హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షావోమి.. మూడేళ్ల క్రితం భారత్‌లో ప్రవేశించిన ఈ చైనా మొబైల్ సంస్థ... అతి తక్కువ సమయంలోనే మార్కెట్లో పాగా వేసింది. ఐడీసీ సెప్టెంబర్ త్రైమాసికం గణాంకాల ప్రకారం 23.5 శాతం వాటాతో భారత్‌లో నంబర్–1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. ఫీచర్ రిచ్ మోడళ్లు, నాణ్యత, తక్కువ ధరలే ఇందుకు ప్రధాన కారణమని షావోమి ఇండియా ఎండీ మను జైన్ తెలిపారు. హైదరాబాద్‌లో సంస్థకు చెందిన ప్రధాన మొబైల్ విక్రేతలతో సమావేశమైన సందర్భంగా సోమవారం ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో ప్రత్యేకంగా మాట్లాడారు. మార్కెటింగ్ వ్యయాలు పెద్దగా లేకపోవడం వల్లే పోటీలో ముందున్నామని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..
మార్కెటింగ్ ఖర్చులు లేకుండా..
దాదాపు అన్ని కంపెనీలు మార్కెటింగ్‌పై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. మా వ్యాపార విధానం దీనికి భిన్నం. నాణ్యతలో రాజీ లేకుండా మంచి మోడళ్లను తేవడంపై, సర్వీసింగ్ సెంటర్ల ఏర్పాటుపైనే ఫోకస్ చేశాం. మార్కెటింగ్ ఖర్చులు లేవు. కేవలం 300 మంది ఉద్యోగులే ఉన్నారు. దేశీయంగా తయారీ చేపట్టాం. కాబట్టి ఫోన్లను పోటీ ధరలో ప్రవేశపెట్టగలుగుతున్నాం. ఇబ్బడిముబ్బడిగా సరుకు నిల్వ ఖర్చులు లేవు. తక్కువ మార్జిన్‌తోనే వ్యాపారం చేస్తున్నాం.
కొన్ని మోడళ్లతోనే పోటీలో..
ప్రతి మోడల్ దేనికదే ప్రత్యేకం. తక్కువ మోడళ్లతోనే మార్కెట్లో నిలదొక్కుకుంటాం. 2017లో 8 మోడళ్లే తీసుకొచ్చాం. వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో కొత్త మోడళ్లుంటాయి. షావోమి కస్టమర్లలో 85 శాతం మంది 18–35 ఏళ్ల వయసువారు. వీరంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారే. మోడళ్ల తయారీలో 20 లక్షల పైచిలుకు ఫ్యాన్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 650కి పైగా సర్వీసింగ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 17 కేంద్రాలను నిర్వహిస్తున్నాం. ఎక్స్‌పీరియెన్స్ జోన్స్ అయిన ‘మి’ హోమ్స్ 13 వరకూ ఉన్నాయి.
మేక్ ఇన్ ఇండియాలో మేం కూడా...
ఇప్పటి వరకు భారత్‌లో రూ.3,000 కోట్లదాకా పెట్టుబడి పెట్టాం. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రెండు, నోయిడాలో ఒక ప్లాంటు ఉన్నాయి. దశలవారీగా తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం. విడిభాగాల తయారీ కంపెనీలను భారత్‌కు ఆహ్వానిస్తున్నాం. రెండేళ్లలో పూర్తి తయారీ ఇక్కడే చేపట్టాలన్నది మా లక్ష్యం. స్టార్టప్స్‌లో పెట్టుబడులను కూడా కొనసాగిస్తున్నాం. అయిదేళ్లలో 100 స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టడమేగాక, మోడళ్ల తయారీలో ఆ కంపెనీలను భాగస్వాముల్ని చేస్తాం.
ఆఫ్‌లైన్లో అంచనాలను మించి విక్రయాలు...
కంపెనీ విక్రయాల్లో ఆఫ్‌లైన్ వాటా 20 శాతానికి చేరుకుంది. 2018 ప్రారంభంలో ఇది 30 శాతానికి ఎగబాకుతుందని అంచనా. ఆఫ్‌లైన్ బాగుంది. ప్రిఫర్డ్ పార్టనర్లు 15 నగరాల్లో 1,000కిపైగా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో భాగస్వాములను నియమిస్తాం. ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 50.8 శాతం వాటాతో షావోమి టాప్‌లో నిలిచింది. 2014 మూడో త్రైమాసికంలో లక్ష యూనిట్లు మాత్రమే విక్రయించాం. 2017 మూడవ త్రైమాసికంలో 92 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాం. పండుగల సీజన్లో 40 లక్షల స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో సంచలనం సృష్టించాం.
వచ్చే ఏడాది షావోమి ఐపీఓ!
స్మార్ట్ ఫోన్‌ల తయారీ కంపెనీ, షావోమి/లిటిల్ రైస్ త్వరలో చైనాలో ఐపీఓకు రానుంది. ఐపీఓ విషయమై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్‌తో చర్చలు జరుపుతున్న ఈ కంపెనీ తమ కంపెనీ విలువ కనీసం 5,000 కోట్ల డాలర్లు ఉండాలని కోరుతోందని సమాచారం. బీజింగ్‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓ వచ్చే ఏడాది హాంగ్‌కాంగ్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి.
2010లో ప్రారంభమైన ఈ కంపెనీ సంప్రదాయ రిటైల్ స్టోర్స్ అమ్మకాలను తోసిరాజని ఆన్‌లైన్ ద్వారా జోరుగా అమ్మకాలు సాధించింది. ఫ్లాష్ సేల్స్‌తో ఈ కంపెనీ బాగా ప్రాచుర్యం పొందింది. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో తనదైన ముద్రను వేసింది. 2014లో ఈ కంపెనీ చివరి సారిగా నిధులు సమీకరించింది. అప్పుడు ఈ సంస్థను 4,600 కోట్ల డాలర్లుగా లెక్కగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment