మహిళలు బయటకు రావాలి. కుటుంబ ఆర్థిక విషయాలను ఆసాంతం తెలుసుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి.
♦ పర్సనల్ ఫైనాన్స్ గురించి చదవడం ప్రారంభించాలి. లేదా ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ కోర్సులో చేరినా సరిపోతుంది.
♦ నేరుగా పెట్టుబడి పెట్టడానికి ముందు స్వల్ప పెట్టుబడితో నిజంగా కాకుండా డమ్మీ పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకుని దాన్ని పర్యవేక్షించాలి. సరైన అవగాహన, కిటుకులు తెలిసిన తర్వాత పెట్టుబడి ప్రారంభించాలి.
♦ కుటుంబానికి అవసరమైన ఆర్థిక లక్ష్యాలను గుర్తించేందుకు, పెట్టుబడులను ఎక్కడ పెట్టాలన్న విషయాలను తేల్చేందుకు జీవిత భాగస్వామితో కలసి చర్చించాలి.
♦ స్నేహితుల సలహాలు తీసుకోవద్దు.
♦ ఫీజు తీసుకుని సలహాలు ఇచ్చే ఫైనాన్షియల్ ప్లానర్ సేవలు పొందాలి.
♦ విశ్వాసం, నేర్చుకునేందుకు ఆసక్తి అనేవి మంచి విజయ సాధనాలు.
♦ పొదుపులో మహిళలు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయంలో మగవారికంటే వీరికే ఎక్కువ మార్కులు పడతాయి. ఈ పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌కు మళ్లించి లాభాలు పొందడానికి నిపుణులు ఏమంటున్నారంటే..
రిస్క్ తీసుకోవటానికి వెనకాడొద్దు
నష్ట భయమనేది నగదు నిర్వహణ విషయంలో మహిళలను వెనక్కి లాగే అంశాల్లో ప్రధానమైనది. సరైన సాధనాల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ కొందరు అభద్రతకు లోనవుతున్నారు. జీవితాంతం తగినంత నగదు చేతిలో ఉండదేమోనని సందేహిస్తున్నారు. ఇవి వారిని రిస్క్ తీసుకోకుండా అడ్డుకుంటున్నాయి. ఫలితంగా ఎక్కువ మంది మహిళలు ఈక్విటీలవైపు రావటం లేదు. పెట్టుబడులకు హామీ ఉండే బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, బాండ్లనే ఎంచుకుంటున్నారు. కానీ, ఈక్విటీల్లో పెట్టుబడులను సైతం పరిశీలించాలి. అప్పుడే మెరుగైన రాబడులొస్తాయి.
– మ్రినీ అగర్వాల్, ఉమంత్రా సహ వ్యవస్థాపకురాలు
–సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం