యస్ బ్యాంక్ లాభం 32% అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం 32 శాతం ఎగిసి రూ. 966 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.732 కోట్లు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ ఆదాయం రూ. 4,763 కోట్ల నుంచి రూ. 5,786 కోట్లకు పెరిగింది. అటు వడ్డీ ఆదాయం రూ. 3,802 కోట్ల నుంచి రూ. 4,654 కోట్లకు చేరగా.. పెట్టుబడులపై ఆదాయం మాత్రం రూ.959 కోట్ల నుంచి రూ.903 కోట్లకు క్షీణించింది. రూ. 10 ముఖవిలువ గల 1 ఈక్విటీ షేరును రూ. 2 ముఖ విలువతో అయిదు షేర్ల కింద విభజించాలన్న ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసిందని యస్ బ్యాంక్ వెల్లడించింది.
0.97 శాతానికి స్థూల ఎన్‌పీఏలు ..
బ్యాంకు లాభదాయకతకు కొలమానం అయిన నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.6 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది. వడ్డీ ఆదాయం 44 శాతం వృద్ధితో రూ. 1,809 కోట్లకు చేరింది. గతేడాది జూన్ త్రైమాసికంలో మొత్తం రుణాల్లో 0.79 శాతంగా ఉన్న స్థూల ఎన్‌పీఏలు (జీఎన్‌పీఏ) ఈ ఏడాది జూన్ ఆఖరు నాటికి 0.97 శాతానికి పెరిగాయి. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌ఎన్‌పీఏ) 0.29 శాతం నుంచి 0.39 శాతానికి చేరాయి. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు రూ. 207 కోట్ల నుంచి రూ. 286 కోట్లకు పెరిగాయి. మరో త్రైమాసికంలో తాము 14వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నామన్న యస్ బ్యాంక్ ఎండీ రాణా కపూర్.. 2020 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే దిశలోనే పురోగమిస్తున్నామన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేరు సమారు 6 శాతంపెరిగి రూ. 1,712.55 వద్ద ముగిసింది.