సాక్షి, న్యూఢిల్లీ : యస్ బ్యాంక్ అవినీతి కేసులో విచారణను ఎదుర్కొంటున్న బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ కుమార్తె రోష్ని కపూర్ లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ముంబై విమానాశ్రయంలో అధికారులు అడ్డగించారు. ఈ కేసులో రోష్ని కపూర్ సహా రాణా కపూర్ కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా లుక్‌అవుట్ నోటీస్ జారీ అయిన నేపథ్యంలో ఆమెను విమానాశ్రయంలో అధికారులు దేశం విడిచివెళ్లకుండా నిలువరించారు. ఈ కేసులో ఆదివారం తెల్లవారుజామున అరెస్ట్ అయిన రాణా కపూర్‌ను మార్చి 11 వరకూ ఈడీ కస్టడీకి ముంబై కోర్టు అప్పగించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ, ముంబైలోని కపూర్, ఆయన కుమార్తెల నివాసాలపై ఈడీ దాడుల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. దివాలా తీసిన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజం డీహెచ్‌ఎఫ్‌ఎల్ సహా పలు కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా రాణా కపూర్ ప్రోద్బలంతో పెద్దమొత్తంలో రుణాలు జారీ అయ్యాయని, అందుకు ప్రతిగా ఆయా కంపెనీల నుంచి రూ కోట్లు ముడుపులు కపూర్‌కు ముట్టాయని వెల్లడైంది. ఈ ముడుపులు స్వీకరించేందుకు కపూర్, ఆయన కుటుంబ సభ్యులు 20కిపైగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారని ఈడీ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment