ప్రపంచ మార్కెట్లకు కోవిడ్‌ కాటు | World stock markets tumbles on Covid-19 fears | Sakshi
Sakshi News home page

ప్రపంచ మార్కెట్లకు కోవిడ్‌ కాటు

Published Thu, Jun 25 2020 9:34 AM | Last Updated on Thu, Jun 25 2020 9:40 AM

World stock markets tumbles on Covid-19 fears - Sakshi

ఈ ఏడాది(2020)లో ప్రపంచ ఆర్థిక వృద్ధి దాదాపు 5 శాతం క్షీణించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) తాజాగా అంచనా వేసింది. తొలుత అంతర్జాతీయ జీడీపీ 3 శాతం క్షీణతను మాత్రమే చవిచూడనున్నట్లు అభిప్రాయపడింది. అమెరికా, చైనా తదితర దేశాలలో రెండో దశ కోవిడ్‌-19 కేసులు తలెత్తుతున్న నేపథ్యంలో ఐఎంఎఫ్‌ తాజాగా అంచనాలు సవరించింది. ఇప్పటికే బీజింగ్‌లో కరోనా కేసులు పెరుగుతుండగా.. న్యూయార్క్‌, న్యూజెర్సీ తదితర రాష్ట్రాలు సైతం మళ్లీ కోవిడ్‌-19 బారిన పడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. దీంతో మరోసారి ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల ఆవశ్యకత ఏర్పడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకులు ఇకపై 14 రోజులపాటు సొంత క్వారంటైన్‌ పాటించవలసి ఉంటుందని న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్ర గవర్నర్లు ప్రకటించారు. ఫ్లోరిడా, ఒక్లహామా, దక్షిణ కరోలినాలలో ఇటీవల కోవిడ్‌ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆందోళనకు లోనైన ఇన్వెస్టర్లు బుధవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు తెరతీశారు. 

ఆసియా సైతం
బుధవారం డోజోన్స్‌ 710 పాయింట్లు(2.75 శాతం) పతనమై 25,446 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 81 పాయింట్లు(2.6 శాతం) పడిపోయి 3,050 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 222 పాయింట్లు(2.2 శాతం) కోల్పోయి 9,909 వద్ద స్థిరపడింది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 10,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. యూరోపియన్‌ మార్కెట్లలో ఫ్రాన్స్‌, యూకే 3 శాతం, జర్మనీ 3.5 శాతం చొప్పున పతనమయ్యాయి. కాగా.. ప్రస్తుతం ఆసియాలో కొరియా, థాయ్‌లాండ్‌, జపాన్‌, సింగపూర్‌, ఇండొనేసియా 2-1 శాతం మధ్య క్షీణించాయి. చైనా, తైవాన్‌, హాంకాంగ్‌ మార్కెట్లకు సెలవు. కాగా.. ముడిచమురు ధరలు సైతం బుధవారం 5 శాతం(2 డాలర్లు) చొప్పున పతనమయ్యాయి.

క్రూయిజర్‌ వీక్‌
యూఎస్‌ ఎయిర్‌లైన్స్‌, క్రూయిజర్‌ కంపెనీల కౌంటర్లకు అమ్మకాల షాక్‌ తగిలింది. క్రూయిజ్‌ కంపెనీ కార్నివాల్‌ కార్ప్‌నకు రేటింగ్‌ దిగ్గజం ఎస్‌అండ్‌పీ ‘జంక్‌’ హోదాను ప్రకటించడంతో ఈ షేరు 11 శాతం కుప్పకూలింది. ఈ బాటలో రాయల్‌ కరిబియన్‌, నార్వేజియన్‌ క్రూయిజ్‌ లైన్‌, విన్‌ రిసార్ట్స్‌ తదితరాలు సైతం 11 శాతం స్థాయిలో పతనమయ్యాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం డిస్నీ 4 శాతం క్షీణించింది. కాగా.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ వీఎంవేర్‌ ఇంక్‌ను విడదీసి విక్రయించనున్నట్లు ప్రకటించడంతో కంప్యూటర్ల దిగ్గజం డెల్‌ 8 శాతం జంప్‌చేసింది. వీఎంవేర్‌ 2.5  శాతం బలపడింది. వీఎంవేర్‌ ఇంక్‌లో డెల్‌ వాటా విలువ 50 బిలియన్‌ డాలర్లుగా అంచనా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement